రీల్స్‌ యుగంలో షార్ట్‌కట్లు వద్దు!  | PM Narendra Modi urged young Indians to look beyond reels, shortcuts | Sakshi
Sakshi News home page

రీల్స్‌ యుగంలో షార్ట్‌కట్లు వద్దు! 

Aug 13 2026 4:38 AM | Updated on Aug 13 2026 4:38 AM

PM Narendra Modi urged young Indians to look beyond reels, shortcuts

ప్రధాని మోదీ వ్యాఖ్య 

మాజీ రాష్ట్రపతి కోవింద్‌ ఆత్మకథ ఆవిష్కరణ

న్యూఢిల్లీ: యువత తాము ఆదర్శంగా తీసుకునే వ్యక్తుల ఆత్మకథలు చదవాలని, తద్వారా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రభావంతో పక్కదారి పట్టకుండా ఉండవచ్చునని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పరోక్షంగా వ్యాఖ్యానించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ‘‘ట్రైంఫ్‌ ఆఫ్‌ ఇండియన్‌ రిపబ్లిక్‌: మై లైఫ్, మై స్ట్రగుల్స్‌’’పేరుతో రాసిన ఆత్మకథను ప్రధాని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ‘‘ఈ రీల్స్‌ యుగం’లో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మిమ్మల్ని కొన్ని దారుల్లోకి మళ్లించవచ్చు. ఓడించవచ్చు. షార్ట్‌కట్‌ల కాలంలో రైల్వేస్టేషన్లలో ప్రదర్శించే ఓ సందేశాన్ని గుర్తు చేసుకుందాం. ‘ఏ షార్ట్‌కట్‌ విల్‌ కట్‌ యూ షార్ట్‌’(దగ్గరి దారిలో వెళ్లాలనుకుంటే మీరు ఖతమైపోతారన్న అర్థం) అని ఎందుకు రాస్తారంటే కొంతమందికి రైల్వే బ్రిడ్జీలు ఎక్కి అవతలకు వెళ్లడం కాకుండా.. పట్టాలపై దూకి వెళ్లే అలవాటు ఉంటుంది. 

అయితే జీవితంలో ముందుకెళ్లేందుకు ఒక షార్ట్‌కట్‌ ఉందంటే అది మీరు ఆదర్శంగా తీసుకునే వ్యక్తుల ఆత్మకథలు చదవడం’’అని వ్యాఖ్యానించారు. ఆత్మకథలు ఆయా కాలాల పరిస్థితులను వారి జీవితానుభవాల దృష్టిలోంచి ఆవిష్కరిస్తాయి కాబట్టి యువత తాము ఆదర్శంగా భావించే నేతలు, వ్యక్తుల ఆత్మకథలు చదవడం అలవాటు చేసుకోవాలని కోరారు. 

 ప్రతికూల పరిస్థితుల్లోనూ కృత నిశ్చయంతో ఒక వ్యక్తి ఎలా అత్యున్నత రాజ్యాంగ పదవి పొందవచ్చు తెలుసుకునేందుకు రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. పదవీ విరమణ తరువాత కూడా కోవింద్‌ ‘‘వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌’’విషయంపై పనిచేస్తూ తన ప్రజా జీవితాన్ని కొనసాగిస్తూండటాన్ని ప్రధాని కొనియాడారు. ఈ జమిలీ ఎన్నికలు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టే అవకాశముందన్నారు. కోవింద్‌ ఆత్మకథ నుంచి నవతరం నేర్చుకోవాల్సింది చాలా ఉందని ప్రధాని ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత మంది యువకులు కోవింద్‌లా ఎదగాలని ఆకాంక్షించారు. 

పల్లెటూరి వాడిని: కోవింద్‌ 
ఆత్మకథ ఆవిష్కరణ సందర్భంగా రామ్‌నాథ్‌ కోవింద్‌ మాట్లాడుతూ ‘‘కాన్పూర్‌ సమీపంలోని గ్రామీణ ప్రాంతపు పల్లెటూరి వాడిని నేను. గ్రామస్తుల నుంచే సహానుభూతి, ప్రేమలను నేర్చుకున్నా’’అని తెలిపారు. చిన్నప్పుడు వర్షాలొస్తే ఇల్లు మొత్తం కారిపోయేదని, వర్షం ఎప్పుడు ఆగుతుందా అని ఎదురు చూసే వారమని తన కష్టాలను గుర్తు చేసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement