కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు చేదు అనుభవం ఎదురైంది. బస చేసేందుకు వెళ్లిన తనని అతిథి గృహం నుంచి ఆర్ధ రాత్రి బయటకు గెంటేసినట్లు ఆరోపించారు. ఈ ఘటనపై ఆమె లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత తన నియోజకవర్గమైన కృష్ణానగర్‌కు చేరుకున్న మహువా మొయిత్రా శుక్రవారం సాయంత్రం 6:15 గంటలకు స్థానిక సర్క్యూట్ హౌస్‌లో (ప్రభుత్వ అతిథి గృహం)బస చేసేందుకు వెళ్లారు. ఆమెకు అధికారులు రూమ్‌ను కేటాయించగా..రాత్రి 9:20 గంటలకు గదిలోనే భోజనం కూడా అందించారు. అయితే, రాత్రి 9:47 గంటలకు నదియా అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. ‘పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు’వెంటనే సర్క్యూట్ హౌస్ గదిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరారు.
దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాను అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత రాత్రి 10:52 గంటలకు సర్క్యూట్ హౌస్‌ను శుభ్రం చేసే పనుల నిమిత్తం గదిని ఖాళీ చేయాలంటూ వాట్సాప్ ద్వారా ఒక అధికారిక ఉత్తర్వును పంపారు. అంతేకాకుండా, తాను గదిని ఖాళీ చేయడానికి నిరాకరించడంతో అర్ధరాత్రి 11 గంటల సమయంలో సర్క్యూట్ హౌస్ గేట్లు బయట పెద్ద ఎత్తున గుమిగూడిన కొందరు వ్యక్తులు తనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని మహువా మొయిత్రా వాపోయారు
రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న మహిళా ఎంపీని బలవంతంగా బయటకు గెంటాలని చూడటం ఆమె భద్రతకు ముప్పు కలిగించడమేనని మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో దేశవ్యాప్తంగా మహిళా పార్లమెంటు సభ్యుల గౌరవభద్రతలను కాపాడాలని కోరారు. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం ఎంపీలకు సర్క్యూట్ హౌస్‌లలో బస చేసే అధికారిక హక్కు ఉంటుందని ఆమె గుర్తుచేశారు.
ఈ వ్యవహారంపై లోక్‌సభలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టడంతో పాటు, కోర్టును ఆశ్రయించే విషయమై కూడా ఆలోచిస్తున్నట్లు ఆమె తెలిపారు. మరోవైపు టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీతో పాటు పలువురు విపక్ష నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.


