breaking news
ramanamurthi
-
ఈ–20... మనకేంటి?
ఇథనాల్!!. దీనిచుట్టూ ముఖ్యమైన ఆర్థికాంశాలున్నాయి. దాన్ని మించిన రాజకీయాలున్నాయి. వీటన్నిటినీ మించిన ప్రచార హోరు ఉంది. సరే! మరి వాస్తవాలేంటి? ఈ–20, ఈ–30 నుంచి మనమిప్పుడు ఈ–85కు వచ్చేశామని కేంద్రం ఘనంగా ప్రకటిస్తోంది. అంటే... 85 శాతం ఇథనాల్, మిగిలిన 15 శాతం పెట్రోల్ కలిపి వాహనాల్లో ఇంధనంగా వాడతారన్న మాట. మరి ఇలా వాడటం వల్ల ఎవరికెంత లాభం? ఎవరికెంత నష్టం? మన వాహనాలు వీటన్నిటికీ రెడీయేనా? ఇదంతా కేవలం ప్రభుత్వ దిగుమతి బిల్లు తగ్గించుకోవటానికేనా? పర్యావరణ హితమని చెబుతున్నదాంట్లో నిజమెంత? ఇవన్నీ వివరించేదే ఈ ప్రత్యేక కథనం..రూపాయి పతనాన్ని అడ్డుకోవాలన్నా... డాలర్ కాస్త దిగిరావాలన్నా మొదట మనం చమురు, బంగారం దిగుమతులు తగ్గించుకోవాలి. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపేసి విక్రయించటం మొదలుపెట్టింది కూడా అందుకే. నిజానికి ఇథనాల్ బ్లెండింగ్ 2001లో మొదలైంది. ప్రయోగాత్మకంగా కొన్ని రాష్ట్రాల్లో మొదలై... రకరకాల దశలు దాటుతూ చివరకు 2014 నాటికి బ్లెండింగ్ 2 శాతానికి చేరింది. అప్పట్లో ఇథనాల్ ఉత్పత్తి భారీగా లేకపోవటమూ దీనిక్కారణమే. కానీ తరవాత కేంద్రం వేగంగా కదిలి.. ఉత్పత్తిని పెంచే చర్యలు తీసుకోవటంతో ఇపుడు పెట్రోల్‌లో ఇథనాల్ 20 శాతానికి చేరిపోయింది. ఇపుడు దేశంలో ఏకంగా రోజుకు 20 బిలియన్ లీటర్ల ఇథనాల్ ఉత్పత్తవుతోంది. దీనిలో 12 బిలియన్ లీటర్లను మాత్రమే ఈ–20 రూపంలో కలపగలుగుతున్నారు. మిగిలిన ఇథనాల్‌ను కూడా వాడకంలోకి తెచ్చేందుకే ఇపుడు ఏకంగా ఈ–85 అంటూ ఫ్లెక్స్ ఇంధనాన్ని అమల్లోకి తెచ్చారు. దీనికోసం పలు కంపెనీలు ఫ్లెక్స్ వాహనాలను కూడా తయారు చేయటం మొదలెట్టాయి. జనం ఆందోళనేంటి? అందులో నిజమెంత? ఈ–85 ఫ్లెక్స్ ఇంధనాన్ని దానికోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్స్ వాహనాల్లో వాడతారు కనక ఇబ్బందులుండవు. కానీ ఈ–20 అనేది చాలా వేగంగా సాధించిన బ్లెండింగ్. ఈ బ్లెండింగ్ పెరిగినంత వేగంగా దాన్ని తట్టుకునే వాహనాలను కంపెనీలు తయారు చేయలేదు. 2023 ఏప్రిల్ నుంచీ ఈ–20 మిశ్రమాన్ని తట్టుకునే వాహనాలనే తయారు చేయాలని కేంద్రం నిబంధనలు తెచ్చింది. 2025 నుంచి ఈ–20ని మరింత సమర్థంగా మార్చే వాహనాల్ని తయారు చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఇదంతా బాగానే ఉంది. కానీ 2023కు ముందు రోడ్లపైకి వచ్చిన వాహనాల సంగతేంటి? అవి ఈ–20ని తట్టుకోగలవా? వాహనాలు పాడైపోవా? జవాబుదారీ ఎవరిది? ఇదే జనం ఆందోళన. వాటిలో నిజానిజాలేంటో ఒకసారి చూద్దాం... ఈ–10 వరకూ ఫర్వాలేదు... ఈ–10 వరకూ ఏ వాహనమైనా ఓకే. ప్రపంచవ్యాప్తంగా వాహనాలన్నీ ఈ–10తో పెద్ద సమస్యలు లేకుండానే నడుస్తున్నాయి. వాహనాల జీవితకాలం పెద్దగా తగ్గటమంటూ ఉండదు. ఈ–20.. ఆధునిక