బెర్క్‌షైర్‌లో భారీగా షేర్ల బై బ్యాక్‌.. | Berkshire Hathaway Buys Back $4.5 Billion In Shares As Greg Abel Shifts Buffett’s Cash Strategy | Sakshi
Sakshi News home page

బెర్క్‌షైర్‌లో భారీగా షేర్ల బై బ్యాక్‌..

Aug 9 2026 8:04 AM | Updated on Aug 9 2026 12:14 PM

Berkshire Hathaway Buys Back 4 5 Billion Shares

వారెన్ బఫెట్ వారసుడిగా బెర్క్‌షైర్ హాత్‌వే పగ్గాలు చేపట్టిన గ్రెగ్ అబెల్.. కంపెనీ వద్ద పోగైన భారీ నగదు నిల్వలను క్రమంగా పెట్టుబడుల వైపు మళ్లిస్తున్నారు. 2026 రెండో త్రైమాసికంలో బెర్క్‌షైర్ హాత్‌వే దాదాపు 4.5 బిలియన్‌ డాలర్ల విలువైన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. 2021 తర్వాత ఒక త్రైమాసికంలో కంపెనీ చేసిన అతిపెద్ద బైబ్యాక్ ఇదే కావడం విశేషం.

జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో బెర్క్‌షైర్ నిర్వహణ లాభాలు పన్నుల అనంతరం సుమారు 16 శాతం పెరిగి 13 బిలియన్‌ డాలర్లకు చేరాయి. రైల్వే, ఇంధన-విద్యుత్, తయారీ, సేవలు, రిటైల్ విభాగాల్లో మెరుగైన పనితీరు లాభాల పెరుగుదలకు ప్రధాన కారణమైంది. అయితే ఇన్సూరెన్స్ అండర్‌రైటింగ్‌ లాభాలు తగ్గడం కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

14 త్రైమాసికాల తర్వాత ఈక్విటీల కొనుగోలు

బెర్క్‌షైర్‌లో అత్యంత ఆసక్తికరమైన మార్పు దాని పెట్టుబడి వ్యూహంలో కనిపించింది. వరుసగా 14 త్రైమాసికాల పాటు అమెరికా ఈక్విటీలను నికరంగా విక్రయించిన సంస్థ.. ఈసారి సుమారు 20 బిబిలియన్‌ డాలర్ల నికర స్టాక్ కొనుగోళ్లు చేసింది. ఫలితంగా జూన్ చివరి నాటికి కంపెనీ వద్ద నగదు, నగదుతో సమానమైన ఆస్తులు, అమెరికా ట్రెజరీ బిల్లుల నిల్వలు కలిపి సుమారు 365.5 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. మార్చి చివర్లో ఈ మొత్తం దాదాపు 397.4 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

అయితే ఈ భారీ నగదు నిల్వ పూర్తిగా తగ్గిపోలేదు. బెర్క్‌షైర్ ఇప్పటికీ అమెరికాలోనే అత్యంత భారీ నగదు నిల్వ కలిగిన కంపెనీల్లో ఒకటిగా ఉంది. జూన్ చివరి నాటికి దాని వద్ద సుమారు 325 బిలియన్‌ డాలర్ల ట్రెజరీ బిల్లులు ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి.

గూగుల్‌పై 10 బిలియన్‌ డాలర్ల బెట్టింగ్

గ్రెగ్ అబెల్ నాయకత్వంలో బెర్క్‌షైర్ భారీగా పెట్టుబడులు పెడుతున్న మరో రంగం టెక్నాలజీ. కంపెనీ రెండో త్రైమాసికంలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌లో సుమారు 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టినట్లు వెల్లడైంది. ఈ పెట్టుబడితో ఆల్ఫాబెట్ బెర్క్‌షైర్ ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలోని టాప్-5 హోల్డింగ్స్‌లోకి చేరింది. చెవ్రాన్ స్థానాన్ని ఆల్ఫాబెట్ ఆక్రమించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆల్ఫాబెట్ భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.

టేలర్ మోరిసన్ కొనుగోలుతో హౌసింగ్‌లో అడుగు

అబెల్ నాయకత్వంలో బెర్క్‌షైర్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రముఖ హోమ్‌బిల్డర్ టేలర్ మోరిసన్ హోమ్ కార్పొరేషన్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో షేరుకు 72.50 డాలర్ల చొప్పున నగదు చెల్లించే ఈ డీల్‌లో ఈక్విటీ విలువ సుమారు 6.8 బిలియన్‌ డాలర్లు, మొత్తం ఎంటర్‌ప్రైజ్ విలువ సుమారు 8.5 బిలియన్‌ డాలర్లు. బెర్క్‌షైర్ ఇప్పటికే క్లేటన్ హోమ్స్, ఇతర బిల్డింగ్ ప్రొడక్ట్స్ వ్యాపారాల ద్వారా హౌసింగ్ రంగంలో ఉన్న నేపథ్యంలో ఈ కొనుగోలు ఆ వ్యాపారాన్ని మరింత విస్తరించే అవకాశం కల్పిస్తుంది.

బఫెట్‌తో పోలిస్తే భిన్నమైన దిశ

వారెన్ బఫెట్ కాలంలో బెర్క్‌షైర్ భారీ నగదు నిల్వలను కొనసాగిస్తూ, ఆకర్షణీయమైన విలువలు కనిపించే వరకు పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండేది. ముఖ్యంగా అమెరికా షేర్ల విలువలు అధికంగా ఉన్నాయంటూ బఫెట్ పలుమార్లు హెచ్చరించారు. అయితే 2026లో అబెల్ నాయకత్వం ప్రారంభమైన తర్వాత పరిస్థితి మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. షేర్ల బైబ్యాక్‌లు, ఆల్ఫాబెట్‌లో భారీ పెట్టుబడి, టేలర్ మోరిసన్ కొనుగోలు.. బెర్క్‌షైర్ తన నగదు నిల్వలను మరింత చురుగ్గా వినియోగించేందుకు సిద్ధమవుతోందనే సంకేతాలుగా మార్కెట్ విశ్లేషకులు చూస్తున్నారు.

అయితే ఈ మార్పుల మధ్య బెర్క్‌షైర్ షేరు పనితీరు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఆగస్టు 7న మార్కెట్ ముగిసే సమయానికి క్లాస్-B షేర్లు ఈ ఏడాది సుమారు 3.8 శాతం మాత్రమే పెరిగాయి. ఇదే సమయంలో S&P 500 దాదాపు 13 శాతం లాభపడింది. దీంతో అబెల్ తీసుకుంటున్న కొత్త పెట్టుబడి నిర్ణయాలు బెర్క్‌షైర్‌కు దీర్ఘకాలంలో ఎంత మేర విలువను సృష్టిస్తాయన్నది ఇప్పుడు ఇన్వెస్టర్ల ప్రధాన ప్రశ్నగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement