ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం కంటే ఫోన్‌లతో గడిపే సమయమే ఎక్కువైందని చాలామంది అంటుంటారు. అయితే ఆ మాటను ఓ చిన్నారి చాలా సీరియస్‌గా తీసుకున్నాడేమో! తన తల్లి చేతిలో ఉన్న ఖరీదైన ఐఫోన్‌ను ఏకంగా సరస్సులోకి విసిరేసి "డిజిటల్ డిటాక్స్"కు శ్రీకారం చుట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ మహిళ తన కుమారుడితో కలిసి బోట్ రైడ్‌కు వెళ్లింది. ప్రకృతి అందాలను ఆస్వాదించడం, కొడుకుతో సరదాగా గడపడం పక్కన పెట్టి, ఆ క్షణాలను ఐఫోన్‌లో బంధించడంలో బిజీగా ఉంది. ఇదంతా గమనించిన చిన్నారి... "అమ్మకు ఈ ఫోన్‌నే ఎక్కువ ఇష్టమా? లేక నేనా?" అన్నట్లు ఒక్కసారిగా ఫోన్ లాక్కొని నేరుగా సరస్సులోకి విసిరేశాడు.
ఫోన్ నీటిలో పడిపోయిన వెంటనే తల్లి ముఖంలో కనిపించిన షాక్ చూస్తే, అది సాధారణ ఫోన్ కాదని, బహుశా ఈఎంఐలు ఇంకా పూర్తికాని ఐఫోన్ అయి ఉంటుందని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. "బాలుడు ఏ తప్పూ చేయలేదు.. కుటుంబ సమయాన్ని కాపాడాడు". "ఆ చిన్నోడికి పర్యావరణ అవార్డు ఇవ్వాలి... కనీసం రెండు గంటలు అయినా అమ్మ సోషల్ మీడియాకు దూరమైంది", "స్టీవ్ జాబ్స్ ఉంటే ఈ వీడియో చూసి ఏడ్చేవాడు" అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.
Kid throws his mom’s iPhone into the lake during a boat ride 😂 pic.twitter.com/HJs4z7F6lt
— Duniya Ke Kalesh (@yadav_army11902) June 18, 2026
మరికొందరు అయితే ఆ బాలుడిని "లేక్ సెక్యూరిటీ ఫోర్స్" చీఫ్‌గా నియమించాలని సూచిస్తున్నారు. "బోట్‌లో అందరూ ప్రకృతిని చూస్తుంటే, ఒక్క అమ్మ మాత్రమే స్క్రీన్‌ను చూస్తోంది. అందుకే అతను కఠిన నిర్ణయం తీసుకున్నాడు" అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ ఘటన తర్వాత ఆ చిన్నారికి ఐస్‌క్రీమ్ దొరికిందో లేదో తెలియదు గానీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు మాత్రం దొరికిపోయారు. కానీ ఆ తల్లికి మాత్రం ఇప్పటికీ సరస్సు వైపు చూస్తే నీళ్లలో మునిగిపోయిన iPhone, అందులో ఉన్న ఫోటోలు, కాంటాక్టులు గుర్తుకు వస్తుండొచ్చు.


