న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ మాక్ ఇంటర్వ్యూలో అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తి, రూ. 500 లంచం ఇవ్వడానికే తీవ్రంగా బాధపడ్డానని చెప్పిన ఓ ఐపీఎస్ అధికారి..ఇప్పుడు ఏకంగా రూ.1 కోటి లంచం తీసుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాహుల్ బన్సాల్‌కు సంబంధించిన పాత ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
సివిల్స్ పరీక్షల ప్రిపరేషన్ సమయంలో ఇచ్చిన మాక్ ఇంటర్వ్యూలో రాహుల్ బన్సాల్ అవినీతి, పరిపాలనా సంస్కరణలపై మాట్లాడారు. ఆ సందర్భంగా తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ.. ‘నా సోదరుడు ఐఐటీ కాన్పూర్‌లో చదువుతున్నప్పుడు ఒక రీసెర్చ్ పేపర్ ప్రజంటేషన్ కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. వీసా కోసం ఆయన బర్త్ సర్టిఫికెట్ అత్యవసరమైంది. అయితే, ఆ సర్టిఫికెట్ త్వరగా జారీ చేయడానికి ఒక పంచాయతీ అధికారి రూ. 500 లంచం డిమాండ్ చేశారు. ఆ రూ. 500 లంచం ఇవ్వడానికి నేను ఎంతో బాధపడ్డాను’ అని పేర్కొన్నారు. వ్యవస్థలో కొందరు అవినీతిపరులు ఉన్నప్పటికీ, మొత్తం వ్యవస్థను నిందించలేమని, పోలీసు శాఖలో సంస్కరణలు రావాలని ఆయన ఆ ఇంటర్వ్యూలో వివరించారు.
రూ. 1 కోటి లంచం ఆరోపణల నేపథ్యం
కాలం గడిచాక ఐపీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ బన్సాల్‌పై ప్రస్తుతం ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టులో రూ. 1 కోటి లంచం కేసు నమోదైంది. ఒక సైబర్ ఫ్రాడ్ కేసును సెటిల్ చేయడానికి బన్సాల్‌తో పాటు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రాథోడ్, కానిస్టేబుల్ అంశుల్ శర్మ కలిసి రూ. 1 కోటి డిమాండ్ చేసి తీసుకున్నట్లు ఫిర్యాదుదారుడు ఆరోపించారు.
ఫిర్యాదు ప్రకారం.. ఈ రూ. 1 కోటి మొత్తాన్ని ఒకేసారి కాకుండా, మే 2026లో హవాలా మార్గాల ద్వారా చెరో రూ. 50 లక్షల చొప్పున రెండు విడతల్లో చెల్లించినట్లు పేర్కొన్నారు. ఈ లావాదేవీలకు సంబంధించిన వాట్సాప్ చాట్‌లు, కాల్ రికార్డింగ్‌లు వంటి డిజిటల్ ఆధారాలను కూడా ఫిర్యాదుదారుడు కోర్టుకు సమర్పించారు.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రత్యేక న్యాయస్థానం.. ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదించాలని ఛత్తీస్‌గఢ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌తో పాటు సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఐపీఎస్ అధికారి కాకముందు రాహుల్ బన్సాల్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ఐపీఎస్ అయ్యాక ఆయన మొదటి ఫీల్డ్ పోస్టింగ్ ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా లభించింది. ఆ సమయంలోనే ఈ సైబర్ మోసం కేసు సెటిల్‌మెంట్ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
రూ. 500 లంచం ఇవ్వడానికే అసౌకర్యంగా భావించిన వ్యక్తి, అధికారంలోకి వచ్చాక రూ. కోటి లంచం ఆరోపణల్లో చిక్కుకోవడం విధి వైపరీత్యమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణల నిగ్గు తేలాలంటే విచారణ పూర్తవ్వాల్సి ఉంది.
This is a mock interview of Rahul Bansal, IPS trainee. Look at how he was concerned about corruption in the bureaucracy, how he himself had been a victim of it, and how he expressed anguish at it.
He is now under scanner for allegedly demanding and receiving ₹1 crore to settle… pic.twitter.com/H7LIGYK3kS— THE SKIN DOCTOR (@theskindoctor13) August 12, 2026


