ఉద్యోగం పోగొట్టిన రూ.4.5 కోట్ల జీతం! | Chinese Company Fires Employee Rs 4.5 Crore Salary Leaks Online Goes Viral | Sakshi
Sakshi News home page

ఉద్యోగం పోగొట్టిన రూ.4.5 కోట్ల జీతం!

Jul 26 2026 1:24 PM | Updated on Jul 26 2026 2:40 PM

Chinese Company Fires Employee Rs 4.5 Crore Salary Leaks Online Goes Viral

రూ.4.5 కోట్ల జీతం శాపం కావడం ఏంటి? అంత జీతం వస్తే ఎవరైనా ఎగిరి గంతులేస్తారు కదా.. మరి ఉద్యోగం పోవడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవండి..

చైనాకు చెందిన టెక్ దిగ్గజం  టెన్సెంట్‌‌లో (Tencent) పనిచేస్తున్న ఓ ప్రాజెక్ట్ మేనేజర్‌కు తన భారీ వేతన ప్యాకేజీనే చివరకు ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చింది. కంపెనీ అంతర్గత సమాచారంగా ఉన్న అతని వార్షిక పరిహారం వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, గోప్య సమాచారాన్ని బాహ్య వ్యక్తులతో పంచుకున్నారనే ఆరోపణలపై సంస్థ అతడిని తొలగించింది. ఈ ఘటన చైనాలో కార్పొరేట్ గోప్యత, ఉద్యోగుల వేతన పారదర్శకతపై మరోసారి చర్చకు దారితీసింది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. 'యే'(Ye) అనే ఇంటిపేరుతో ఉన్న ఓ  వ్యక్తి టెన్సెంట్‌కు చెందిన వీషిన్ (Weixin) గ్రూప్‌‌లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ వీషిన్ గ్రూపే ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్లకు పైగా వినియోగదారులు ఉపయోగించే వీచాట్ (WeChat) సూపర్ యాప్‌ను అభివృద్ధి చేసి నిర్వహిస్తోంది.

కంపెనీ అంతర్గత వ్యవస్థ నుంచి తీసినట్లు భావిస్తున్న ఒక స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో యేకు ఏడాదికి సుమారు 3.17 మిలియన్ యువాన్లు (సుమారు రూ.4.5 కోట్లు) వేతన పరిహారం లభిస్తున్నట్లు కనిపించింది. ఇందులో 8.2 లక్షల యువాన్లకు పైగా నగదు బోనస్ (దాదాపు రూ.1.17 కోట్లు), 2.35 మిలియన్ యువాన్ల విలువైన స్టాక్ ప్రోత్సాహకాలు (సుమారు రూ.3.35 కోట్లు) కూడా ఉన్నట్లు వెల్లడైంది. ఈ వివరాలు చైనీస్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో ఉద్యోగుల వేతనాలు, కంపెనీల గోప్యతా విధానాలపై తీవ్ర చర్చ మొదలైంది.

టెన్సెంట్ అంతర్గత క్రమశిక్షణా నోటీసు ప్రకారం.. యే సున్నితమైన కార్పొరేట్ సమాచారాన్ని సంస్థ వెలుపలికి చేరవేసినందుకు అతన్ని తొలగించినట్లు పేర్కొంది. ఈ లీక్ కంపెనీకి అంతర్గతంగా, బాహ్యంగా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని సంస్థ అభిప్రాయపడింది. అంతేకాదు, భవిష్యత్తులో టెన్సెంట్‌లో ఎలాంటి ఉద్యోగానికి కూడా అతడిని పరిగణించబోమని, శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్ చేసినట్లు సమాచారం.

ఇటీవలి కాలంలో టెన్సెంట్ తన కంప్లయెన్స్, అవినీతి నిరోధక చర్యలను మరింత కఠినతరం చేసింది. కంపెనీ విడుదల చేసిన తాజా వార్షిక నివేదిక ప్రకారం, 2025లో 70కు పైగా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించగా, వాటి ఫలితంగా 90 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. మరో 20కు పైగా కేసులను క్రిమినల్ విచారణ కోసం చట్ట అమలు సంస్థలకు పంపించారు. టెన్సెంట్ విధానాల ప్రకారం ఉద్యోగులు వ్యాపార రహస్యాలు, అంతర్గత కమ్యూనికేషన్లు, విడుదల కాని సోర్స్ కోడ్, ఉద్యోగుల రికార్డులు వంటి గోప్య సమాచారాన్ని బహిర్గతం చేయడం నిషేధితం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement