పెట్రోల్‌లో ఇథనాల్ కలపటం వల్ల లాభనష్టాలివీ...
దిగుమతుల బిల్లు తగ్గి... రూపాయిపై ఒత్తిడి తగ్గుతుంది
చెరకు రైతులకు మరో ఆదాయం... గ్రామాల్లో కొత్త ఎకానమీ
డిస్టిలరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, మరిన్ని లాజిస్టిక్స్ సౌకర్యాలు
కాకపోతే 2023కు ముందటి వాహనాలకు కాస్త ఇబ్బందే
దీర్ఘకాలంలో ఇంజిన్ సిస్టమ్ దెబ్బతినే అవకాశం
ఇథనాల్ వల్ల పికప్ పెరిగినా... మైలేజీ తగ్గుతుంది
మార్కెట్లోకి ఈ–85 ఫ్లెక్స్ ఇంధనం; రూ.20 తగ్గుదల
దీన్ని వాడటానికి కొత్తగా ఫ్లెక్స్ వాహనాలు
మైలేజీతో పోలిస్తే డిస్కౌంట్‌తో లాభం సున్నా
ఇథనాల్!!. దీనిచుట్టూ ముఖ్యమైన ఆర్థికాంశాలున్నాయి. దాన్ని మించిన రాజకీయాలున్నాయి. వీటన్నిటినీ మించిన ప్రచార హోరు ఉంది. సరే! మరి వాస్తవాలేంటి? ఈ–20, ఈ–30 నుంచి మనమిప్పుడు ఈ–85కు వచ్చేశామని కేంద్రం ఘనంగా ప్రకటిస్తోంది.
అంటే... 85 శాతం ఇథనాల్, మిగిలిన 15 శాతం పెట్రోల్ కలిపి వాహనాల్లో ఇంధనంగా వాడతారన్న మాట. మరి ఇలా వాడటం వల్ల ఎవరికెంత లాభం? ఎవరికెంత నష్టం? మన వాహనాలు వీటన్నిటికీ రెడీయేనా? ఇదంతా కేవలం ప్రభుత్వ దిగుమతి బిల్లు తగ్గించుకోవటానికేనా? పర్యావరణ హితమని చెబుతున్నదాంట్లో నిజమెంత? ఇవన్నీ వివరించేదే ఈ ప్రత్యేక కథనం..
రూపాయి పతనాన్ని అడ్డుకోవాలన్నా... డాలర్ కాస్త దిగిరావాలన్నా మొదట మనం చమురు, బంగారం దిగుమతులు తగ్గించుకోవాలి. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపేసి విక్రయించటం మొదలుపెట్టింది కూడా అందుకే. నిజానికి ఇథనాల్ బ్లెండింగ్ 2001లో మొదలైంది. ప్రయోగాత్మకంగా కొన్ని రాష్ట్రాల్లో మొదలై... రకరకాల దశలు దాటుతూ చివరకు 2014 నాటికి బ్లెండింగ్ 2 శాతానికి చేరింది. అప్పట్లో ఇథనాల్ ఉత్పత్తి భారీగా లేకపోవటమూ దీనిక్కారణమే.
కానీ తరవాత కేంద్రం వేగంగా కదిలి.. ఉత్పత్తిని పెంచే చర్యలు తీసుకోవటంతో ఇపుడు పెట్రోల్‌లో ఇథనాల్ 20 శాతానికి చేరిపోయింది. ఇపుడు దేశంలో ఏకంగా రోజుకు 20 బిలియన్ లీటర్ల ఇథనాల్ ఉత్పత్తవుతోంది. దీనిలో 12 బిలియన్ లీటర్లను మాత్రమే ఈ–20 రూపంలో కలపగలుగుతున్నారు. మిగిలిన ఇథనాల్‌ను కూడా వాడకంలోకి తెచ్చేందుకే ఇపుడు ఏకంగా ఈ–85 అంటూ ఫ్లెక్స్ ఇంధనాన్ని అమల్లోకి తెచ్చారు. దీనికోసం పలు కంపెనీలు ఫ్లెక్స్ వాహనాలను కూడా తయారు
చేయటం మొదలెట్టాయి.
జనం ఆందోళనేంటి? అందులో నిజమెంత?
ఈ–85 ఫ్లెక్స్ ఇంధనాన్ని దానికోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్స్ వాహనాల్లో వాడతారు కనక ఇబ్బందులుండవు. కానీ ఈ–20 అనేది చాలా వేగంగా సాధించిన బ్లెండింగ్. ఈ బ్లెండింగ్ పెరిగినంత వేగంగా దాన్ని తట్టుకునే వాహనాలను కంపెనీలు తయారు చేయలేదు. 2023 ఏప్రిల్ నుంచీ ఈ–20 మిశ్రమాన్ని తట్టుకునే వాహనాలనే తయారు చేయాలని కేంద్రం నిబంధనలు తెచ్చింది. 2025 నుంచి ఈ–20ని మరింత సమర్థంగా మార్చే వాహనాల్ని తయారు చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఇదంతా బాగానే ఉంది. కానీ 2023కు ముందు రోడ్లపైకి వచ్చిన వాహనాల సంగతేంటి? అవి ఈ–20ని తట్టుకోగలవా? వాహనాలు పాడైపోవా? జవాబుదారీ ఎవరిది? ఇదే జనం ఆందోళన. వాటిలో నిజానిజాలేంటో ఒకసారి చూద్దాం...
ఈ–10 వరకూ ఫర్వాలేదు...
ఈ–10 వరకూ ఏ వాహనమైనా ఓకే. ప్రపంచవ్యాప్తంగా వాహనాలన్నీ ఈ–10తో పెద్ద సమస్యలు లేకుండానే నడుస్తున్నాయి. వాహనాల జీవితకాలం పెద్దగా తగ్గటమంటూ ఉండదు.
ఈ–20.. ఆధునిక వాహనాలైతే ఓకే...
వీటికోసం ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాలైతే (2023 ఏప్రిల్ తర్వాత వచ్చినవి) ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఎందుకంటే వాహనాల ఫ్యూయల్ పంప్‌లను, ఇంజెక్టర్లను, ఫ్యూయల్ లైన్స్‌ను, ఇంజిన్ కాలిబరేషన్‌ను కంపెనీలు మార్చాయి. కానీ ఇలా మార్చని వాహనాల్లో ఈ–20 వాడితే కొంత ఇబ్బందేనన్నది నిపుణుల మాట. ట్యాంకు, పంపు, పైపులు, ఇంజెక్టర్లు, రబ్బర్ సీల్స్‌తో కూడిన ఇంజిన్ సిస్టమ్ దీర్ఘకాలంలో అరిగి దెబ్బతినే అవకాశాలు ఎక్కువన్నది వారి వారి్నంగ్.
ఈ–85, ఈ–100... ఫ్లెక్స్ వాహనాలకే
ఈ ఇంధనాన్ని వాడాలంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఉన్న వాహనాలు కావాలి. సాధారణ వాహనాల్లో ఈ ఇంధనం వాడలేం. దీనికి విభిన్నమైన ఫ్యూయల్ మ్యాపింగ్, సెన్సర్లు, భిన్నమైన భాగాలుంటాయి కనక ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఈ రకం వాహనాలను ఇప్పటికే బ్రెజిల్‌లో లక్షల కొద్దీ వాడుతున్నారు. మన దేశంలోనూ పలు కంపెనీలు ప్రత్యేక ఫ్లెక్స్ వాహనాలను తయారు చేసి ఇప్పటికే విడుదల చేశాయి.
పికప్, మైలేజీ సంగతేంటి?
ఇథనాల్‌ను పెట్రోల్‌తో పోలిస్తే ఆక్టేన్ రేటింగ్ ఎక్కువ. దీంతో ఇంజిన్ న్యాకింగ్‌ను బాగా తట్టుకుంటుంది. సామర్థ్యం ఎక్కువ. పికప్ బాగుంటుంది. కాకపోతే మైలేజీ మాత్రం పెట్రోల్‌తో పోలిస్తే తక్కువే. ఎందుకంటే పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో 30– 35 శాతం ఎనర్జీ తక్కువ. దీనివల్ల ఈ–20 అయితే 3–8 శాతం... ఈ–85 అయితే 20–30 శాతం, ఈ–100 అయితే 25–35 శాతం మైలేజీ పడిపోయే అవకాశం ఎక్కువ. అంటే ఇథనాల్‌తో మైలేజీ తగ్గటమన్నది వాస్తవం.
ఇక ఇంజిన్ విషయానికొస్తే కొత్త వాహనాలకైతే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. 2023కు ముందు వాహనాలైతే కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదన్నది నిపుణుల మాట. పైపెచ్చు ఇథనాల్ గాలి నుంచి ఎక్కువ తేమను లాక్కుంటుంది. దీనివల్ల దీర్ఘకాలం వాడకుండా ఉంచితే పనిచేయటం మానేయొచ్చు. బోట్లు, జనరేటర్లలోనూ సమస్యలు ఎక్కువ వస్తుంటాయి.
లాభమెవరికి... నష్టమెవరికి?
దిగుమతుల కోసం భారీగా డాలర్లు వెచ్చిస్తున్న మన కేంద్ర ప్రభుత్వానికి ఇథనాల్ కాస్త ఊరటనే చెప్పాలి. దీనివల్ల కొంతయినా దిగుమతుల బిల్లు తగ్గుతోంది. చెరకు రైతులకూ కొంతవరకూ లాభమే. గ్రామాల్లో డిస్టిలరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయి. లాజిస్టిక్స్ అవసరాలు పెరుగుతాయి. కాకపోతే... భారీగా చెరకు, జొన్న, ఆహారధాన్యాలు అవసరమవుతాయి. పైపెచ్చు చెరకు పంటకు విపరీతమైన నీటి వనరులు కావాలి. భారీగా పండించాలంటే భారీగా జలవనరులూ కావాలి. ఇదే పలువురి ఆందోళనకు కారణమవుతోంది. పంటలను ఆహారానికి ఖర్చు చేయాలా? ఇంధనానికి ఖర్చు చేయాలా? అన్న చర్చ కూడా మొదలైంది. వీటన్నిటికీ కేంద్రం సరైన సమాధానం చెప్పగలిగినప్పుడే ఇథనాల్ ఎకానమీ ప్రశాంతంగా ముందుకెళుతుంది.
ఇదీ... ఫ్లెక్స్ ఎకానమీ
ఈ–85 ఇంధనాన్ని ఈ–20 కన్నా లీటరుకు రూ.20 తగ్గించి విక్రయిస్తున్నారు. దీన్నో ఆకర్షణీయ డిస్కౌంట్‌గా ప్రభుత్వం చెబుతున్నా... తగ్గుతున్న మైలేజీతో పోలిస్తే ఈ డిస్కౌంట్ వల్ల ఏమాత్రం లాభం లేదన్నది సామాన్యుల మాట. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది చివరి నాటికి ఈ–85 ఇథనాల్ స్టేషన్లను 500 ఏర్పాటు చేయాలని లక్ష్యంగా
పెట్టుకుంది. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 5వేలకు చేర్చాలనేది లక్ష్యం. ఇక వాహన తయారీ కంపెనీలు ఇప్పటికే మార్కెట్లోకి కొత్త మోడళ్లు తెచ్చేశాయి. మారుతీ సుజుకీ వ్యాగన్–ఆర్, హీరో సంస్థ స్ప్లెండర్, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్‌లో ఫ్లెక్స్ మోడళ్లు తెచ్చాయి. మిగిలిన కంపెనీలూ పలు మోడళ్ల
తయారీలో ఉన్నాయి.
ఏంటీ ఇథనాల్? ఎలా వస్తుంది?
ఇథనాల్ అంటే... చక్కెరలు, పిండిపదార్థాలు పులియబెట్టడం ద్వారా తయారయ్యే ఆల్కహాల్. సాధారణంగా చెరకురసం, చక్కెర పరిశ్రమలో వచ్చే మొలాసిస్, జొన్న, పాడైన ఆహారధాన్యాలు, వరి, గోధుమ, వ్యవసాయ వ్యర్థాల నుంచి దీన్ని తయారు చేస్తుంటారు.
స్టాక్ మార్కెట్లో లబ్ధిదారులు ఎవరు?
