టాటా ఐఫోన్‌ ప్లాంట్‌కు క్లీన్‌ చిట్‌ | TNPCB Gives Clean Chit to Tata Electronics Hosur Plant Amid Pollution Allegations, Company Says Operations Meet Environmental Standards | Sakshi
Sakshi News home page

టాటా ఐఫోన్‌ ప్లాంట్‌కు క్లీన్‌ చిట్‌

Jun 17 2026 7:47 AM | Updated on Jun 17 2026 10:23 AM

Tata iPhone Plant Clean Chit No Water Contamination Hosur Facility

యాపిల్‌ ఐఫోన్‌లకు కీలక భాగాలను తయారు చేసే టాటా ఎలక్ట్రానిక్స్‌ హోసూర్‌ ప్లాంట్‌కు తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి (TNPCB) ఊరటనిచ్చింది. ప్లాంట్‌ నుంచి మురుగునీటి విడుదల కారణంగా భూగర్భజలాలు కలుషితమయ్యాయన్న ఆరోపణలపై జరిగిన పరిశీలన అనంతరం, సంస్థ నిర్దేశిత పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగానే పనిచేస్తోందని మండలి గుర్తించింది. ఈ అంశంపై ఇకపై తదుపరి చర్యలు తీసుకోబోమని నిర్ణయించినట్లు టాటా ఎలక్ట్రానిక్స్‌ వెల్లడించింది.

ఇటీవల అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ కథనం వెలువరించడంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. హోసూర్‌లోని టాటా ప్లాంట్‌ నుంచి విడుదలయ్యే మురుగునీరు సమీప వ్యవసాయ భూములు, బావులపై ప్రభావం చూపుతోందని స్థానిక రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా యంత్రాంగం, రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ పలుమార్లు తనిఖీలు నిర్వహించాయి. గత నెలలో జారీ చేసిన షోకాజ్‌ నోటీసులో కూడా పలు అంశాలపై వివరణ కోరింది.

అయితే, నోటీసు అందుకున్న వెంటనే గుర్తింపు పొందిన ప్రయోగశాల ద్వారా స్వతంత్ర పరీక్షలు నిర్వహించామని టాటా ఎలక్ట్రానిక్స్‌ తెలిపింది. ఈ పరీక్షల్లో టోటల్‌ డిసాల్వ్డ్‌ సాలిడ్స్‌ (TDS), కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (COD), బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (BOD) వంటి కీలక పర్యావరణ సూచికలు అనుమతించిన పరిమితుల్లోనే ఉన్నట్లు తేలిందని పేర్కొంది. ఆ ఫలితాలను అధికారికంగా తమిళనాడు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌కి సమర్పించినట్లు వెల్లడించింది.

అదేవిధంగా, ఇటీవల సేకరించిన నీటి నమూనాలను పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ కూడా స్వయంగా పరీక్షించగా ఎటువంటి కాలుష్య ఆనవాళ్లు కనిపించలేదని కంపెనీ తెలిపింది. దీంతో షోకాజ్‌ నోటీసులో ప్రస్తావించిన అన్ని అంశాలను సంతృప్తికరంగా పరిష్కరించినట్లు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ధ్రువీకరించిందని పేర్కొంది.

కాగా, ఈ హోసూర్‌ ప్లాంట్‌ యాపిల్‌ ‘చైనా ప్లస్‌ వన్‌’ వ్యూహంలో అత్యంత కీలక కేంద్రంగా మారింది. ఐఫోన్‌ బ్యాక్‌ప్యానెల్స్‌తో పాటు పలు కీలక భాగాలను ఈ యూనిట్‌లో తయారు చేస్తున్నారు. చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ ఉత్పత్తిని భారత్‌కు మళ్లిస్తున్న యాపిల్‌కు టాటా ఎలక్ట్రానిక్స్‌ ప్రధాన భాగస్వామిగా ఎదిగింది. పరిశోధనా సంస్థ కౌంటర్‌పాయింట్‌ అంచనాల ప్రకారం 2026 నాటికి ప్రపంచ ఐఫోన్‌ ఉత్పత్తిలో భారత వాటా 26 శాతానికి చేరుకునే అవకాశం ఉంది.

అయితే, పర్యావరణ పరిరక్షణపై తమ నిబద్ధత కొనసాగుతుందని టాటా ఎలక్ట్రానిక్స్‌ స్పష్టం చేసింది. భవిష్యత్తులోనూ పర్యావరణ నిబంధనలకు పూర్తిస్థాయిలో అనుగుణంగా ఉండేందుకు ప్రక్రియలు, మౌలిక సదుపాయాలను నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement