యాక్సిడెంట్ చేసిన తనయుడిని కాపాడుకున్న టీడీపీ పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
కొరసవాడ వద్ద ఆటోను ఢీకొట్టిన కారు
ఒకరు మృతి, నలుగురికి గాయాలు
బాధితులతో బేరసారాలు జరిపిన ఎమ్మెల్యే.. రూ. ఐదు లక్షల నగదు, ఒకరికి ఉద్యోగం,బీమా సొమ్ము
నేటికీ లబ్ధి అందక బాధితులు లబోదిబో.. తాజాగా వెలుగు చూసిన ఒప్పంద పత్రాలు, వీడియోలు
ఎప్పుడు: 2024 డిసెంబర్ 21
ఎక్కడ: శ్రీకాకుళం జిల్లా కొరసవాడ వద్ద..
ఏం జరిగింది: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు సాయి గణేష్ డ్రైవ్ చేస్తున్న కారు ఓ ఆటోను ఢీకొట్టింది.
పరిస్థితి ఏంటి: ఆటోలోని ఐదుగురికి గాయాలయ్యాయి.. అందులో ఒకరు మృతి చెందారు.
పోలీసులు ఏం చేశారు: తెలివితేటలు చూపారు..కారు డ్రైవ్ చేస్తున్న గణేష్ స్థానంలో వేరే వ్యక్తిని ఇరికించి కేసు క్లోజ్ చేశారు.
ఎమ్మెల్యే మాటేమిటి: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పుత్ర ప్రేమతో బాధితులకు ఆశల గాలం వేశారు..
ఇదంతా ఇప్పుడెందుకు: ఈ ఘటన అనంతరం జరిగిన ఎమ్మెల్యే రాయ ‘బేరాలు’, టీడీపీ ప్రభుత్వ ఏకపక్ష వైఖరి తెలియాలంటే చదవండిక....
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు సాయి గణేష్ కారు ఆటోను ఢీకొట్టడంతో, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో భామిని మండలం లివిరి గ్రామానికి చెందిన చెప్పల బోగయ్య అనే వ్యక్తి పరిస్థితి విషమంగా మారి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదే ఘటనలో ఈయన కోడలు చెప్పల సంతోష్, సవలాపురం నరేష్, గణేష్, ఆటో డ్రైవర్ కూర్మాన సునీల్‌కు గాయాలయ్యాయి.
ఎమ్మెల్యే కుమారుడే ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. కానీ పల్లి రాజేష్ అనే వ్యక్తి డ్రైవ్ చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేసి, తేల్చేశారు. ఇప్పుడు తాజాగా ఈ ఘటనలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు కారు ప్రమాదం అనంతరం బాధిత కుటుంబీకులతో జరిపిన చర్చల వీడియోలు, చేసుకున్న ఒప్పంద పత్రాలు బయట పడ్డాయి. వీటిపై టీడీపీ నాయకులు, పోలీసులు ఎలా స్పందిస్తారోనని చర్చ నడుస్తోంది.
బాధితులతో ఎమ్మెల్యే మామిడి ప్రత్యేక భేటీ
ప్రమాదం జరిగిన తర్వాత మృతుడి కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రత్యేకంగా కూర్చుని పరిహారం చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ‘యాక్సిడెంట్ జరిగింది వాస్తవం. ఎవరు డ్రైవింగ్ చేశారో తెలుసు, దాని కోసం మాట్లాడుకోవడం అనవసరం, ఇప్పుడేం చేయాలన్న దానిపై మాట్లాడుకుందాం. బీమా గురించీ మాట్లాడుకుందాం. దీన్ని ఎలాగోలా క్లోజ్ చేయండి.’ అని మాట్లాడిన వీడియోలు వెలుగు చూశాయి. ఇంకా మామిడి గోవిందరావు పీఏలు బాధిత కుటుంబీకులతో ఒప్పంద పత్రం కూడా రాయించుకున్నారు. అది కూడా బయటపడింది. దీన్నిబట్టి కేసును అప్పట్లో ఎంత మేనేజ్ చేశారో అర్థం చేసుకోవచ్చు.
కేసును పూర్తిగా పక్కదారి పట్టించిన పోలీసులు...
పాతపట్నం పోలీసులు ఈ కేసును పూర్తిగా పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. పల్లి రాజేశ్ అనే వ్యక్తి డ్రైవ్ చేశాడని నిర్ధారించి, కేసు క్లోజ్ చేశారు. ఎమ్మెల్యే కుమారుడిని తెలివిగా తప్పించారనేది తేటతెల్లమవుతోంది. ఘటన అనంతరం మృతుడు భోగయ్య కుటుంబ సభ్యులతో సంప్రదింపులు చేయడం, రాజీ చేసుకోవడం, ఒప్పందం కుదుర్చుకోవడం, అంగీకార పత్రాలు రాయించుకోవడం అన్నీ జరిగాయి. రూ.5లక్షలు నగదుతో పాటు బీమా కింద వచ్చే సొమ్మును, గాయపడిన వారికి ప్రత్యేక సాయంగా అందజేస్తామని, ఇంట్లో ఒకరికి ఉద్యోగం అంటూ ఒప్పందం చేసుకున్నారు. వీటికి సంబంధించి బాధిత కుటుంబీకుల వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏడాది గడిచినా బా«ధితులకు న్యాయం జరగలేదు. ఒప్పందం మేరకు చెల్లింపులు చేయలేదు. అడిగితే బెదిరింపులు.. హైకోర్టు అడ్వకేట్‌లు తెలుసంటూ భయపెట్టేలా వ్యాఖ్యలు.
అధికార పక్షమైతే ఒక రూల్.. ప్రతిపక్షమైతే మరో రూలా ...
అధికార పక్ష నాయకులు యాక్సిడెంట్ చేస్తే ఒకలా, ప్రతిపక్షమైతే మరోలా వ్యవహరిస్తున్నారన్నది ఈ ఘటనతో తేటతెల్లమైంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్ జరిగితే హత్య కేసు నమోదు చేసి, ఆ పిల్లాడితో పాటు తండ్రిని కూడా జైలుకు పంపించారు. మరి, ఇప్పుడు పాతపట్నం ఎమ్మెల్యే బాధిత కుటుంబీకులతో జరిపిన చర్చల వీడియోలు, ఆయన అనుయాయులు చేసుకున్న ఒప్పంద పత్రాలకు ఏం సమాధానం చెబుతారో చూడాలి. వీరిపై కూడా హత్య కేసు నమోదు చేస్తారా? ఆ దిశగా లోతుగా దర్యాప్తు జరుపుతారా? లేదంటే అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడని చూసీ చూడనట్టు వదిలేస్తారా? అనేవి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ముందున్న ప్రశ్నలు.

మృతుడి కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే అనుయాయులు చేసుకున్న ఒప్పంద పత్రం (ఫైల్)
ఎమ్మెల్యే ఇస్తానన్న సాయం అందలేదు
మేము పాతపట్నంకు పరామర్శ కోసం ఐదుగురు వెళ్లాం. మా మావయ్య, మా అన్నయ్య పిల్లలు ఇద్దరు, నేను, ఆటో డ్రైవర్ ఐదుగురం బయలుదేరాం. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కొడుకు సాయి గణేష్ యాక్సిడెంట్ చేశారు. నాకు ఆ సమయంలో స్పృహ లేదు. తర్వాత ఆస్పత్రికి వెళ్లాం. నా తలకు దెబ్బలు తగిలాయి. మా మామయ్యకు ఎక్కువగా దెబ్బలు తగిలాయి. మామయ్య ఆస్పత్రిలో మూడు రోజులు కోమాలో ఉండి డిసెంబర్ 24న చనిపోయారు. నాకు రెండు ఆపరేషన్లు అయ్యాయి. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఎమ్మెల్యే ఇస్తానన్న సాయం ఇంతవరకు అందలేదు. ఉద్యోగం, పింఛను ఏమీ ఇవ్వలేదు. రెండు మూడుసార్లు కలిసినా ఇంతవరకు స్పందించలేదు. – చెప్పల సంతోష్, ప్రమాద బాధితురాలు


