కొనుగోలు నిర్ణయాలను శాసిస్తున్న క్రెడిట్ కార్డులు
ధర కంటే ఆఫర్లకే ప్రాధాన్యం.. షాపింగ్‌కు ముందే కస్టమర్లపై ప్రభావం
ఒకప్పుడు ఒకటే..ఇప్పుడు అవసరాలకు ఐదు కార్డులు
క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు, ప్రి–సేల్ ఆఫర్లతో ఊరింపు
యూపీఐతో అనుసంధానం తర్వాత రోజువారీ ఖర్చుల్లోనూ కార్డుల జోరు
స్మార్ట్‌ఫోన్ కొనాలన్నా, విమానం టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నా, అభిమాన హీరో సినిమా మొదటి ఆట టికెట్ కొనాలన్నా, ఇష్టమైన గాయకుడి కచేరీకి వెళ్లాలనుకున్నా.. ఒకప్పుడు ధర చూసి నిర్ణయం తీసుకునే వినియోగదారుడు ఇప్పుడు ఏ కార్డు వాడితే ఎక్కువ క్యాష్‌బ్యాక్ వస్తుంది?, ఏ కార్డుతో కొంటే ముందుగా టికెట్ దొరుకుతుంది? ఏ బ్యాంక్ ఆఫర్ బెస్ట్? అని లెక్కవేస్తున్నాడు.
క్రెడిట్ కార్డులు ఒకప్పటిలా కేవలం బిల్లు చెల్లింపు సాధనాలుగా కాకుండా కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తివంతమైన మార్కెటింగ్ ఆయుధాలుగా మారాయి. డిజిటల్ చెల్లింపుల ప్రపంచాన్ని ఇవి పూర్తిగా మార్చేస్తున్నాయి. ఒకప్పుడు బిల్లులు చెల్లించే సాధనంగా చివర్లో బయటకు వచ్చే క్రెడిట్ కార్డు... ఇప్పుడు వినియోగదారుడి కొనుగోలు నిర్ణయాలను శాసించే ‘ప్లేయింగ్ కార్డ్’గా మారి కొనడానికి ముందే ప్రభావితం చేస్తోంది. ధర కంటే ఆఫర్, అవసరం కంటే రివార్డు ముఖ్యమవుతున్న ఈ కొత్త వినియోగ సంస్కృతి, ప్లాస్టిక్ కార్డు పవర్ రిటైల్ మార్కెట్‌ను కొత్త దిశలో నడిపిస్తున్న ట్రెండ్‌పై వెల్త్ స్టోరీ
దేశంలో డిజిటల్ చెల్లింపుల విస్తరణతో పాటు క్రెడిట్ కార్డుల పాత్ర కూడా వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు కొనుగోలు పూర్తయ్యాక ఉపయోగించే క్రెడిట్ కార్డు కొనుగోలు ప్రక్రియ ప్రారంభంలోనే కస్టమర్‌ను ప్రభావితం చేస్తోంది. ఈకామర్స్, ట్రావెల్, ఎల్రక్టానిక్స్, వినోద రంగాల్లో ప్రత్యేక క్రెడిట్ కార్డుల ఆఫర్లు కొనుగోలు నిర్ణయాలను మలుపు తిప్పుతున్నాయి. ఏ వస్తువు కొనాలి అన్న ప్రశ్నతో పాటు ఏ కార్డుతో కొనాలి అనే ప్రశ్న కూడా ఇప్పుడు కస్టమర్ ముందుంటోంది.
రూపే కార్డు యూపీఐ అనుసంధానంతో కిరాణా దుకాణం నుంచి ఫుడ్ డెలివరీ వరకు చిన్న చిన్న మొత్తాలకు కూడా క్రెడిట్ కార్డులు వినియోగంలోకి వస్తున్నాయి. యువతరం ఆసక్తితో క్రెడిట్ కార్డుల ఆదరణ మరింత పెరుగుతోంది. ఉద్యోగం వచ్చిన వెంటనే తొలి క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసే వారిసంఖ్య గణనీయంగా పెరిగింది. ఖర్చుల నిర్వహణ, క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి ముఖ్యంగా రివార్డు పాయింట్లు కోసం యువత కార్డులను ఎక్కువగా ఎంచుకుంటోంది.
దీంతో క్రెడిట్ కార్డు వ్యాపారంలో పోటీకూడా తీవ్రమవుతోంది. వినియోగదారులు ఇప్పుడు ఒకే కార్డుకు పరిమితం కావడం లేదు. ప్రయాణాలకు ఒకటి, షాపింగ్‌కు మరొకటి, రోజువారీ ఖర్చులకు ఇంకొకటి అంటూ దాదాపు మూడు నుంచి ఐదు కార్డులను వాడుతున్నారు. దీంతో బ్యాంకులు కస్టమర్ లాయల్టీ (విధేయత) నిలబెట్టుకునేందుకు రకరకాల ఆఫర్లతో వివిధ కంపెనీల భాగస్వామ్యంతో కో బ్రాండెడ్ కార్డులను అందుబాటులోకి తెస్తున్నాయి. మార్కెట్ పరిశోధన సంస్థల అంచనా ప్రకారం భారత క్రెడిట్ కార్డు మార్కెట్ విలువ 2025లో 20.1 బిలియన్ డాలర్లు కాగా 2034 నాటికి 38.3 బిలియన్ డాలర్లకు పెరగనుంది.
