బ్రేక్ బదులు యాక్సిలరేటర్ తొక్కడంతో ఘోరం! | Kolkata Tragedy: Woman Dies as New Car Plunges into Pond During Driving Practice | Sakshi
Sakshi News home page

బ్రేక్ బదులు యాక్సిలరేటర్ తొక్కడంతో ఘోరం!

Aug 13 2026 5:20 AM | Updated on Aug 13 2026 11:29 AM

Woman Dies After Plunging Into Pond In New Car While Learning To Drive

కోల్‌కతా: డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం కారు నడపడం ప్రాక్టీస్ చేస్తూ, నియంత్రణ కోల్పోయి వాహనంతో సహా చెరువులో పడి ఓ 42 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది.

కోల్‌కతాలోని కేస్టోపూర్ పరిధిలోని ప్రఫుల్ల కానన్  ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమిత్రా దాస్ (42) అనే మహిళ తన కుమార్తెను స్కూటర్ పై పాఠశాలలో దింపి ఇంటికి తిరిగి వచ్చారు. అనంతరం స్కూటర్‌ను పార్క్ చేసి, గ్యారేజ్ నుంచి తమ  కారును బయటకు తీసి డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు.

ఆగస్టు 22న ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష జరగాల్సి ఉంది. దీంతో ఆమె భర్త కృష్ణేందు దాస్ ఇటీవల కొనుగోలు చేసిన కారులో ఆమె డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. అయితే, డ్రైవింగ్‌లో సరైన అనుభవం లేకపోవడంతో, బ్రేక్ వేయబోయి పొరపాటున యాక్సిలరేటర్‌ను గట్టిగా తొక్కారు. దీంతో కారు ఒక్కసారిగా వేగంగా దూసుకెళ్లి సమీపంలోని చెరువు మధ్యలోకి పడిపోయింది.

కారు క్షణాల్లో నీటిలో పూర్తిగా మునిగిపోయింది. స్థానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సుమారు గంటకు పైగా శ్రమించి కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు.

కారును వెలికితీసిన సమయంలో సుమిత్రా దాస్ మృతదేహం వెనుక భాగం వైపు తిరిగి, కాళ్లు స్టీరింగ్ వైపు ఉన్నాయి. కారు నీటిలో మునిగిపోతున్న సమయంలో ఆమె వెనుక డోర్ ద్వారా ప్రాణాలు కాపాడుకోవడానికి విఫలయత్నం చేసినట్లు అధికారులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement