భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ఉపన్యాసం చేస్తూ ప్రతి అంశంపైన ప్రశ్నించాలని యువతకు పిలుపు ఇచ్చారు. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. కొద్దికాలం క్రితం ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష పత్రాల లీక్‌కు సంబంధించి యువత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన నేపథ్యంలో జరిగిన పరిణామాలకు, ఆ తర్వాత మోదీలో వచ్చిన మార్పునకు ఇది దర్పణం పడుతుంది. ప్రధాని వ్యూహాత్మకంగా తన వైఖరి మార్చుకున్నారా? లేక దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రశ్నించేతత్వాన్ని బలపరచడానికి చేశారా? అన్నదానిపై ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు. కాని మోదీ ప్రసంగాలలో ఇది కీలకమైన మార్పుగా చెప్పవచ్చు.
కానీ, దీనికి ఆయన కట్టుబడి ఉండడమే కాదు. తన మిత్రపక్షాలు ప్రభుత్వం నడుపుతున్న రాష్ట్రాలలో కూడా అలాగే వాతావరణం ఏర్పడేలా ఆయన చర్య తీసుకుంటేనే యువతలో విశ్వాసం ఏర్పడుతుంది. ఏపీలో ప్రశ్నించే యువతను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ పెద్దలు గంజాయి బ్యాచ్ అని, బ్లేడ్ బాచ్ అంటూ అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్ది పార్టీని గొడ్డలి పార్టీ అంటూ అనుచిత భాష వాడుతున్నారు. దేశంలో ఇలాంటి పెడ పోకడలను నియంత్రించాల్సిన అవసరాన్ని ప్రధాని గుర్తించాలి. అయితే కాక్రోచ్ ఆందోళన తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ ఎంపీలు పార్లమెంటులో పూలదండలతో స్వాగతం చెప్పిన తీరు కూడా అంత శోభ నివ్వదు. దీనిని మోదీ ఎందుకు అనుమతించారో తెలియదు.
మరోవైపు ఏపీలో డీఎస్సీ అక్రమాలపై విపక్ష వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. ఈ అక్రమాల వల్ల నష్టపోయిన యువత బహిరంగంగా అవి ఎలా సాగాయో వెల్లడిస్తున్నారు. దీనిపై సీఐఐ దర్యాప్తును, మంత్రి లోకేష్ రాజీనామాను వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది. నిజంగా ఇందులో ఏ అవకతవక జరగకపోతే నీట్ పరీక్షల గొడవపై సీబీఐ దర్యాప్తు వేసినట్లు ఏపీలో కూడా చేసి ఉండవచ్చు. అలా చేయకపోగా ప్రశ్నించేవారి గొంతు నులమడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. తప్పుడు కేసులు పెట్టడం, వైఎస్సార్‌సీపీ దీక్ష శిబిరాలపై టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు దాడులు చేయడం వంటివి చేస్తున్నారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిందో అర్దం చేసుకోవచ్చు. ఇంత చేస్తున్నా ఆందోళనలు ఆగడం లేదన్న అసహనంతో పోటీ ర్యాలీలు చేయించడం ఆరంభించారు.
ఢిల్లీలో యువత ఆందోళన చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యూహాలను కొన్నిటిని అమలు చేయకపోలేదు. పోలీసులు పెల్లెట్ గన్‌లను ప్రయోగించడం, లాఠీలను ఝళిపించడం వంటివి చేశారు. దీనివల్ల బీజేపీకి బాగా నష్టం జరిగింది. ఆ డ్యామేజీని గుర్తించిన ప్రధాని ఆందోళనకారులను ఫ్రెండ్స్ అంటూ అడ్రస్ చేశారు. కానీ ఏపీలో మాత్రం గంజాయి బ్యాచ్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ, ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు. పైగా ప్రభుత్వం తలచుకుంటే రెండు నిమిషాలలో అణచివేస్తుందని కూడా బెదిరిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సంబంధించి వచ్చిన ఆరోపణల మీద ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనకారులతో చర్చలకు సిద్దపడింది. ఏపీలో మాత్రం అలా చేయడం లేదు.
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకాలను ప్రభుత్వం సాగిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. పంజాబ్‌లో ఇలాంటి ఆరోపణలు వస్తే అక్కడ బీజేపీకి చెందినవారు కూడా ఆందోళనలు చేస్తున్నారు. జార్ఖండ్‌లో ఉద్యమానికి అక్కడ అధికారంలో ఉన్న భాగస్వామి అయిన కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తోంది. స్వయంగా రాహుల్ గాంధీ ఈ మేరకు ప్రకటన చేశారు. కానీ ఏపీలో విచిత్రంగా కాంగ్రెస్, బీజేపీలు నోరు విప్పడం లేదు. జనసేన ఎటూ 15 ఏళ్ల పాటు చంద్రబాబుకు మద్దతు ఇస్తామని ఓపెన్ గానే చెబుతోంది. అంటే అంతకాలం చంద్రబాబు సర్కార్ ఏం చేసినా నోరు విప్పదనుకోవాలి. ఆ రకంగా ఈ పార్టీలన్నిటిని చంద్రబాబు తన కంట్రోల్‌లో పెట్టుకున్నారన్న భావన ఉంది. అయితే, ప్రధాని మోదీ తన ప్రసంగంలో యువత ప్రశ్నించడాన్ని స్వాగతిస్తున్నామని అంటున్నారు. ప్రతి అంశంపైనా ప్రశ్నించాలని, అందరూ ఆమోదించారని అక్కడితో ఆగిపోవద్దు అని ఆయన చెబుతున్నారు. ఇందులో ఎంత చిత్తశుద్ది ఉందన్నది భవిష్యత్ పరిణామాలను బట్టి ఆధారపడి ఉంటుంది.
ఇదే సందర్భంలో అమెరికాలో ప్రజాస్వామ్యం బలోపేతం అయిన తీరుపై ప్రముఖ చరిత్రకారుడు మైకేల్ బిష్లోన్ చేసిన ఒక ప్రసంగం ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షించింది. సాక్షి దినపత్రిక ఈ వ్యాసంలోని ముఖ్యాంశాలను ప్రచురించింది. ఆ ఉపన్యాసంలో ఆయా పూర్వ అధ్యక్షులు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి చేసిన కృషిని, వారి ఉత్తేజపూరిత వ్యాఖ్యలను కూడా ఆయన ఉదహరించారు. ఇది భారత ప్రజాస్వామ్యం బలపడటానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. అమెరికాలో గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందిన బెంజిమిన్ ఫ్రాంక్లిన్ ప్రతి పౌరుడి తొలి బాధ్యత అధికారాన్ని ప్రశ్నించడమే అని వ్యాఖ్యానించారు. మాజీ అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ చెప్పిన మాట ఏమిటంటే, అమెరికాలో గొప్పహోదా మిస్టర్ ప్రెసిడెంట్ కాదు.. మిస్టర్ సిటిజన్.. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రజలు అధ్యక్షుడి కోసం పనిచేయరు. అధ్యక్షుడే ప్రజల కోసం పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.
దేశాన్ని పొగిడేవారికే కాదు.. దేశంలోని లోపాలను నిర్మాణాత్మకంగా సమర్ధించేవారికి సమాన గౌరవం ఉండాలని కూడా అమెరికా గొప్ప నేతలు నమ్మారని మైఖేల్ వివరించారు. ఇంకో ప్రముఖుడు ధామస్ జపర్సన్ మరో మాట చెప్పారు. మిత వ్యయంతో, సమర్ధవంతంగా పనిచేసే రాజకీయ వ్యవస్థ ఏర్పడితే ఆ ప్రజాస్వామ్య స్పూర్తి ప్రపంచమంతా వ్యాపిస్తుందని అన్నారు. ఇదే వ్యాసంలో మైఖేల్ ఒక విషయం చెప్పారు. చరిత్రకారులు తమకు అనుకూలంగానే మాట్లాడాలని 2026లో వాషింగ్టన్ డీసీలోని కొందరు రాజకీయ నేతలు ఆశిస్తున్నారని, సర్కస్ లోని విదూషకుల మాదిరి ప్రవర్తించాలని కోరుకుంటున్నారని, అమెరికా వ్యవస్థాపకులు ఇలాంటి ఆలోచనను చూసి బాధపడేవారిని ఆయన వ్యాఖ్యానించారు. అంటే అమెరికాలో కూడా గత విలువలు కొరవడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారన్న మాట.
మైఖేల్ చెప్పిన మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది? అమెరికా కన్నా పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ లో ఈ మధ్య కాలంలో జరుగుతున్న విపరిణామాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులు పెరుగుతున్నాయనే అనిపిస్తుంది కదా! దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రత్యేకించి ఏపీ వంటి రాష్ట్రాలలో రెడ్ బుక్ అంటూ అరాచకపు వ్యవస్థను సృష్టించడం ప్రజలను కలవరపరుస్తుంది. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ వంటి రాజ్యాంగ రూపకర్తలు, దేశ నిర్మాతలు భారత్ లో ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించి ఉండరు. ప్రజాస్వామ్యంతో నిమిత్తం లేకుండా నియంతృత్వంగా అల్ప బుద్దితో వ్యవహరిస్తున్న నేతల తీరును గమనిస్తే వారి ఆత్మలు క్షోభిస్తాయి.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


