పార్లమెంట్ ఉభయ సభల్లో తీర్మానం ఆమోదం
జాయింట్ పార్లమెంటరీ కమిటీలో 31 మంది సభ్యులు
శీతాకాల సమావేశాల మొదటి వారంలోని చివరి రోజు నాటికి నివేదిక
బిల్లును ఉపసంహరించుకోవాలని విపక్షాల డిమాండ్
న్యూఢిల్లీ: విదేశీ విరాళాలపై నియంత్రణ కోసం ఉద్దేశించిన వివాదాస్పద ‘ఫారిన్ కంట్రిబ్యూషన్(రెగ్యులేషన్) సవరణ బిల్లు–2026’ను 31 మంది సభ్యులతో కూడిన ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం పార్లమెంట్ ఉభయ సభల్లో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంత రాయ్ లోక్‌సభలో ఈ తీర్మానాన్ని సభలో ప్రవేవపెట్టారు.
బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సభలో నినాదాలతో హోరెత్తించాయి. జేపీసీలో 21 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. లోక్‌సభ సభ్యులను స్పీకర్ ఓం బిర్లా నామినేట్ చేస్తారు. రాజ్యసభ సభ్యులను చైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ నామినేట్ చేయబోతున్నారు. 2026లో పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి వారంలోని చివరి రోజు నాటికి లోక్‌సభకు నివేదికను సమర్పించాలని జేసీపీ కమిటీకి గడువు నిర్దేశించారు.
బిల్లు వెనుక దురుద్దేశం లేదు: రిజిజు
ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనారిటీకు సంబంధించిన సంస్థలను లక్ష్యంగా చేసుకునేలా బిల్లు ఉందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. సదుద్దేశంతో సమాజానికి సేవలు అందిస్తున్న సంస్థలపై విదేశీ నిధుల నియంత్రణ పేరుతో ఒత్తిడి పెంచుతున్నారని విమర్శించారు. విదేశాల నుంచి విరాళాలు పొందుతున్న సంస్థల విషయంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
మైనారిటీ సంస్థలను టార్గెట్ చేయడం సరైంది కాదన్నారు. బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నిజంగా విదేశీ నిధుల పారదర్శకతే లక్ష్యమైతే, అన్ని సంస్థలకు ఒకే విధమైన నిబంధనలు ఉండాలని తేల్చిచెప్పారు. కేసీ వేణుగోపాల్ ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. ఈ బిల్లు ఏ మతం, వర్గం లేదా సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి కాదని స్పష్టం చేశారు.
విదేశీ నిధుల దురి్వనియోగాన్ని అరికట్టడం, దేశ భద్రతను కాపాడటం, విదేశీ విరాళాల్లో పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. బిల్లులో మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్న ఏదైనా నిర్దిష్ట నిబంధనను చూపించాలని విపక్షాలకు సవాలు విసిరారు. ఈ బిల్లు వెనుక ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. అనంతరం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే ఎంపీ టి.ఆర్.బాలు మాట్లాడారు.
విదేశీ నిధుల నియంత్రణ పేరుతో సామాజిక సంస్థల కార్యకలాపాలపై నిఘా పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విపక్షాల నిరసనల మధ్య బిల్లును జేపీసీకి పంపే తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టారు. మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందింది. ఈ సవరణ బిల్లును సంయుక్త కమిటీకి పంపే తీర్మానాన్ని రాజ్యసభ సైతం ఆమోదించింది. సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించారు.
గనులు, ఖనిజాల సవరణ బిల్లు
గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టాన్ని సవరించే బిల్లును లోక్‌సభలో ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించారు. గనులు, ఖనిజాలకు సంబంధించిన నిబంధనలను సవరించాలని ఈ బిల్లు సూచిస్తోంది. దీనిద్వారా ఖనిజ హక్కులపై అదనపు పన్ను విధించకుండా రాష్ట్రాలను నియంత్రించడానికి వీలవుతుంది. గనులు, ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) చట్టం కింద నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఖనిజ నిల్వలు కలిగిన భూముల నియంత్రణను కూడా ఈ బిల్లు ద్వారా కేంద్రం తన పరిధిలోకి తీసుకోనుంది.
‘కేరళం’బిల్లుకు ఆమోదముద్ర
కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చేందుకు కేంద్రం తీసుకొచి్చన కేరళ(పేరు మార్పు) బిల్లు–2026 పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందింది. మంగళవారం లోక్‌సభలో, బుధవారం రాజ్యసభలో
ఆమోదించారు.


