కమిషన్‌ లేని ఆన్‌లైన్‌ స్టోర్‌: రైతుల జీవితాల్లో వెలుగులు! | Aniket Gharge Jay Siddhapura: Indian Farmer Entrepreneurs Online Store | Sakshi
Sakshi News home page

కమిషన్‌ లేని ఆన్‌లైన్‌ స్టోర్‌: రైతుల జీవితాల్లో వెలుగులు!

Jul 3 2026 9:03 AM | Updated on Jul 3 2026 9:03 AM

Aniket Gharge Jay Siddhapura: Indian Farmer Entrepreneurs Online Store

ఇండియన్‌ ఫార్మర్‌ ఆంట్రప్రెన్యూర్స్‌’ (ఐఎఫ్‌ఈ) స్టోర్‌

మహారాష్ట్రకు చెందిన ఇద్దరు స్నేహితులు ఐటీ ఉద్యోగాల వైపు వెళ్లకుండా, రైతుల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వారే అనికేత్‌ ఘార్గే, జయ్‌ సిద్ధపురా. వీళ్లిద్దరూ ఇంజనీరింగ్‌ చదివేటప్పటి నుంచి స్నేహితులు. మధ్యవర్తుల దోపిడీకి గురవుతున్న రైతులను ఆదుకోవటానికి ‘ఇండియన్‌ ఫార్మర్‌ ఆంట్రప్రెన్యూర్స్‌’ (ఐఎఫ్‌ఈ) స్టోర్‌ అనే ఆన్‌ లైన్‌ మార్కెట్‌ను 2022లో ప్రారంభి దిగ్విజయంగా నడుపుతున్నారు. కమిషన్‌ లేని ఆన్‌లైన్‌ మార్కెట్‌ కావటంతో దేశవ్యాప్తంగా వినియోగదారులకు వీరు ఉత్పత్తులను అమ్మగలుగుతున్నారు. దీంతో రైతుల ఆదాయం రెట్టింపైందని చెబుతున్నారు.

సతారాలోని వడగావ్‌ గ్రామానికి చెందిన అనికేత్‌ రైతు కుటుంబంలో పుట్టాడు. అతనికి బాల్యం నుంచే వ్యవసాయంపై మక్కువ ఉండేది. కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాక, అతను పూణేలోని ఒక వెబ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీలో ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. అయితే, 2017లో అతను ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని, రైతుల కథలను పంచుకోవడానికి తన సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించాడు. స్కూల్‌లో చదువుకునే రోజుల నుంచే రైతులతో మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకోవాలని అనుకునేవాడిని అంటాడాయన. ప్రస్తుతం ఆయన యూట్యూబ్‌ ఛానెల్‌లో సుమారు 2.5 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.

ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ, రైతులు మధ్యవర్తుల సహాయం లేకుండా తమ ఉత్పత్తులను అమ్ముకోవటానికి ప్రత్యేకమైన మార్కెట్‌ దాదాపుగా లేదని అతను గుర్తించి ప్రత్యామ్నాయం వైపు ఆలోచన సారించాడు. వ్యవసాయంపై తనకున్న ఆసక్తిని, టెక్నాలజీ నేపథ్యాన్ని మేళవించి కళాశాల స్నేహితుడైన జయ్‌తో కలిసి రైతుల కోసం అనికేత్‌ ఒక ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు.

సాధారణంగా రైతులు పండించిన పంటను అమ్ముకోవటానికి మధ్యవర్తులపై ఆధారపడాల్సి వస్తుంది. వారు దాదాపు 30 శాతం వరకు కమిషన్‌ వసూలు చేస్తూ లాభాలన్నీ తామే గడిస్తున్నారు. ఫలితంగా రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ‘ఐఎఫ్‌ఈ స్టోర్‌’ ఎలాంటి కమిషన్‌ లేకుండా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి, మధ్యవర్తుల బెడదను తొలగించడానికి సహాయపడుతోంది.

రైతులు పండించిన ఆర్గానిక్‌ పంటలతో పాటు బెల్లం క్యాండీలు, పసుపు పొడి, మిల్లెట్‌ ఉత్పత్తులు, పచ్చళ్లు, మసాలాలు వంటి దాదాపు 25 రకాల విలువ ఆధారిత ఉత్పత్తులను ఈ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అనికేత్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా రైతులను సంప్రదించి, వారి పొలాలను సందర్శించి, ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) లైసెన్స్‌ ఉన్న ఉత్పత్తులను సేకరిస్తారు. కేవలం రూ.10 ప్యాకేజింగ్‌ ఖర్చు మినహా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరు. ఈ విధానం వల్ల కేవలం ఏడాది కాలంలోనే రైతుల ఆదాయం రెట్టింపు అయింది.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని రైతులకు చెందిన ఉత్పత్తులు ఈ ఆన్‌ లైన్‌ మార్కెట్‌ ద్వారా ఇప్పుడు గుజరాత్, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం సహా 15కు పైగా రాష్ట్రాల్లోని వినియోగదారులకు చేరుతున్నాయి. కొరియర్‌ సేవల పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, వాటిని అధిగమిస్తూ వీరు ముందుకు సాగుతున్నారు.  తల్లిదండ్రులు ఐటీ ఉద్యోగం చేయాలని కోరినప్పటికీ, అనికేత్‌ తన అభిరుచిని నమ్ముకుని సామాజిక మార్పు కోసం కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాల రైతులను ఈ వేదికపైకి తీసుకురావడమే వీరి లక్ష్యం. టెక్నాలజీని సరైన మార్గంలో ఉపయోగిస్తే రైతుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని ఈ ఇద్దరు స్నేహితులు నిరూపించారు.

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement