వందే భారత్ రైళ్లు భారతదేశం అంతటా విస్తరిస్తున్న తరుణంలో.. వీటిని నడిపే వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. వందే భారత్ లోకో పైలట్‌లను ఎలా నియమిస్తారు?, ఎలాంటి అర్హతలు కావలి?, జీతం ఎంత? అనే వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
వందే భారత్ ట్రైన్స్ కోసం.. భారతీయ రైల్వే లోకో పైలట్లను నేరుగా నియమించదు. అభ్యర్థులు ముందుగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)గా చేరి, కొన్ని సంవత్సరాల అనుభవం సంపాదించాలి. ఆ తర్వాత ప్రత్యేక శిక్షణ పొందిన తర్వాతే వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లను నడిపే అవకాశం కల్పిస్తారు.
అర్హతలు
అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే అభ్యర్థి కనీసం పదో తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. అంతేకాకుండా.. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి. వయస్సు సాధారణంగా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రైల్వే నిర్దేశించిన వైద్య పరీక్షలు, ముఖ్యంగా కంటి చూపు పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి.
జీతం
ఉద్యోగంలో చేరిన తర్వాత అసిస్టెంట్ లోకో పైలట్‌కు ప్రాథమిక వేతనం రూ.19,900 ఉంటుంది. అలవెన్సులతో కలిపి, వారి నెలసరి చేతికి అందే జీతం సాధారణంగా రూ.35,000 నుంచి రూ.40,000 మధ్య ఉంటుంది. అనుభవం పెరిగి వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లను నడిపే స్థాయికి చేరుకున్న తర్వాత నెలకు రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం సీనియారిటీ, పని గంటలు, రన్నింగ్ అలవెన్స్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
జీతంతో పాటు లోకో పైలట్లకు అనేక సౌకర్యాలు కూడా లభిస్తాయి. ఇందులో డియర్‌నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, రన్నింగ్ అలవెన్స్, నైట్ డ్యూటీ అలవెన్స్, ఉచిత వైద్య సేవలు, పెన్షన్, రైల్వే ప్రయాణ రాయితీలు, పెయిడ్ లీవ్స్, ఉద్యోగ భద్రత, పదోన్నతి అవకాశాలు వంటి ప్రయోజనాలు మొదలైనవి ఉన్నాయి.
ఇదీ చదవండి: వీసా కోసం రూ.19 లక్షల బాండ్.. జాబితాలో 50 దేశాలు!


