కేరళం బిల్లుకు రాజ్యసభ ఆమోదం | Rajya Sabha approves Kerala bill | Sakshi
Sakshi News home page

కేరళం బిల్లుకు రాజ్యసభ ఆమోదం

Aug 12 2026 7:15 PM | Updated on Aug 12 2026 7:32 PM

 Rajya Sabha approves Kerala bill

సాక్షి, ఢిల్లీ: కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చే బిల్లుకు పార్లమెంట్‌ ఉభయ సభల ఆమోదం లభించింది. బుధవారం రాజ్యసభలో ఈ బిల్లును వాయిస్‌ ఓటుతో ఆమోదించారు. అంతకుముందు మంగళవారం లోక్‌సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో కేరళ పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చే ప్రక్రియ తుదిదశకు చేరుకుంది.

రాష్ట్రం పేరును మార్చాలని కోరుతూ కేరళ అసెంబ్లీ 2024లో తీర్మానం చేసింది. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేరళ ప్రభుత్వం 2024 జూన్‌లో కేంద్రానికి పంపించింది. రాష్ట్ర ప్రజల భాషా, సాంస్కృతిక గుర్తింపుకు అనుగుణంగా ‘కేరళం’ పేరును అధికారికంగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

అనంతరం రాష్ట్రపతి ఈ పేరు మార్పు బిల్లును కేరళ శాసనసభకు పంపించి, దానిపై రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తెలియజేయాలని కోరారు. దీనిపై కేరళ అసెంబ్లీ మరోసారి చర్చించి, బిల్లుకు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. రాష్ట్ర శాసనసభ నుంచి వచ్చిన ఈ అంగీకారంతో కేంద్రం పేరుమార్పు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లింది.

కేరళ (పేరు మార్పు) బిల్లు ప్రకారం రాష్ట్రం పేరును ‘కేరళ’ నుంచి ‘కేరళం’గా మార్చేందుకు రాజ్యాంగంలో అవసరమైన సవరణలు చేయనున్నారు. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో, ఆర్టికల్‌ 3 ప్రకారం ‘కేరళ’ పేరును ‘కేరళం’గా మార్చేలా సవరణలు ఉంటాయి. రాష్ట్రం పేరు మార్పుతో సంబంధం ఉన్న ఇతర రాజ్యాంగ నిబంధనల్లోనూ అవసరమైన మార్పులు, తదనుగుణమైన నిబంధనలను బిల్లు కలిగి ఉంది. పార్లమెంట్‌ ఉభయ సభల ఆమోదం లభించింది ఇక రాష్ట్రపతి ఆమోదం లభిస్తే  ఇక రాష్ట్రం  పేరు అధికారికంగా  ‘కేరళం’గా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement