ఒక్క రోజులో పెరగనున్న ఐఫోన్‌ ధర? | Apple iPhone 17 Price Hike From August 10? Apple May Raise Prices Amid Rising Memory Chip Costs | Sakshi
Sakshi News home page

iPhone Price Hike: ఒక్క రోజులో పెరగనున్న ఐఫోన్‌ ధర?

Aug 9 2026 11:53 AM | Updated on Aug 9 2026 1:23 PM

iPhone 17 Price Hike August 10 Apple Price Increase

యాపిల్‌ ఐఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌ ఇచ్చే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఐఫోన్‌ 17 (iPhone 17) సిరీస్‌ ధరలను ఆగస్టు 10 అంటే సోమవారం నుంచే పెంచే అవకాశం ఉందని తాజా లీక్‌ వెల్లడించింది. చైనీస్‌ సోషల్‌ మీడియాలో ఫిక్స్‌డ్‌ ఫోకస్‌ డిజిటల్‌ (Fixed Focus Digital) అనే టెక్‌ లీకర్‌ చేసిన పోస్టు ఈ ఊహాగానాలకు కారణమైంది. అయితే ధర ఎంత పెరుగుతుంది, ఏ మోడళ్లకు వర్తిస్తుంది అనే వివరాలను లీకర్‌ వెల్లడించలేదు. అయితే యాపిల్‌ నుంచి ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఈ వార్తకు ప్రధాన కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మెమరీ, స్టోరేజ్‌ చిప్‌ల ధరలు కనిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ డేటా సెంటర్ల విస్తరణతో మెమరీ చిప్‌లకు డిమాండ్‌ పెరగడం, సరఫరాపై ఒత్తిడి ఏర్పడటం వల్ల హార్డ్‌వేర్‌ తయారీ వ్యయాలు పెరిగాయి. ఈ ప్రభావం ఇప్పటికే యాపిల్‌ ఉత్పత్తులపై కనిపించింది. జూన్‌లో కంపెనీ భారత్‌లో మ్యాక్‌బుక్‌, ఐపాడ్‌ తదితర ఉత్పత్తుల ధరలను భారీగా పెంచింది. కొన్ని మోడళ్లలో పెంపు రూ.1 లక్ష వరకు వెళ్లింది.

అయితే ఆ ధరల పెంపు సమయంలో ఐఫోన్‌ ధరలు మాత్రం పెంచలేదు. అందుకే ఇప్పుడు ఐఫోన్‌ 17పై కూడా ధరల భారం పడుతుందన్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. యాపిల్‌ గతంలో పెరిగిన కాంపోనెంట్‌ వ్యయాలను కొంతకాలం భరించినప్పటికీ, మెమరీ ధరల పెరుగుదల తీవ్రంగా మారడంతో వినియోగదారులపై కొంత భారాన్ని మోపాల్సి వస్తోందని కంపెనీ వివరణ ఇచ్చింది.

ఐఫోన్‌ 17కు ఎక్కువ కాలం డిమాండ్‌?

ఇక 2026లో యాపిల్‌ ఐఫోన్‌ లాంచ్‌ వ్యూహంలో మార్పులు చేయనున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ఐఫోన్‌ 18 Pro, ఐఫోన్‌ 18 Pro Max, అలాగే యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌‌ సెప్టెంబర్‌లో రావచ్చని సమాచారం. అదే సమయంలో సాధారణ ఐఫోన్‌ 18, ఐఫోన్‌ 18e మోడళ్లను 2027 రెండో త్రైమాసికానికి వాయిదా వేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి.

అది నిజమైతే ఐఫోన్‌ 17 సాధారణం కంటే ఎక్కువ కాలం యాపిల్‌ లైనప్‌లో కొనసాగాల్సి ఉంటుంది. దీంతో కొత్త Pro మోడళ్లు వచ్చిన తర్వాత కూడా సాధారణ ధర శ్రేణిలో ఐఫోన్‌ 17కు డిమాండ్‌ కొనసాగవచ్చు. ఈ నేపథ్యంలో ధరల పెంపు జరిగితే, ప్రస్తుత ఐఫోన్‌ 17 కొనుగోలు చేయాలనుకునే వారికి ఆగస్టు 10 కీలక తేదీగా మారే అవకాశం ఉంది.

అన్ని ఐఫోన్‌ 17 మోడళ్ల ధరలు పెరుగుతాయా?

ప్రస్తుత లీక్‌ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ముఖ్యంగా ఐఫోన్‌ 17 Pro, Pro Max ధరలు పెంచితే, వాటి తర్వాతి తరం మోడళ్లు త్వరలోనే రానున్న నేపథ్యంలో ఆ నిర్ణయం యాపిల్‌కు కొంత సంక్లిష్టంగా మారవచ్చు. కాబట్టి యాపిల్‌ అధికారిక ధరల జాబితాను విడుదల చేసే వరకు ఎదురుచూడక తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement