కూటమి సర్కార్‌కు బిగ్ షాక్.. ఏపీ ప్రాజెక్టును ఎగరేసుకుపోయిన ఒడిశా | Andhra Loses Mega Tata Power Project As ₹6,675 Crore Solar Manufacturing Plant Moves To Odisha, Check More Details | Sakshi
Sakshi News home page

కూటమి సర్కార్‌కు బిగ్ షాక్.. ఏపీ ప్రాజెక్టును ఎగరేసుకుపోయిన ఒడిశా

Jul 29 2026 4:05 PM | Updated on Jul 29 2026 7:17 PM

Tata Power Picks Odisha over Andhra Pradesh

సాక్షి,అమరావతి: కూటమి ప్రభుత్వానికి బిగ్‌ షాక్‌ తగిలింది. ఏపీలో నిర్మించాల్సిన ప్లాంట్‌ను ఒడిశాలో నెలకొల్పుతున్నట్లు టాటా పవర్‌ అధికారికంగా ప్రకటించింది. దాదాపు రూ.6,675 కోట్ల భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పాల్సిన టాటా పవర్‌ సంస్థ 10 గిగావాట్ల సోలార్ ప్యానెల్స్ తయారీకి వాడే ముడిపదార్థాలు ఇంగట్, వేఫర్ తయారీ ప్లాంట్‌ను ఒడిశా రాష్ట్రం గోపాల్‌పూర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ స్వయంగా ప్రకటించింది.

టాటా పవర్ కంపెనీ సీఈఓ, ఎండీ డాక్టర్ ప్రవీర్ సిన్హా జాతీయ మీడియాతో జూన్ త్రైమాసిక ఫలితాల ప్రకటన సందర్భంగా ఈ వివరాలను అధికారికంగా వెల్లడించారు. వాస్తవానికి ఈ ప్రతిష్టాత్మక ప్లాంట్‌ను నెల్లూరు జిల్లా ‘ఇఫ్కో కిసాన్ సెజ్’లో ఏర్పాటు చేయడానికి టాటా పవర్ తొలుత ముందస్తు చర్చలు జరిపింది. అయితే, ఏపీలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహకాల తీరుపై సదరు సంస్థ కొంత ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో ఒడిశా ప్రభుత్వం రంగంలోకి దిగి టాటా పవర్‌కు మెరుగైన విద్యుత్ రాయితీలు, భారీ ప్రోత్సాహకాలు ఆఫర్ చేయడంతో ఏపీని కాదని ఒడిశా వైపు మొగ్గు చూపినట్లు పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఒడిశా ప్రభుత్వంతో జరిపిన చర్చలు విజయవంతం కావడంతో గోపాల్‌పూర్ స్పెషల్ ఎకనమిక్ జోన్‌లోని 128 ఎకరాల టాటా స్టీల్ భూమిని ఈ ప్లాంట్ నిర్మాణం కోసం ఖరారు చేసినట్లు సిన్హా తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక భూకేటాయింపులు, పర్యావరణ అనుమతులు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ నుంచి ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కానుండగా, మొత్తం రెండు దశల్లో (ఫేజ్-1లో 5 గిగావాట్లు, ఫేజ్-2లో మరో 5 గిగావాట్లు) ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయనున్నారు.

మొదటి దశ ప్లాంట్ కార్యకలాపాలు 2028 జనవరి నుంచి ప్రారంభం కానున్నాయని, ఆ తర్వాతి ఆరు నెలల్లోనే రెండో దశ కూడా అందుబాటులోకి వస్తుందని టాటా పవర్ ఎండీ వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచుతుందని భావించిన ఇంతటి మెగా ప్రాజెక్ట్ చేజారిపోవడం కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement