సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిర్మౌర్ జిల్లాలోని గాట్లాగ్ సమీపంలో గుండె పోటుతో మృతి చెందిన గ్రామస్థుడి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్తున్న వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటన నిన్న (మంగళవారం) రాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు.
సిర్మౌర్ జిల్లాలోని సంగ్రాహ్ ఆసుపత్రిలో ఆర్లూ గ్రామానికి చెందిన జగదీశ్ శర్మ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతదేహాన్ని తీసుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో గాట్లాగ్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో ఆర్లూ గ్రామానికి చెందిన రాజేంద్ర (37), దేశ్ రాజ్ (23), చినాడ్ గ్రామానికి చెందిన రిఖీ రామ్ (58), రామ్ గోపాల్ (62) మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన తొమ్మిది మందిని చికిత్స కోసం నహాన్‌లోని మెడికల్ కాలేజీకి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని తీసుకెళ్తున్న సమయంలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది.


