ముంబై: ఐఏఎస్ అధికారి, మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారం ముండే హెచ్చరికలు జారీ చేశారు. తనకు లంచం ఇవ్వాలని అనుకుంటే ఒకటికి వందసార్లు ఆలోచించుకోండి’అని హితువు పలికారు.
తుకారం ముండే ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో లంచం ఆఫర్లు, తనపై వస్తున్న విమర్శలు, ఆహార భద్రత తనిఖీలపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మహారాష్ట్రలో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా, ఆహార కల్తీకి వ్యతిరేకంగా తుకారం ముండే నేతృత్వంలో ఎఫ్‌డీఏ అధికారులు చేపడుతున్న మెరుపు దాడులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పనితీరుపై సామాన్య ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నప్పటికీ, నిబంధనలు పాటించక లైసెన్స్‌లు కోల్పోయిన కొందరు వ్యాపారుల నుంచి వ్యతిరేకత కూడా ఎదురవుతోంది.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆయనను ‘ఇంతవరకు ఎవరైనా మీకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారా?’ అని ప్రశ్నించగా..‘ఎవరూ నాతో ఆ సాహసం చేయలేరని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా అలాంటి ఆలోచన చేస్తే మాత్రం, వారు అలా చేయడానికి ముందు వంద సార్లు ఆలోచించాలి’ అని ముండే హెచ్చరించారు.
తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. తాను కఠినంగా వ్యవహరించడం వల్ల కొందరు తనను ‘అహంభావి’ అని, ఎవరి మాట వినరని విమర్శిస్తుంటారని తెలిపారు. అయితే తాను మాత్రం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడమే ధ్యేయంగా పెట్టుకున్నానని స్పష్టం చేశారు.
‘మనం చేయాల్సిన పనుల పట్ల, చేసిన పనుల పట్ల నిజాయితీగా, పారదర్శకంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం. అది ఫలిస్తే అంతకంటే సంతోషం లేదు, లేదంటే కనీసం నేను ప్రయత్నించానన్న తృప్తి నాకు ఉంటుంది’ అని ఆయన తన పనితీరును వివరించారు. ప్రజలు తనను స్ఫూర్తిగా కొనియాడుతుండటంపై స్పందిస్తూ.. తాను ఎలాంటి గొప్ప విప్లవాలు చేయట్లేదని, కేవలం తన విధిని మాత్రమే తాను నిర్వర్తిస్తున్నట్లు వెల్లడించారు.


