రోజూ ట్రేడింగ్ దండగ.. ఓపికే అసలైన పెట్టుబడి | Warren Buffett Golden Investment Rule, Reveals Secret Behind Why Fewer Decisions Can Create Massive Wealth Over Time | Sakshi
Sakshi News home page

రోజూ ట్రేడింగ్ దండగ.. ఓపికే అసలైన పెట్టుబడి

Aug 3 2026 8:51 AM | Updated on Aug 3 2026 10:03 AM

Warren Buffett 4-Decision Wealth Secret Why You Dont Need Huge Stock Calls

స్టాక్ మార్కెట్ ప్రపంచంలో విజయం సాధించాలంటే రోజూ కొనుగోలు, అమ్మకాలు జరపాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో వందలాది నిర్ణయాలు తీసుకోవడం కంటే అత్యంత నాణ్యమైన నాలుగైదు సరియైన నిర్ణయాలు తీసుకోవడంతో సుదీర్ఘకాలంలో అపారమైన సంపదను సృష్టించవచ్చని దిగ్గజ ఇన్వెస్టర్, బెర్క్‌షైర్ హాత్వే మాజీ సీఈఓ వారెన్‌ బఫెట్ తెలిపారు.

బలవంతపు 'కాల్డ్ స్ట్రైక్స్’

బేస్‌బాల్ దిగ్గజం టెడ్ విలియమ్స్ రాసిన ‘ది సైన్స్ ఆఫ్ హిట్టింగ్’ పుస్తకాన్ని ఉదహరిస్తూ బఫెట్ ఒక ఆసక్తికరమైన పోలికను చెప్పారు. బేస్‌బాల్‌లో బ్యాటర్ వైపు వచ్చే ప్రతి బంతిని ఆడాల్సి ఉంటుంది. అలా ఆడకపోతే అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్‌లో అలాంటి బలవంతపు 'కాల్డ్ స్ట్రైక్స్' ఏవీ ఉండవు. అంటే.. మనకు నచ్చిన కంపెనీ సరైన ధరకు లభించే వరకు ఇన్వెస్టర్ ఏళ్ల తరబడి ఓర్పుతో వేచి ఉండే అవకాశముంది.

పంచ్ కార్డ్ సిద్ధాంతం

ఒక వ్యక్తికి తన జీవితకాలంలో కేవలం 20 ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలు మాత్రమే తీసుకోవడానికి వీలుగా ఒక పంచ్ కార్డ్ ఇస్తే అతను ప్రతి నిర్ణయాన్ని ఎంత క్షుణ్ణంగా ఆలోచించి తీసుకుంటాడో ఊహించుకోవాలని బఫెట్ పేర్కొన్నారు. మార్కెట్లో కనిపించే ప్రతి అవకాశం వెంట పడకుండా అత్యంత నాణ్యమైన కొన్ని కంపెనీలపైనే దృష్టి పెట్టడం వల్ల అత్యుత్తమ ఫలితాలు వస్తాయి.

అర్థమైన వ్యాపారాల్లోనే పెట్టుబడులు

తొలినాళ్లలో అమెజాన్ బిజినెస్ మోడల్ తనకు సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల దానిలో పెట్టుబడి పెట్టలేకపోయానని బఫెట్ అంగీకరించారు. ప్రతీ కంపెనీని లేదా రంగాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇన్వెస్టర్‌కు లేదు. తనకు స్పష్టమైన పరిజ్ఞానం ఉన్న కోకాకోలా, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి వ్యాపార నమూనాలను ఎంచుకోవడం వల్లే బెర్క్‌షైర్ హాత్వే దశాబ్దాలుగా మార్కెట్లను శాసించే లాభాలను సంపాదించగలిగింది.

నేటి వేగవంతమైన డిజిటల్ మార్కెట్లలో రోజూ ట్రేడింగ్ చేస్తూ ఆందోళన చెందే చిన్నతరహా ఇన్వెస్టర్లకు బఫెట్ పాఠం ఒక కంటివిప్పు. రోజువారీ హెచ్చుతగ్గులకు ప్రభావితం కాకుండా స్పష్టమైన అవగాహన ఉన్న కొన్ని నాణ్యమైన కంపెనీలను ఎంచుకుని, దీర్ఘకాలిక దృష్టితో నిరీక్షించడమే విజయానికి నిజమైన రాజమార్గం అని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: నేటి యువత ఖర్చుల బాట..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement