మనలోనూ ‘హైబ్రిడ్‌ ఇంజిన్‌’! | Cells that rely on two fuels for energy glucose and fat | Sakshi
Sakshi News home page

మనలోనూ ‘హైబ్రిడ్‌ ఇంజిన్‌’!

Aug 13 2026 2:07 AM | Updated on Aug 13 2026 2:07 AM

Cells that rely on two fuels for energy glucose and fat

శరీరంలోని కణాలు నడిచేదిఈ అద్భుత వ్యవస్థతోనే..  

శక్తి కోసం గ్లూకోజ్, కొవ్వు అనేరెండు ఇంధనాలపై ఆధారపడుతున్న కణాలు 

కొవ్వు కరగకపోవడంతో 80 రకాల జీవనశైలి వ్యాధులు.. ఇంజిన్‌ స్విచ్‌ను రీసెట్‌ చేస్తే అన్నిటికీ చెక్‌ చెప్పొచ్చంటున్న వైద్య నిపుణులు  

ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించి ప్రొటీన్లు, మంచి కొవ్వులు తీసుకోవాలని సూచన

(సాక్షి, స్పెషల్‌ డెస్క్‌) :  మనం నడిపే కార్లు అధునికతను సంతరించుకుంటున్నాయి. పెట్రోల్‌ ఇంజిన్, ఎలక్ట్రిక్‌ మోటార్‌తో కూడిన హైబ్రిడ్‌ ఇంధన వ్యవస్థతో కూడిన వాహనాలు పరుగులు తీస్తున్నాయి. రోడ్డు పరిస్థితులు, ప్రయాణ వేగాన్ని బట్టి కారు దానంతట అదే ఏ ఇంధనాన్ని వాడాలో ఎంచుకుంటుంది. అయితే మన శరీరంలోని కణాలు కూడా ఇలాంటి అద్భుతమైన ‘హైబ్రిడ్‌ ఇంజిన్‌’వ్యవస్థతో నడుస్తున్నాయని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కానీ ఈ హైబ్రిడ్‌ ఇంజిన్‌ను సవ్యంగా వాడుకోలేక పోతున్నామని, ఈ కారణంగానే 80 రకాల జీవక్రియ సంబంధిత జబ్బుల పాలవుతున్నామని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆసక్తికరమైన ఈ సంగతులేమిటో ఒకసారి చూద్దాం..  

హైబ్రిడ్‌ ఇంధనాలు గ్లూకోజ్, కొవ్వు 
మానవ దేహంలో కణాలు కూడా శక్తి కోసం ‘గ్లూకోజ్‌’(చక్కెర), ‘కొవ్వు’(ఫ్యాట్‌) అనే రెండు రకాల ఇంధనాలపై ఆధారపడతాయి. అయితే కణాలు ఈ రెండింటినీ ఒకేసారి ఉపయోగించలేవు. సందర్భాన్ని బట్టి ఇంధనం మారుతుంది. ఈ వ్యవస్థను ‘ర్యాండల్‌ సైకిల్‌’(గ్లూకోజ్‌–ఫ్యాటీ ఆసిడ్‌ సైకిల్‌) లేదా ‘మెటబాలిక్‌ స్విచ్‌’అంటారు. ఈ స్విచ్‌ను నియంత్రించే మాస్టర్‌ హార్మోన్‌ ‘ఇన్సులిన్‌’. మనం ఆహారం తీసుకున్నప్పుడు రక్తంలో ఇన్సులిన్‌ హార్మోన్‌ పెరిగి, కణాలు గ్లూకోజ్‌ను మాత్రమే శక్తిగా మార్చుకునేలా చేస్తుంది. ఆ సమయంలో కొవ్వు వినియోగం ఆగిపోతుంది. 

కణంలోని మైటోకాండ్రియా తలుపు తీసి గ్లూకోజ్‌ను దాని లోపలికి పంపేది ఇన్సులిన్‌ హార్మోనే. అయితే అపరిమిత పిండి పదార్థాలతో కూడిన ఆహారం నిరంతరం తీసుకోవడం వల్ల ఇన్సులిన్‌ నాణ్యతను కోల్పో యి మైటోకాండ్రియా తలుపు తెరుచుకోవడమనే వ్యవస్థ సమర్థవంతంగా పని చేయలేదు. ఈ స్థితే ‘ఇన్సులిన్‌ రెసిస్టె¯న్స్‌’(ఇన్సులిన్‌ నిరోధకత)కు దారితీస్తుంది. అయితే మనం ఉపవాసం ఉన్నప్పుడు లేదా పిండి పదార్థాల ఆహారానికి ఎక్కువ గంటల పాటు విరామం ఇచ్చినప్పుడు కొవ్వు నిల్వల వాడకం మొదలవుతుంది.  

సమస్య ఎక్కడ వస్తోంది?
ఆధునిక జీవనశైలిలో భాగంగా ప్రాసెస్‌ చేసిన ఆహారాలు, రిఫైన్డ్‌ కార్బోహైడ్రేట్లు, పదేపదే స్నాక్స్, తీపి పానీయాలు తీసుకోవటం వల్ల రక్తంలో ఇన్సులిన్‌ స్థాయిలు ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉంటున్నాయి. దీనివల్ల కొవ్వును కరిగించే ద్వారం నిరంతరం మూసే ఉంటుంది. ఇన్సులిన్‌ శరీరంలో భారీగా కొవ్వు పేరుకుపోతుంది. కణాలు కేవలం గ్లూకోజ్‌ పైనే ఆధారపడటం వల్ల ఇంజిన్‌ వ్యవస్థ దెబ్బతింటుంది. 

శరీరంలో అతిగా పేరుకుపోయిన కొవ్వు ఊరికే ఉండదు. విషపూరిత రసాయనాలుగా మారి ఇన్‌ఫ్లమేషన్‌ (వాపు)ను కలిగిస్తుంది. ఇన్సులిన్‌ నిరోధకతే కాలక్రమేణా ఊబకాయం, టైప్‌–2 మధుమేహం, ఫ్యాటీ లివర్, గుండెజబ్బులు, క్యాన్సర్‌ వంటి 80 రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని కార్డియాక్, మెటబాలిక్‌ హెల్త్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ పీ వీ సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు.

పరిష్కారం ఏమిటి?
శరీరంలోని ఈ హైబ్రిడ్‌ ఇంజిన్‌ను రీసెట్‌ చేయాలంటే ఏం చెయ్యాలి? ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించి ప్రొటీన్లు, మంచి కొవ్వులు తీసుకోవాలి. రెండు భోజనాల మధ్య 6 గంటల విరామం ఇవ్వటం వల్ల ఇన్సులిన్‌ తగ్గి, కొవ్వు కరుగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల ఇన్సులిన్‌ తో సంబంధం లేకుండా కండరాలు గ్లూకోజ్, కొవ్వు లను అవసరం మేరకు నేరుగా వాడుకుంటాయి. సరైన జీవనశైలితో ఈ స్విచ్‌ను అదుపులో ఉంచుకోవచ్చన్న మాట. అంటే.. హైబ్రిడ్‌ ఇంజిన్‌ను సక్రమంగా వాడుకోగలిగితే వ్యాధుల బారిన పడకుండా జీవించవచ్చు లేదా మందులు వాడకుండానే ఆరోగ్యం సాధించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement