కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నేత, మమతా బెనర్జీ సన్నిహితుడు ఆశిష్ బెనర్జీ (74) బీర్భూమ్ జిల్లాలోని రంపూర్‌హాట్‌లోని టీఎంసీ కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం ఉదయం ఆయన శవమై కనిపించడంతో రాజకీయ వర్గాలలో కలకలం చెలరేగింది. రంపూర్‌హాట్‌లోని ఆయన నివాసానికి సమీపంలోనే ఈ పార్టీ కార్యాలయం ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఒక లేఖ లభించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆ లేఖకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆశిష్ బెనర్జీ ఉమ్మడి బీర్భూమ్ జిల్లాలోని రంపూర్‌హాట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. బుర్ద్వాన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన ఆయన, గతంలో రంపూర్‌హాట్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా కూడా సేవలు అందించారు. టీఎంసీలో కీలక నేతగా ఉన్న ఆయన జూలై 2021 నుంచి మే 2026 వరకు పశ్చిమ బెంగాల్ శాసనసభ 13వ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ పరిణామాలపై రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: బుల్లెట్ రైలు: ముంబై-సూరత్ స్టేషన్ల ఫస్ట్ లుక్!