కొనుగోలుకు ముందే కార్డుల ప్రభావం
గతంలో క్రెడిట్ కార్డుల ప్రధాన అవసరం, ఆకర్షణ షాపింగ్ బిల్లులు చెల్లించడం, విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ ఇంకా కొన్ని డిస్కౌంట్ ఆఫర్లకే పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. షాపింగ్‌కు ముందే వస్తువును ఏ కార్డుతో కొనాలి అనేది వినియోగదారుల నిర్ణయంలో కీలకంగా మారింది. ఫలితంగా ప్రతి కొనుగోలు ఒక చిన్న ఆర్థిక లెక్కగా మారుతోంది.
సినిమాలు, లైవ్ ఈవెంట్లు, కచేరీలు, నాటికలు, నృత్య ప్రదర్శనలు, కొత్త గాడ్జెట్ల విడుదల, ఈకామర్స్ పండగ సేల్స్ సమయంలో క్రెడిట్ కార్డు ఆఫర్లు వినియోగదారుల ఎంపికను ప్రభావితం చేస్తున్నాయి. ఒక ప్రత్యేకమైన కార్డు ఉంటే ముందుగానే టికెట్ దొరుకుతుంది. అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో కార్డునుబట్టి అది అందించే ప్రయోజనాలను బట్టి వినియోగదారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటికోసం ఒకటికి మించి కార్డులను వాడుతున్నారు.
ఆఫర్లే అసలు ఆయుధం
క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లు, రివార్డు పాయింట్లు, ఈఎంఐ సదుపాయాలు, ప్రత్యేక సేల్స్ యాక్సెస్‌లు ఇప్పుడు బ్యాంకుల ప్రధాన పోటీ ఆయుధాలుగా మారాయి. పండుగ సీజన్లలో ఈకామర్స్ లావాదేవీల్లో ప్రత్యేక కోబ్రాండెడ్ కార్డుల ఆఫర్లతో బిజినెస్ బాగా జరుగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కో బ్రాండెడ్ కార్డులు కేవలం చెల్లింపు సాధనాలుగా కాకుండా వినియోగదారుల కొనుగోలు ప్రవర్తనను నిర్దేశిస్తున్నాయి.
క్రెడిట్ కార్డుల ప్రయాణంలో యూపీఐ అనుసంధానం కీలక మలుపుగా మారింది. రూపే క్రెడిట్ కార్డులతో చిన్న చిన్న మొత్తాలకు కూడా కార్డు వాడే అలవాటు పెరిగింది. కిరాణా, ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సేవలు ఇలా రోజువారీ ప్రతి ఖర్చులోనూ క్రెడిట్ కార్డులు ప్రవేశించాయి. ఇది వినియోగ ఫ్రీక్వెన్సీని పెంచడమే కాకుండా క్రెడిట్ కార్డు వాడకాన్ని అప్పు చేయడం అనే భావన నుంచి ఖర్చు చేసే సాధనంగా భావించేలా చేస్తున్నాయని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి.
ఎక్కువ కార్డులు.. ఎక్కువ ప్రమాదం
ఒకప్పుడు ఒక కుటుంబానికి ఒకటి, లేదా రెండు కార్డులు ఉంటే సరిపోయేది. ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు మూడు నుంచి ఐదు కార్డులు వాడుతున్నారు. ప్రయాణాలకు ఒకటి, షాపింగ్‌కు ఒకటి, రివార్డులకు మరొకటి ఉపయోగిస్తున్నారు.దీంతో వినియోగదారుల లాయల్టీ ఒక బ్యాంకు, ఒక కార్డు కాకుండా కొనుగోలు సమయంలో అత్యుత్తమ ప్రయోజనం ఇచ్చే కార్డు వైపు మారిపోతోంది. ఈ సౌలభ్యం వెనక కొన్ని కనబడని ప్రమాదాలు దాగున్నాయి.
ఎక్కువ క్యాష్‌బ్యాక్‌లు, ప్రత్యేక ఆఫర్లు, సులభతరమైన క్రెడిట్ కారణంగా అవసరం లేని కొనుగోళ్లు పెరుగుతాయి. చిన్న చిన్న బకాయిలైనా ఎక్కువ కార్డుల వాడకం వల్ల నెలవారీ బిల్లు కట్టే సమయంలో పెద్ద భారంగా మారతాయి. రుణం సులభంగా లభించినా క్రెడిట్ కార్డులపై బ్యాంకులు 30 శాతానికి పైగా వడ్డీ గుంజుతాయి.ఆదాయానికి, చేసే ఖర్చుకి పొంతనలేక యువతరం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్న విషయాన్ని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక రుణ వినియోగం అమెరికాలో 2008 నాటి లేమాన్ బ్రదర్స్ సంక్షోభాన్ని ఎలా సృష్టించిందో తెలుసుకోవాలని చెబుతున్నారు.
జెన్ జెడ్ చేతిలో కార్డు శక్తి
→ అమెజాన్–పేకెర్నీ ఇండియా నివేదిక ప్రకారం యువతలో క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరుగుతోంది.
→ 65% మంది యువ తరం ఉద్యోగంలో చేరిన వెంటనే తొలి క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారు
→ 32% మంది ఖర్చుల నిర్వహణ కోసం కార్డులు వాడుతున్నారు
→ 30% మంది క్యాష్‌బ్యాక్‌లు, రివార్డుల కోసం ఎంచుకుంటున్నారు
→ 23% మంది క్రెడిట్ స్కోర్ పెంచుకునేందుకు కార్డులు ఉపయోగిస్తున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా క్రెడిట్ కార్డుల వినియోగం పరిశ్రమకు కొత్త అవకాశాలను కల్పిస్తోంది.
– సాక్షి, వెల్త్ డెస్క్