వాహనాలైతే ఓకే... వీటికోసం ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాలైతే (2023 ఏప్రిల్ తర్వాత వచ్చినవి) ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఎందుకంటే వాహనాల ఫ్యూయల్ పంప్‌లను, ఇంజెక్టర్లను, ఫ్యూయల్ లైన్స్‌ను, ఇంజిన్ కాలిబరేషన్ను కంపెనీలు మార్చాయి. కానీ ఇలా మార్చని వాహనాల్లో ఈ–20 వాడితే కొంత ఇబ్బందేనన్నది నిపుణుల మాట. ట్యాంకు, పంపు, పైపులు, ఇంజెక్టర్లు, రబ్బర్ సీల్స్‌తో కూడిన ఇంజిన్ సిస్టమ్ దీర్ఘకాలంలో అరిగి దెబ్బతినే అవకాశాలు ఎక్కువన్నది వారి వారి్నంగ్. ఈ–85, ఈ–100... ఫ్లెక్స్ వాహనాలకే ఈ ఇంధనాన్ని వాడాలంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఉన్న వాహనాలు కావాలి. సాధారణ వాహనాల్లో ఈ ఇంధనం వాడలేం. దీనికి విభిన్నమైన ఫ్యూయల్ మ్యాపింగ్, సెన్సర్లు, భిన్నమైన భాగాలుంటాయి కనక ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఈ రకం వాహనాలను ఇప్పటికే బ్రెజిల్లో లక్షల కొద్దీ వాడుతున్నారు. మన దేశంలోనూ పలు కంపెనీలు ప్రత్యేక ఫ్లెక్స్ వాహనాలను తయారు చేసి ఇప్పటికే విడుదల చేశాయి.పికప్, మైలేజీ సంగతేంటి?ఇథనాల్‌ను పెట్రోల్‌తో పోలిస్తే ఆక్టేన్ రేటింగ్ ఎక్కువ. దీంతో ఇంజిన్ న్యాకింగ్ను బాగా తట్టుకుంటుంది. సామర్థ్యం ఎక్కువ. పికప్ బాగుంటుంది. కాకపోతే మైలేజీ మాత్రం పెట్రోల్‌తో పోలిస్తే తక్కువే. ఎందుకంటే పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో 30– 35 శాతం ఎనర్జీ తక్కువ. దీనివల్ల ఈ–20 అయితే 3–8 శాతం... ఈ–85 అయితే 20–30 శాతం, ఈ–100 అయితే 25–35 శాతం మైలేజీ పడిపోయే అవకాశం ఎక్కువ. అంటే ఇథనాల్‌తో మైలేజీ తగ్గటమన్నది వాస్తవం. ఇక ఇంజిన్ విషయానికొస్తే కొత్త వాహనాలకైతే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. 2023కు ముందు వాహనాలైతే కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదన్నది నిపుణుల మాట. పైపెచ్చు ఇథనాల్ గాలి నుంచి ఎక్కువ తేమను లాక్కుంటుంది. దీనివల్ల దీర్ఘకాలం వాడకుండా ఉంచితే పనిచేయటం మానేయొచ్చు. బోట్లు, జనరేటర్లలోనూ సమస్యలు ఎక్కువ వస్తుంటాయి.లాభమెవరికి... నష్టమెవరికి?దిగుమతుల కోసం భారీగా డాలర్లు వెచ్చిస్తున్న మన కేంద్ర ప్రభుత్వానికి ఇథనాల్ కాస్త ఊరటనే చెప్పాలి. దీనివల్ల కొంతయినా దిగుమతుల బిల్లు తగ్గుతోంది. చెరకు రైతులకూ కొంతవరకూ లాభమే. గ్రామాల్లో డిస్టిలరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయి. లాజిస్టిక్స్ అవసరాలు పెరుగుతాయి. కాకపోతే... భారీగా చెరకు, జొన్న, ఆహారధాన్యాలు అవసరమవుతాయి. పైపెచ్చు చెరకు పంటకు విపరీతమైన నీటి వనరులు కావాలి. భారీగా పండించాలంటే భారీగా జలవనరులూ కావాలి. ఇదే పలువురి ఆందోళనకు కారణమవుతోంది. పంటలను ఆహారానికి ఖర్చు చేయాలా? ఇంధనానికి ఖర్చు చేయాలా? అన్న చర్చ కూడా మొదలైంది. వీటన్నిటికీ కేంద్రం సరైన సమాధానం చెప్పగలిగినప్పుడే ఇథనాల్ ఎకానమీ ప్రశాంతంగా ముందుకెళుతుంది.ఇదీ... ఫ్లెక్స్ ఎకానమీ ఈ–85 ఇంధనాన్ని ఈ–20 కన్నా లీటరుకు రూ.20 తగ్గించి విక్రయిస్తున్నారు. దీన్నో ఆకర్షణీయ డిస్కౌంట్‌గా ప్రభుత్వం చెబుతున్నా... తగ్గుతున్న మైలేజీతో పోలిస్తే ఈ డిస్కౌంట్ వల్ల ఏమాత్రం లాభం లేదన్నది సామాన్యుల మాట. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది చివరి నాటికి ఈ–85 ఇథనాల్ స్టేషన్లను 500 ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 5వేలకు చేర్చాలనేది లక్ష్యం. ఇక వాహన తయారీ కంపెనీలు ఇప్పటికే మార్కెట్లోకి కొత్త మోడళ్లు తెచ్చేశాయి. మారుతీ సుజుకీ వ్యాగన్–ఆర్, హీరో సంస్థ స్ప్లెండర్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్‌లో ఫ్లెక్స్ మోడళ్లు తెచ్చాయి. మిగిలిన కంపెనీలూ పలు మోడళ్ల తయారీలో ఉన్నాయి.ఏంటీ ఇథనాల్? ఎలా వస్తుంది?ఇథనాల్ అంటే... చక్కెరలు, పిండిపదార్థాలు పులియబెట్టడం ద్వారా తయారయ్యే ఆల్కహాల్. సాధారణంగా చెరకురసం, చక్కెర పరిశ్రమలో వచ్చే మొలాసిస్, జొన్న, పాడైన ఆహారధాన్యాలు, వరి, గోధుమ, వ్యవసాయ వ్యర్థాల నుంచి దీన్ని తయారు చేస్తుంటారు.స్టాక్ మార్కెట్లో లబ్ధిదారులు ఎవరు?భారత్‌లో ఇథనాల్ మిశ్రమ ఇంధనాల (ఈ20, ఈ85, ఈ100) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ఇథనాల్ సంబంధిత కంపెనీలు సమానంగా లాభపడవు. కొన్ని ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.ఇథనాల్ ఉత్పత్తి కంపెనీలుబల్రామ్పూర్ చినీ మిల్స్ దేశంలోని అతిపెద్ద ఇథనాల్ ఉత్పత్తిదారుల్లో ఒకటి. భారీ స్థాయిలో డిస్టిలరీల విస్తరణ. చక్కెర, ఇథనాల్ వ్యాపారాల సమీకరణ చేస్తుంది. ఇథనాల్ డిమాండ్ పెరిగితే అత్యధికంగా లాభపడే కంపెనీల్లో ఇది ముందుంటుంది. ప్రజ్ ఇండస్ట్రీస్ ఇథనాల్ ప్లాంట్ల రూపకల్పన, నిర్మాణంలో నైపుణ్యం. ఏ కంపెనీ కొత్త ప్లాంటు నిర్మించినా ఆర్డర్లు పొందే అవకాశం.రెండో తరం (2జీ) ఇథనాల్ టెక్నాలజీలో కూడా కీలక పాత్ర. దేశ ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 20 బిలియన్ లీటర్ల నుంచి 30 బిలియన్ లీటర్లకు పెరిగితే ప్రజ్కు భారీ అవకాశాలు ఉండొచ్చు. త్రివేణి ఇంజినీరింగ్చక్కెర. డిస్టిలరీలు, ఇథనాల్ ఈ మూడు రంగాల్లోనూ ఉనికి ఉండడం వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది. దాల్మియా భారత్ షుగర్ లిస్టెడ్ షుగర్ కంపెనీల్లో ఇథనాల్‌పై ఎక్కువ దృష్టి పెట్టిన సంస్థల్లో ఒకటి. శ్రీ రేణుక షుగర్స్ చక్కెర, ఇథనాల్ రంగాల్లో బలమైన స్థానం కలిగిన కంపెనీ.మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ కంపెనీలు నీటి కొరత కారణంగా భవిష్యత్తులో చెరకు కంటే మొక్కజొన్న (మైజ్) ఆధారిత ఇథనాల్‌కు ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. → గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్స్ – మొక్కజొన్న ప్రాసెసింగ్‌లో బలమైన ఉనికి. → సుఖ్జిత్ స్టార్చ్ అండ్ కెమికల్స్చమురు మార్కెటింగ్ కంపెనీలు: → ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ → భారత్ పెట్రోలియం కార్పొరేషన్→ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ఇవి ఈ 85, ఈ100 ఇథనాల్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాయి. ఇథనాల్ నిల్వలు, రవాణా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తాయి. అయితే వీటి మొత్తం ఆదయాంలో ఇథనాల్ వాటా తక్కువే కావడం వల్ల ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశముంది.ఆటో మొబైల్ కంపెనీలు → మారుతీ సుజుకీ దేశంలో తొలి ఫ్లెక్స్–ఫ్యూయల్ ప్యాసింజర్ కారును ప్రవేశపెట్టింది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ముందుగానే సన్నద్ధమవుతోంది. → హీరో మోటోకార్ప్ భారత్ ప్రధానంగా ద్విచక్ర వాహనాల మార్కెట్ కావడంతో మంచి అవకాశాలు ఉన్నాయి. → బజాజ్ ఆటో భవిష్యత్తులో ఫ్లెక్స్–ఫ్యూయల్ వాహనాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇవన్నీ దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఆసక్తికరమైన ఎంపికలే..ఇంకా ఇథనాల్ తయారీదారులతో పాటు డిస్టిలేషన్ పరికరాల తయారీ, నిల్వ ట్యాంకులు, ఇన్ఫ్రా, బయోఫ్యూయెల్, ధాన్యం ప్రాసెసింగ్ కంపెనీలకూ లాభమే. → భారత్‌లో ఈ–20 అమల్లో ఉంది. అంటే మనకు వస్తున్న పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి విక్రయిస్తున్నారు. → బెజిల్ ఎప్పటి నుంచో ఈ–85. ఈ–100ని విక్రయిస్తోంది. (రమణమూర్తి మంథా) -
ఎఫ్ఐఐ వర్సెస్ డీఐఐ రిటైలర్లు చూడని కథేంటి?
రమణమూర్తి మంథా ‘‘ఈ రోజు ఎఫ్ఐఐలు రూ.5,000 కోట్ల విలువైన షేర్లు అమ్మారు. డీఐఐలు రూ.5,267 కోట్ల విలువైన షేర్లు కొన్నారు.’’ క్రికెట్ స్కోరులా కొన్నాళ్లుగా ఇన్వెస్టర్లు రోజూ ఇదే వార్త చూస్తున్నారు. అంకెలు మారొచ్చు కానీ... అమ్ముతున్నది ఎఫ్ఐఐలే. కొంటున్నది దేశీ ఫండ్లే. ఎందుకిలా? విదేశీ ఇన్వెస్టర్లకు మన మార్కెట్లపై విశ్వాసం తగ్గుతోందా? లేదా మన దేశీ మ్యూచువల్ ఫండ్లు బలోపేతమయ్యాయా? నిజమేంటి? ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిందొక్కటే. ఇదేదో స్మార్ట్ మనీకి, నడమంత్రపు సిరికి జరుగుతున్న యుద్ధమేమీ కాదు. రెండు భిన్నమైన పవర్ సెంటర్ల మధ్య పోరాటం. కాకపోతే ఎఫ్ఐఐల దగ్గరున్న ఆయుధాలు పెద్దవి. ఆ ఆయుధాల్ని ఎలా వాడతారో వివరించేదే ఈ వెల్త్ స్టోరీ...దేశీ ఫండ్లు ప్రధానంగా భారత స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించే ఆలోచిస్తుంటాయి. కానీ విదేశీ ఫండ్లు అమెరికా వడ్డీ రేట్లను, డాలర్ కదలికల్ని, ముడిచమురు– బంగారం ధరల్ని, బాండ్ ఈల్డ్స్‌ని, కమోడిటీ సైకిల్స్‌ని, గ్లోబల్ లిక్విడిటీని గమనిస్తుంటాయి. ఇదే పెద్ద తేడా. మన దేశీ ఫండ్లు ఒక బోర్డ్‌పై చెస్ ఆడుతుంటే... విదేశీ ఫండ్లు ఒకేసారి పది బోర్డులపై ఆడుతుంటాయి. అలాగని ఎఫ్ఐఐలే ఎప్పుడూ గెలుస్తారని కాదు. రిస్క్ లను వాళ్లు ముందే గమనిస్తారన్నది మాత్రం వాస్తవం.ఎఫ్ఐఐలు ఎందుకు చేస్తారంటే...ఉదాహరణకు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిందనుకోండి. తక్షణం అమెరికన్ బాండ్లు ఆకర్షణీయంగా మారతాయి. డాలర్ బలపడి... ఎమర్జింగ్ మార్కెట్ల కరెన్సీలు వీక్‌గా మారతాయి. భారత్ వంటి మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కెళ్లటం జరిగిపోతాయి. అంతేతప్ప ఇన్ఫోసిస్ ఒక్కరోజులో మారిపోవటమో, హెచ్డీఎఫ్సీ నష్టాల్లోకి జారిపోవటమో, ఎయిర్టెల్ సబ్ర్‌స్కయిబర్లను కోల్పోవటమో జరగలేదని గుర్తుంచుకోవాలి. ఎఫ్ఐఐలు విక్రయించారంటే దానర్థం... వారికి ఎక్కువ లాభాలు వచ్చే మార్కెట్లోకి డబ్బును మళ్లిస్తున్నారని. అందుకే కొన్నిసార్లు కంపెనీల ఫలితాలు అదరగొట్టినా మార్కెట్లు మాత్రం పడిపోతూ ఉంటాయి. కరెన్సీయే ప్రధాన సమస్య!ఇన్వెస్టర్లు పొరపడేది ఇక్కడే. ఎందుకంటే మన ఇన్వెస్టర్లు రూపాయిల్లో ఆలోచిస్తే విదేశీ ఇన్వెస్టర్లు డాలర్లలో ఆలోచిస్తారు. ఒకవేళ మన మార్కెట్లలో 10 శాతం లాభం వచ్చినా... రూపాయి గనక 8 శాతం పడిపోతే నికరంగా విదేశీ ఇన్వెస్టరుకు దక్కేది 2శాతం లాభమే. అందుకే ఎఫ్ఐఐలు రూపాయి కదలికల్ని, దిగుమతి బిల్లు పెంచే చమురు, బంగారం, వెండి ధరల్ని, ద్రవ్యలోటును, ఆర్బీఐ పాలసీని నిశితంగా గమనిస్తుంటారు. వీటిలో దేన్నీ దేశీ ఇన్వెస్టర్లు నియంత్రించే పరిస్థితి లేదు. దేశంలోని అత్యుత్తమ మ్యూచువల్ ఫండ్లు కూడా పెరుగుతున్న డాలర్‌తో పోరాడే పరిస్థితి లేదు. మాటే... బంగారం మార్కెట్ల పరిస్థితిని ముందు చెప్పేది బంగారమే. ఎందుకంటే అనిశ్చితి పెరుగుతున్న కొద్దీ బంగారం ధరలు పెరిగి.. డాలర్ బలోపేతమవుతుంది. ఎమర్జింగ్ మార్కెట్లలో ఎఫ్ఐఐలు జాగ్రత్తపడతారు. బంగారమంటే కేవలం నగలు కాదు. అంతర్జాతీయంగా ఇదో థర్మామీటర్. ఇటీవల ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులన్నీ దూకుడుగా బంగారం కొన్నాయి. ఎందుకని? భౌగోళిక అనిశ్చితి పెరిగి కరెన్సీ ఊగిసలాడుతుందని, వృద్ధి మందగిస్తుందని అవి ఊహించడం వల్లే. ఈ సంకేతాల్ని మొదట అందుకునేది విదేశీ ఇన్వెస్టర్లే. రిటైలర్లు చేయాల్సిందేంటి?రిటైలర్లు గమనించాల్సిందొకటే. ఎవరు అమ్ముతున్నారు... ఎవరు కొంటున్నారని కాదు. దేన్ని అమ్ముతున్నారు... దేన్ని కొంటున్నారనేది. ఎఫ్ఐఐలు భయపడి అమ్మేస్తున్నపుడు కొంటే దీర్ఘకాలంలో సంపద సృష్టి సాధ్యమేనని నిరూపించిన కంపెనీల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, టైటాన్ కంపెనీ, ఐటీసీ వంటివి ఉన్నాయి. బలమైన క్యాష్ ఫ్లో, మార్కెట్ లీడర్షిప్, దీర్ఘకాల చరిత్ర వీటి సొంతం. ఎఫ్ఐఐలు విక్రయించేసినంత మాత్రాన వీటి వృద్ధి దెబ్బతినదు. కానీ రిటైలర్లు ఇవన్నీ పట్టించుకోకుండా రాకెట్లలా పెరుగుతున్న షేర్ల వెంట పరుగులు తీస్తేనే సమస్య వస్తుంది. డిఫెన్స్, పీఎస్‌యూ, రెన్యూవబుల్ ఎనర్జీ, కొత్త తరం టెక్ కంపెనీలంటూ స్టోరీలు ప్రత్యక్షమై... ఆ స్టోరీల వెంబడి కొన్ని షేర్లు హద్దూ అదుపూ లేకుండా పెరగటం... వాటి వెనక పడటమే అసలైన ప్రమాదకరం. ఎందుకంటే కంపెనీల ఆదాయాలు గనక వాటి షేర్ల ధరను ప్రతిఫలించకపోతే విదేశీ ఇన్వెస్టర్లు పట్టించుకోరు. అందుకే వారు లాభాలతో బయటపడతారు.గెలిచేదెవరంటే...? ఎఫ్ఐఐలు విక్రయిస్తున్నంత మాత్రాన రిటైలర్లు భయపడాల్సిన పని లేదు. ఎందకంటే ఎఫ్ఐఐలు– డీఐఐల లక్ష్యాలు వేరు. ఎఫ్ఐఐలు గ్లోబల్ అలొకేషన్, రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఆలోచిస్తే... డీఐఐలు సిప్ పెట్టుబడులు, రిటైర్మెంట్ నిధి, బీమా నిధులు, దేశ దీర్ఘకాల వృద్ధిని దృష్టిలో పెట్టుకుంటారు. దీనివల్ల ఆసక్తికర పరిస్థితులు తలెత్తుతాయి. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా ఎఫ్ఐఐలు విక్రయిస్తే... దేశ దీర్ఘకాలిక వృద్ధిలో భాగమయ్యే షేర్లను డీఐఐలు కొంటుంటారు. అంటే... ఇద్దరూ గెలిచినట్టే. భారత్‌ది నిర్మాణాత్మక బలం.. స్టోరీలను పక్కనబెడితే దేశీయంగా బలమైన ఇన్వెస్ట్మెంట్ వ్యవస్థ ఉంది. నెలవారీ సిప్ ప్రవాహాలు చాలా బలంగా ఉంటున్నాయి. మార్కెట్లలోకి బీమా, పింఛన్ నిధుల రాక పెరిగింది. డీమ్యాట్ ఖాతాల సంఖ్య పెరుగుతోంది. ఇదో నిర్మాణాత్మక మార్పు. ఓ పదేళ్ల కిందట చూస్తే... ఈ స్థాయిలో ఎఫ్ఐఐలు గనక షేర్లను విక్రయిస్తే మార్కెట్లు కుప్పకూలేవి. కానీ ఇపుడు డీఐఐలు ఆదుకోగలుగుతున్నాయి. కాకపోతే ఈ మద్దతును ఆధిపత్యంగా చూడలేం. ఎందుకంటే లిక్విడిటీని, విలువను, కరెన్సీని, ఆఖరికి మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయగలిగేది విదేశీ ఇన్వెస్టర్లే. దీన్ని విస్మరించలేం. మార్కెట్‌ని మార్కెట్‌గానే చూడాలి... విదేశీ ఇన్వెస్టర్లు విక్రయించినంత మాత్రాన అదేదో చెత్త కంపెనీ అని... డీఐఐలు కొన్నంత మాత్రాన మంచి కంపెనీ అని అనుకోవటానికి లేదు. ఆదాయం, క్యాష్ ఫ్లో, గవర్నెన్స్ బాగున్న కంపెనీలనే మార్కెట్ ఆదరిస్తుంది. ఓపిగ్గా వేచిచూడటంతో పాటు, విలువల పరంగా క్రమశిక్షణ చూపించే ఇన్వెస్టర్లకే లాభాలొస్తాయి. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
చెన్నూర్/చెన్నూర్ రూరల్(జైపూర్), న్యూస్‌లైన్ : జైపూర్ మండలం ఇందారం గ్రామ వీఆర్వో వెన్నంపల్లి శంకరయ్య మంగళవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కాడు. అదే గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు తనుగుల శంకర్ రెండు నెలల క్రితం మెడికల్ అన్‌ఫిట్ అయ్యారు. ఆయన ఉద్యోగం పొందెందుకు సదరు కార్మికుని కుమారునికి డిపెండెంట్ సర్టిఫికెట్ అవసరం పడింది. ఈ సర్టిఫికెట్ కోసం శంకర్ కుమారుడు సతీశ్ రెండు నెలల క్రితం జైపూర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. డబ్బులు ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తానని వీఆర్వో వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో సతీశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ పథకం ప్రకారం సతీష్ వీఆర్వో శంకరయ్యకు రూ.5 వేలు ఇస్తుండగా పట్టుకున్నాడు. సమాచారం ఇస్తే స్పందిస్తా.. అనినీతి అధికారులు వేధింపులకు గురి చేసినట్లయితే ఎవరైనా సమాచారం అందిస్తే స్పందిస్తామని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో లంచంలు ఇవ్వాలని అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. నిర్భయంగా ప్రతి వ్యక్తి మమ్మల్ని ఆశ్రయించాలని పేర్కొన్నారు. తూర్పు జిల్లా నుంచి ఎక్కువ శాతం ఫిర్యాదుల అందుతున్నాయని తెలిపారు.ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రమణామూర్తి, వేణుగోపాల్, శ్రీనివాస్ రాజ్‌లు పాల్గొన్నారు. నెలన్నరలో ముగ్గురు పట్టివేత సాక్షి, మంచిర్యాల : జిల్లాలోని లంచావతారాలకు ఏసీబీ అధికారులు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కేవలం నెలన్నర వ్యవధిలోనే ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం ఇందుకు నిదర్శనం. ఏప్రిల్ 17న మంచిర్యాల పట్టణానికి చెందిన సహిర్ అనే వ్యక్తి చెన్నూరుకు చెందిన వీఆర్వో జమీర్‌అలీ ఏసీబీకి పట్టించారు. గృహనిర్మాణం కోసం తీసుకున్న స్థలానికి ధ్రువీకరణ పత్రం కోసం జమీర్అలీని సంప్రదించగా రూ.14 వేలు లంచం అడిగారు. ఇందులో రూ.4 వేలు అడ్వాన్స్‌గా సహిర్ ఇచ్చారు. మిగతా రూ.10వేలు ఇస్తేనే ప్రోసిడింగ్ ఇస్తానని వీఆర్వో జమీర్ అలీ స్పష్టం చేయడంతో సహిర్ అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. ఏప్రిల్ 17న చెన్నూర్ ఎమ్మార్వో కార్యాలయంలో రూ.10 వేలు ముట్టజెప్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈనెల 9న కిరణ్‌కుమార్ అనే జీఆర్పీ ఎస్సై ఏసీబీకి చిక్కారు. రైలు ప్రమాదంలో మరణించిన భర్త మరణ ధ్రువీకరణ పత్రం అందజేయాలని బాధితురాలు పబ్బతి సౌజన్య కిరణ్‌కుమార్‌కు విన్నవించారు. మొదట రూ.50వేలు డిమాండ్ చేసిన కిరణ్‌కుమార్ తర్వాత రూ.30 వేలు ఇచ్చినా తీసుకునేందుకు సిద్ధపడ్డారు. రూ.30వేలు ఇస్తున్న సమయంలో రైల్వే స్టేషన్లోనే మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. తాజాగా జైపూర్ మండలానికి ఇందారం వీఆర్వో శంకరయ్య అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. -
వరద బియ్యం కోసం గిడ్డంగిపై దాడి
వాడవలస(ఎల్.ఎన్.పేట), న్యూస్‌లైన్: వరదలు సంభవించే సమయంలో ముంపు గ్రామాల్లో ప్రజలకు వంట చేయడానికి బియ్యం నిల్వ చేసిన గిడ్డంగిపై కొందరు గ్రామస్తులు దాడి చేసి సరుకులు ఎత్తుకువెళ్లిపోయారు. సుమారు 20 క్వింటాళ్ల బియ్యంను వారు పట్టుకుపోగా రంగంలోకి దిగిన పోలీసులు 6 మూటల్లో ఉన్న సుమారు రెండు క్వింటాళ్ల బియ్యాన్ని అడ్డుకున్నారు. ఎల్.ఎన్.పేట మండలం వాడలవలసలో గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇవీ... వంశధార నదికి ఇటీవల వరదలు రావడంతో గ్రామాల్లో లోతట్టు గ్రామాలైన దబ్బపాడు, వాడవలస, మిరియాపల్లి, బసవరాజుపేట, లక్ష్మీనర్సుపేటల్లో వంట వండడానికి అధికారులు ఒక్కో గ్రామానికి 30 క్వింటాళ్ల బియ్యం, 100 కిలోల కందిపప్పు, 15 ఆయిల్ ప్యాకెట్లు, 5 కిలోల ఉప్పు, 2 కిలోల కారం తదితర సామగ్రి అధికారులు డీలర్ల ఆధ్వర్యంలో ఉంచారు. ఈ క్రమంలో వాడవలస గ్రామానికి వచ్చిన సరుకులో వరదల సమయంలో 3 క్వింటాళ్ల బియ్యం వినియోగించారు. మిగిలిన 27 క్వింటాళ్ల బియ్యంలో పాటు 90 కిలోల కందిపప్పు, 11 ప్యాకెట్లు ఆయిల్, 4 ప్యాకెట్లు ఉప్పు, ఒక ప్యాకెట్ కారం గ్రామీణ పౌరసరఫరాల గిడ్డంగిలో నిల్వ చేసినట్లు డీలర్ పి.సీతారాం నివేదికలో పేర్కొన్నట్లు డీటీ బి.గోపాల్ చెప్పారు. ఇదిలా ఉండగా గిడ్డంగిలో నిల్వ చేసిన సరుకులను ముఖ్యంగా బియ్యం తమకు ఇవ్వాలంటూ గ్రామస్తులు రెండు రోజులుగా తహశీల్దార్ రమణమూర్తి, డీలర్ సీతారాంప ఒత్తిడి చేస్తున్నారు. వంటలు చేయడానికి ఉద్దేశించిన బియ్యం ఎలా పంచుకుంటారని తహశీల్దార్ చెప్పి గ్రామస్తుల ప్రతిపాదనను వ్యతిరేకించారు. దీంతో గ్రామస్తులు గురువారం ఉదయం గ్రామీణ పౌరసరఫరాల గిడ్డంగి తాళాలు పగలగొట్టి బియ్యం పట్టుకుపోయారు. ఈ విషయం తెలిసి తహశీల్దార్ రమణమూర్తి సరుబుజ్జిలి ఎస్ఐ ఎస్.సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ పోగుపోసిన బియ్యంతో పాటు ఎనిమిది బస్తాలతో ఉన్న 4 క్వింటాళ్ల బియ్యాన్ని, గ్రామీణులు పంచుకుని మూటలతో తీసుకుని వెళ్లేందుకు సిద్ధం చేసిన 12 మూటల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులతో సమావేశమైన తహశీల్దార్, ఎస్ఐ వారికి నచ్చచెప్పారు. ఇంకా కొంతమందికి బియ్యం అందలేదని, బియ్యాన్ని పంచుకునే అవకాశం ఇవ్వాలని గ్రామస్తులు పట్టుబట్టారు. బియ్యం సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువె ళతామని, వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ చెప్పారు. ఇదిలా ఉండగా గ్రామీణ పౌరసరఫరాల సరుకులు నిల్వ ఉన్న గిడ్డంగిని లూటీ చేసి సరుకులు దోపిడీ చేసినందుకు గాను గ్రామస్తులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తహశీల్దార్ రమణమూర్తి చెప్పారు. డీలరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 15 మందిపై ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తులో మరికొంతమందిపై చర్యలు తప్పవన్నారు.


