మహారాష్ట్రలో ఆటో-రిక్షా, ట్యాక్సీ, యాప్ ఆధారిత క్యాబ్‌లను నడిపే వాణిజ్య ప్రయాణికుల వాహన డ్రైవర్లకు మరాఠీ భాషపై ఆచరణాత్మక పరిజ్ఞానం తప్పనిసరి కానుంది. ఇందుకు అనుగుణంగా మహారాష్ట్ర ప్రభుత్వం మోటార్ వెహికల్స్ రూల్స్‌లో మార్పులు చేసింది. ఈ నిబంధనలను ఆగస్టు 16, 2026 నుంచి కఠినంగా అమలు చేయనున్నట్లు రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఇప్పటికే ప్రకటించారు.
కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికులతో ప్రాథమికంగా మాట్లాడేందుకు, వారి అవసరాలను అర్థం చేసుకునేందుకు సరిపడే స్థాయిలో డ్రైవర్‌కు మరాఠీపై పరిజ్ఞానం ఉండాలి. ఈ నిబంధన కేవలం డ్రైవర్లకే కాకుండా సంబంధిత పర్మిట్ హోల్డర్లకు కూడా వర్తిస్తుంది. మోటార్ వెహికల్స్ రూల్స్‌లోని 4, 22, 78, 85 నిబంధనలకు చేసిన సవరణల ద్వారా భాషా పరిజ్ఞానాన్ని లైసెన్స్, పర్మిట్‌కు సంబంధించిన నిబంధనల్లోకి తీసుకొచ్చారు.
పాటించకపోతే ఏమవుతుంది?
మరాఠీలో కనీస స్థాయి సంభాషణ కూడా చేయలేని డ్రైవర్‌కు ముందుగా నెల రోజుల గడువు ఇచ్చే విధానం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆ గడువులోనూ అవసరమైన భాషా పరిజ్ఞానం సాధించకపోతే డ్రైవింగ్ అనుమతిని మూడు నెలల వరకు సస్పెండ్ చేయవచ్చు. ఆ తర్వాత కూడా నిబంధనలను పాటించకపోతే లైసెన్స్ లేదా సంబంధిత బ్యాడ్జ్‌ను రద్దు చేసే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే వేలాది మందికి శిక్షణ
ఈ నిబంధన అమలుకు ముందు ప్రభుత్వం డ్రైవర్లకు మరాఠీ నేర్పేందుకు శిక్షణ కార్యక్రమాలను కూడా చేపట్టింది. హిందూహృదయసమ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మరాఠీ శిక్వాణీ అభియాన్ కింద రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మూడు నెలల ఫంక్షనల్ మరాఠీ శిక్షణ పూర్తి చేసినట్లు ఆగస్టు 7న వెల్లడైంది.
అంతకుముందు మే 1 నుంచే నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, డ్రైవర్లకు భాష నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆగస్టు 15 వరకు 100 రోజుల గడువు ఇచ్చింది. ఈ కాలంలో రాష్ట్రంలోని ఆర్‌టీవోలు, డిప్యూటీ ఆర్‌టీవోల పరిధిలో తనిఖీలు, అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.


