డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో 12వ తరగతి చదువుతున్న ఒక క్రీడాకారిణి అంతర్జాతీయ తైక్వాండో టోర్నమెంట్‌కు వెళ్లలేకపోయిన ఉదంతం రాజకీయ దుమారానికి దారితీసింది. ఆ విద్యార్థిని వద్ద రూ. 1.5 లక్షలు లంచం డిమాండ్ చేశారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించగా, ఆ తర్వాత సదరు విద్యార్థిని మరో వీడియో విడుదల చేసి అసలు వాస్తవాలను వెల్లడించింది.
డెహ్రాడూన్‌లోని సీఎన్ఐ గర్ల్స్ స్కూల్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థిని శైరా, ఆగస్టు 10న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నిర్వహించిన ‘ముఖ్యమంత్రి యువ విద్యార్థి మంథన్’ కార్యక్రమంలో పాల్గొంది. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించి అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యానని, అయితే రూ. 1.5 లక్షలు సమకూర్చుకోలేక ఆ టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయానని సీఎం ఎదుట భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. దీంతో సీఎం ధామి ఆమెను ఓదార్చి, విద్యార్థిని వివరాలు సేకరించి తగిన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
లంచం ఆరోపణలతో కాంగ్రెస్ విమర్శలు
ఈ సంఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో స్పందించింది. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి విద్యార్థిని నుంచి రూ. 1.5 లక్షలు లంచం డిమాండ్ చేశారని ఆరోపిస్తూ ఎక్స్ వేదికగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. జాతీయ స్థాయిలో స్వర్ణం గెలిచిన ప్రతిభావంతురాలైన విద్యార్థినిని బీజేపీ అవినీతి పాలన వల్ల అంతర్జాతీయ వేదికకు దూరం చేశారని ధ్వజమెత్తింది. అంతేకాకుండా, ముఖ్యమంత్రి సోషల్ మీడియా ఖాతాల నుంచి ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని తొలగించారని కాంగ్రెస్ ఆరోపించింది.
उत्तराखंड में एक बहादुर बेटी ने CM पुष्कर सिंह धामी के सामने खड़े होकर BJP सरकार के भ्रष्टाचार की पोल खोल दी।
बच्ची ने बताया 👇
मैंने ताईक्वांडो में नेशनल लेवल पर गोल्ड मेडल जीता था, लेकिन मैं इंटरनेशनल खेलने नहीं जा सकी, क्योंकि मुझसे 1.5 लाख रुपए की घूस मांगी गई।
CM धामी ने… pic.twitter.com/D9kKJiyOm9— Congress (@INCIndia) August 12, 2026
అసలు వాస్తవం చెప్పిన విద్యార్థిని
ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో శైరా మరో వీడియోను విడుదల చేసి పూర్తి వివరణ ఇచ్చింది. సీఎం కార్యక్రమంలో సమయం లేక పూర్తి విషయాన్ని చెప్పలేకపోయానని తెలిపింది. జమ్మూలో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లో గెలిచిన తర్వాత రొమేనియాలో జరిగే అంతర్జాతీయ టోర్నమెంట్‌కు ఎంపికైనట్లు పేర్కొంది.
ఆ పర్యటనకు అయ్యే మొత్తం ఖర్చులో సంబంధిత క్రీడా సంస్థ సుమారు రూ. 1.70 లక్షలు భరించేందుకు అంగీకరించిందని, మిగిలిన రూ. 1.5 లక్షల ఖర్చును తానే స్వయంగా భరించాల్సి వచ్చిందని వివరించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన మిగతా మొత్తాన్ని సమకూర్చుకోవడంలో సహాయం కోరాలని తన పాఠశాలకు గానీ, ఇతరులకు గానీ ముందుగా సమాచారం ఇవ్వలేదని తెలిపింది. ఈ రూ. 1.5 లక్షలు ఎవరూ అడిగిన లంచం కాదని, టోర్నమెంట్ ఖర్చుల్లో తాను చెల్లించాల్సిన వాటా మాత్రమేనని, ప్రభుత్వ అధికారులెవరూ తన వద్ద లంచం డిమాండ్ చేయలేదని శైరా స్పష్టం చేసింది.