భారత్‌లో ఇథనాల్ మిశ్రమ ఇంధనాల (ఈ20, ఈ85, ఈ100) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ఇథనాల్ సంబంధిత కంపెనీలు సమానంగా లాభపడవు. కొన్ని ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
ఇథనాల్ ఉత్పత్తి కంపెనీలు
బల్‌రామ్‌పూర్ చినీ మిల్స్
దేశంలోని అతిపెద్ద ఇథనాల్ ఉత్పత్తిదారుల్లో ఒకటి. భారీ స్థాయిలో డిస్టిలరీల విస్తరణ. చక్కెర, ఇథనాల్ వ్యాపారాల సమీకరణ చేస్తుంది. ఇథనాల్ డిమాండ్ పెరిగితే అత్యధికంగా లాభపడే కంపెనీల్లో ఇది ముందుంటుంది.
ప్రజ్ ఇండస్ట్రీస్
ఇథనాల్ ప్లాంట్ల రూపకల్పన, నిర్మాణంలో నైపుణ్యం. ఏ కంపెనీ కొత్త ప్లాంటు నిర్మించినా ఆర్డర్లు పొందే అవకాశం.రెండో తరం (2జీ) ఇథనాల్ టెక్నాలజీలో కూడా కీలక పాత్ర. దేశ ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 20 బిలియన్ లీటర్ల నుంచి 30 బిలియన్ లీటర్లకు పెరిగితే ప్రజ్‌కు భారీ అవకాశాలు ఉండొచ్చు.
త్రివేణి ఇంజినీరింగ్
చక్కెర. డిస్టిలరీలు, ఇథనాల్ ఈ మూడు రంగాల్లోనూ ఉనికి ఉండడం వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది.
దాల్మియా భారత్ షుగర్
లిస్టెడ్ షుగర్ కంపెనీల్లో ఇథనాల్‌పై ఎక్కువ దృష్టి పెట్టిన సంస్థల్లో ఒకటి.
శ్రీ రేణుక షుగర్స్
చక్కెర, ఇథనాల్ రంగాల్లో బలమైన స్థానం కలిగిన కంపెనీ.
మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ కంపెనీలు
నీటి కొరత కారణంగా భవిష్యత్తులో చెరకు కంటే మొక్కజొన్న (మైజ్) ఆధారిత ఇథనాల్‌కు ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది.
→ గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్స్ – మొక్కజొన్న ప్రాసెసింగ్‌లో బలమైన ఉనికి.
→ సుఖ్‌జిత్ స్టార్చ్ అండ్ కెమికల్స్
చమురు మార్కెటింగ్ కంపెనీలు:
→ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
→ భారత్ పెట్రోలియం కార్పొరేషన్
→ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్
ఇవి ఈ 85, ఈ100 ఇథనాల్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాయి. ఇథనాల్ నిల్వలు, రవాణా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తాయి. అయితే వీటి మొత్తం ఆదయాంలో ఇథనాల్ వాటా తక్కువే కావడం వల్ల ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశముంది.
ఆటో మొబైల్ కంపెనీలు
→ మారుతీ సుజుకీ
దేశంలో తొలి ఫ్లెక్స్–ఫ్యూయల్ ప్యాసింజర్ కారును ప్రవేశపెట్టింది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ముందుగానే సన్నద్ధమవుతోంది.
→ హీరో మోటోకార్ప్
భారత్ ప్రధానంగా ద్విచక్ర వాహనాల మార్కెట్ కావడంతో మంచి అవకాశాలు ఉన్నాయి.
→ బజాజ్ ఆటో
భవిష్యత్తులో ఫ్లెక్స్–ఫ్యూయల్ వాహనాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఇవన్నీ దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఆసక్తికరమైన ఎంపికలే..ఇంకా ఇథనాల్ తయారీదారులతో పాటు డిస్టిలేషన్ పరికరాల తయారీ, నిల్వ ట్యాంకులు, ఇన్‌ఫ్రా, బయోఫ్యూయెల్, ధాన్యం ప్రాసెసింగ్ కంపెనీలకూ లాభమే.
→ భారత్‌లో ఈ–20 అమల్లో ఉంది. అంటే మనకు వస్తున్న పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి విక్రయిస్తున్నారు.
→ బెజిల్ ఎప్పటి నుంచో ఈ–85. ఈ–100ని విక్రయిస్తోంది.
(రమణమూర్తి మంథా)


