పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనితీరుపై తీవ్ర విమర్శలు, ఫిర్యాదులు
వందలాది ఫ్యాక్టరీలకు ఒకరిద్దరు ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లే దిక్కు
రాత్రివేళల్లో అక్రమ వ్యర్థాలను చెరువులు, నాలాల్లో కలుపుతున్న పరిశ్రమలు
కొన్ని పరిశ్రమలతో కొందరు అధికారులు కుమ్మక్కవుతున్నట్లు ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) కార్యకలాపాల్లో నిఘా వ్యవస్థ నిద్రపోతోంది. పారిశ్రామిక వ్యర్థాలు, వాయు, ఇతర రూపాల్లోని కాలుష్యాలపై పీసీబీ తీరుపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లోని పరిశ్రమలతో అధికారులు కుమ్మక్కు అవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదుల కోసం బోర్డు 24 గంటల టోల్–ఫ్రీ నంబర్ (10741) జనవాణి–కాలుష్య నివారణి మొబైల్ యాప్ వంటివి అందుబాటులోకి తెచ్చినా వాటి పరిష్కారం విషయంలో అంతగా ప్రయోజనం ఉండటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పీసీబీలో మంజూరైన పోస్టులతో పోలిస్తే క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇది బోర్డు రోజువారీ పనితీరును దెబ్బతీస్తోంది.
అనేక పారిశ్రామిక ప్రాంతాల్లోనూ పరిమిత సంఖ్యలో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ల పర్యవేక్షణతో ఆకస్మిక తనిఖీలు చేయడం అసాధ్యంగా మారుతోంది. నమూనాల సేకరణ, ల్యాబ్ నివేదికల్లో ఆలస్యం జరుగుతోంది. పరిశ్రమల నుంచి నీరు, గాలి, రసాయన వ్యర్థాల నమూనాల సేకరణకు, వాటిని ల్యాబ్‌లలో పరీక్షించేందుకు తగినంతగా సాంకేతిక సిబ్బంది లేరు. ఫలితంగా కాలుష్య తీవ్రతపై నివేదికలు రావడానికి నెలల సమయం పడుతోంది. న్యాయపరమైన చర్యల్లో జాప్యం జరుగుతోంది. కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై చట్టపరమైన కేసులు నమోదు చేయడానికి, కోర్టుల్లో బలంగా వాదించడానికి ప్రత్యేక లీగల్ టీమ్స్ కొరత ఉంది. ఇది అక్రమార్కులకు వరంగా మారుతోంది.
ఆకస్మిక తనిఖీలు అంతంతే...
పారిశ్రామిక ప్రాంతాల్లోని వందలాది ఫ్యాక్టరీలను ఒకరిద్దరు ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లే పర్యవేక్షించాల్సి వస్తుండటంతో ఆకస్మిక తనిఖీలు కొరవడ్డాయి. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగంగా పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా పొల్యూషన్ బోర్డు బలోపేతం కాకపోవడం వల్ల తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. పటాన్‌చెరు, బొల్లారం, జీడిమెట్ల వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో పీసీబీ నిబంధనలను ఉల్లంఘించేలా రసాయన, బల్క్ డ్రగ్ పరిశ్రమల నుంచి వ్యర్థాలు వెలువడుతున్నట్లు ఆరోపణలున్నాయి. హుస్సేన్‌సాగర్, మూసీ కాలుష్యం దీనికి ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. పీసీబీ కొన్ని పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, నిబంధనలు పాటించని వాటిపై మూసివేత ఆదేశాలు జారీ చేయడం వంటి కఠిన చర్యలు చేపడుతోంది.
అయినప్పటికీ శాశ్వత పరిష్కారాలు ఉండటం లేదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్, వరంగల్ వంటి ప్రధాన నగరాల్లో అతిసూక్ష్మ రూపాల్లోని వాయుకాలుష్య (పీఎం 2.5) స్థాయిలు ప్రమాదకర దశకు చేరుకుంటున్నాయి. అలాగే హైదరాబాద్‌లో పలుచోట్ల గాలి నాణ్యత పర్యవేక్షణకు బోర్డు ఆటోమేటిక్ మానిటరింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో కాలుష్య కారకాలను తగ్గించేందుకు కఠిన చర్యలు లోపించాయని విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని పురపాలక సంఘాల పరిధిలో ప్లాస్టిక్ నిషేధం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. అదేవిధంగా బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలోనూ లోపాలు కనిపిస్తున్నాయి. ఉల్లంఘనలపై జరిమానాలు విధిస్తున్నప్పటికీ, స్థానిక సంస్థలతో సమన్వయం లోపించడం వల్ల ఈ సమస్యలు మిగిలిపోతున్నాయి.
నిరంతర నిఘా లోపం...
ఆధునిక సాంకేతికతతో కూడిన నిరంతర నిఘా వ్యవస్థ లోపంతో పరిశ్రమలు సులభంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. రాత్రి వేళల్లో అక్రమ వ్యర్థాల విడుదల చేస్తున్నాయి. పగటిపూట నిబంధనలు పాటిస్తున్నట్లు నటించే కొన్ని పరిశ్రమలు, రాత్రి వేళల్లో శుద్ధి చేయని రసాయన జలాలను సమీపంలోని చెరువులు, నాలాల్లోకి లేదా మూసీ నదిలోకి వదిలేస్తున్నాయి. నిఘా లోపం వల్ల వీటిని పట్టుకోవడం కష్టమవుతోంది. కాలుష్యకారక పరిశ్రమల్లో ఆన్‌లైన్ నిరంతర ఉద్గారాల పర్యవేక్షణ వ్యవస్థలను (ఓసీఈఎంఎస్) ఏర్పాటు చేసినప్పటికీ, చాలా చోట్ల ఈ పరికరాలు పనిచేయకపోవడం లేదా వాటి డేటాను తారుమారు చేయడం జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. బోర్డు నుంచి దీనిపై సరైన నిఘా లేదు. భూగర్భ జలాలు మురుగుగా మారడం... పారిశ్రామిక వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోయడం లేదా భూమిలోకి బోర్–వెల్స్ ద్వారా ఇంజెక్ట్ చేయడం వంటి అక్రమ పద్ధతులను కొన్ని పరిశ్రమలు అనుసరిస్తున్నారు.
దీనివల్ల పటాన్‌చెరు, బొల్లారం, జీడిమెట్ల చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు విషపూరితంగా మారుతున్నాయి. గాలి నాణ్యత పడిపోవడం... సిమెంట్, ఫార్మా, ఐరన్ ఇండస్ట్రీల నుంచి వచ్చే పొగను నియంత్రించే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ (ఈఎస్‌పీ) వంటి పరికరాలను పరిశ్రమలు సరిగ్గా నడపడం లేదు. ఫలితంగా నగర పరిసరాల్లో పీఎం 2.5, పీఎం 10 వాయు కాలుష్యస్థాయిలు పెరిగిపోతున్నాయి. ఈ లోపాలను అధిగమించాలంటే బోర్డులో ఖాళీగా ఉన్న సాంకేతిక పోస్టులను భర్తీ చేయడంతోపాటు డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతను నిఘా కోసం ఉపయోగించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.


