జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
జంట హత్య కేసులో తండ్రి, కొడుకుల మరణశిక్ష జీవితఖైదుగా మారుస్తూ తీర్పు
తల్లిని నిర్దోషిగా ప్రకటిస్తూ తక్షణ విడుదలకు ఆదేశం
సాక్షి, అమరావతి: మరణ శిక్ష విధించే ముందు న్యాయస్థానాలు నేర తీవ్రతను మాత్రమేగాక, నిందితుని స్థితిగతులను సైతం పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. నేరం జరిగిన తీరు, క్రూరత్వం, బాధితుల పరిస్థితి, అలాగే నిందితుడి వయసు, సామాజిక–ఆర్థిక నేపథ్యం, నేర చరిత్ర లేకపోవడం, మానసిక స్థితి మధ్య న్యాయస్థానాలు సమతుల్యతను పాటించాల్సి ఉంటుందని తెలిపింది. అంతేగాక నిందితుడు మారడానికి, జనజీవన స్రవంతిలో కలిసి పునరావాసం పొందడానికి ఉన్న అవకాశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలంది.
‘క్రిమినల్ జస్టిస్ సిస్టం (నేర న్యాయ వ్యవస్థ) అనుకున్న దానికంటే ఎక్కువ శిక్షాత్మకంగా మారింది. ఇదే సమయంలో ఈ వ్యవస్థ మార్పు, పునరావాసానికి కూడా అవకాశం కల్పిస్తోంది. నేరస్థుడిని శిక్షించడం, సంస్కరించడం, జనజీవనస్రవంతిలో కలిసేలా చేయడం అనేవి భారతీయ క్రిమినల్ జస్టిస్ సిస్టం ముఖ్య లక్ష్యాలు. శిక్షించడం కంటే పునరావాసం కల్పించడానికే క్రిమినల్ జస్టిస్ సిస్టం ప్రాధాన్యతనిస్తుంది. ఈ నేపథ్యంలో నేరస్థుడిని సంస్కరించడమే దీని అంతిమ లక్ష్యం’ అని హైకోర్టు పేర్కొంది.
జీవితఖైదు విధించే ప్రత్యామ్నాయం ఉన్న కేసులను సైతం అరుదైన కేసుల్లో అత్యంత అరుదైన కేసులుగా పరిగణించి ఉరిశిక్ష విధించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ప్రస్తుత భార్య, అత్తమామలను చంపినందుకు నారాపురం శ్రవణ్‌కుమార్, తండ్రి వరప్రసాద్‌లకు ఉరిశిక్ష విధిస్తూ కర్నూలు జిల్లా సెషన్స్ కోర్టు 2024లో ఇచ్చిన తీర్పును హైకోర్టు సవరించింది. ఉరిశిక్షను రద్దుచేసిన హైకోర్టు తండ్రి, కొడుకులకు జీవితఖైదు విధించింది. వీరికి ఎలాంటి క్షమాభిక్షకు ఆస్కారం లేదని స్పష్టం చేసింది.
తండ్రీకొడుకులకు నేరచరిత్ర లేదని, పరివర్తన చెందేందుకు ఆస్కారం ఉందని, అంతేగాక వీరు సమాజానికి ముప్పుగా పరిణవిుస్తారనేందుకు ఆధారాలు లేనందున వారికి విధించిన మరణశిక్షణు జీవితఖైదుగా మారుస్తున్నట్లు హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. శ్రవణ్‌కుమార్ తల్లి కృష్ణవేణిని నిర్దోషిగా ప్రకటించింది. ఆమెకు కింది కోర్టు విధించిన జీవితఖైదును రద్దుచేసింది. ఆమెను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి, జస్టిస్ అవధానం హరిహరనాథశర్మ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
ఇద్దరిని చంపిన తండ్రీకొడుకులు
కర్నూలులోని చింతలముని నగర్‌కు చెందిన నారాపురం శ్రవణ్‌కుమార్ (26), రుక్మిణి (18)లకు 2023 మార్చి 1న పెళ్లైంది. అనంతరం శ్రవణ్‌కుమార్ నపుంసకుడంటూ రుక్మిణి తల్లిదండ్రులు ఆరోపించడంతో ఈ దంపతుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. 2023 మార్చి 14న శ్రవణ్‌కుమార్ వనపర్తి వెళ్లి తన భార్య రుక్మిణి, అత్త రమాదేవి, మామ వెంకటేశ్వర్లును కర్నూలులోని తన ఇంటికి రాత్రి 11.30 గంటల సమయంలో తీసుకొచ్చాడు. తరువాత కొద్దిసేపటికే శ్రవణ్‌కుమార్, అతడి తండ్రి వరప్రసాద్ (62).. కత్తులతో రుక్మిణి మీద, ఆమె తల్లిదండ్రులు రమాదేవి, వెంకటేశ్వర్లుపై దాడిచేశారు.
తీవ్ర గాయాలతో రుక్మిణి, రమాదేవి మృతి చెందగా.. వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై ఐపీసీ సెక్షన్లు 302, 307తో పాటు 34 కింద కేసు నమోదు చేసిన కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు 2023 మార్చి 15న నిందితులను అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా సెషన్స్ కోర్టు ఈ కేసుపై విచారణ జరిపి 2024లో తీర్పు వెలువరించింది. దీన్ని అరుదైన కేసుల్లో అత్యంత అరుదైన కేసుగా పరిగణిస్తూ.. నిందితులు శ్రవణ్‌కుమార్, వరప్రసాద్‌లకు మరణశిక్ష, శ్రవణ్‌కుమార్ తల్లి కృష్ణవేణికి జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.
ఈ మరణశిక్ష ఖరారుపై నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థిస్తూ సెషన్స్ కోర్టు 2024లో హైకోర్టుకు లేఖ రాసింది. కేసు రికార్డులను హైకోర్టుకు పంపింది. దీంతో హైకోర్టు ఆ లేఖను రెఫర్డ్ ట్రయల్ (ఆర్‌టీ)గా పరిగణించి విచారణ చేపట్టింది. ఇదే సమయంలో శ్రవణ్‌కుమార్, వరప్రసాద్ తమకు విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. కృష్ణవేణి కూడా అప్పీల్ వేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. వరప్రసాద్, శ్రవణ్‌కుమార్‌లకు కింది కోర్టు విధించిన మరణశిక్షను జీవితఖైదుగా సవరిస్తూ తీర్పునిచ్చింది. కృష్ణవేణిని నిర్దోషిగా ప్రకటించింది.


