భారతి సిమెంట్స్‌ను అడ్డుకోవద్దు
హైకోర్టు ఆదేశం
భారతి సిమెంట్స్ వ్యాపార కార్యకలాపాలను అడ్డుకోకూడదు
శాంతిభద్రతలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం పోలీసుల చట్టబద్ధ బాధ్యత
తీర్పులో స్పష్టం చేసిన న్యాయస్థానం
భారతి సిమెంట్స్ ప్రాంగణానికి తగిన పోలీసు రక్షణ కల్పించాలి
పోలీసులు కంపెనీ ప్రాంగణంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య లేకుండా చూడాలి
కంపెనీ వ్యాపార కార్యకలాపాలకు బలవంతంగా అడ్డంకులు సృష్టించడాన్ని తప్పనిసరిగా అరికట్టాల్సిందే
భారతి సిమెంట్స్ 2007 నుంచి అన్ని అనుమతులూ పొంది వ్యాపారాన్ని నిర్వహిస్తోంది
కరువు ప్రాంతంలో ఉన్న ఈ సంస్థ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది
పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు రూ.7,300 కోట్లు చెల్లించింది.
దేశం మొత్తం అభివృద్ధికి పారిశ్రామిక శాంతి అత్యంత అవసరం
పారిశ్రామిక శాంతి, సాధారణ పరిస్థితుల విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రయోగించవచ్చు.. ఆ అధికారం ఈ కోర్టుకు ఉందని స్పష్టీకరణ
‘భారతి సిమెంట్స్ కంపెనీ 2007 నుంచి సంబంధిత చట్టబద్ధ సంస్థల నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొంది వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కరువు ప్రభావిత ప్రాంతంలో ఉన్న ఈ కంపెనీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు సుమారు రూ. 7,300 కోట్లు చెల్లించింది. కంపెనీ వ్యాపార కార్యకలాపాలకు బలవంతంగా అడ్డంకులు సృష్టించడం, రాకపోకలను నిరోధించడం తప్పనిసరిగా అరికట్టాలి. భారతి సిమెంట్స్ ప్రాంగణం సమీపంలో ఎటువంటి శాంతిభద్రతల సమస్య ఏర్పడకుండా పోలీసులు చూడాలి’.
– హైకోర్టు
సాక్షి,అమరావతి: కాంట్రాక్ట్ ఉద్యోగుల ముసుగులో కొంతమంది అరాచక, విచ్ఛిన్నకర శక్తులను అడ్డంపెట్టుకుని స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ కుతంత్రాలతో భారతి సిమెంట్స్‌ను దెబ్బ కొట్టాలని చూసిన చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి భారతి సిమెంట్స్‌ను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసేందుకు అడుగడుగునా సహకరించిన పోలీసులకు సైతం హైకోర్టు తలంటింది. వైఎస్సార్ కడప జిల్లా, ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల పరిధిలోని నల్లలింగాయపల్లె గ్రామంలో ఉన్న ‘భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్’కు తగిన రక్షణ కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కంపెనీ ఉద్యోగులు, ముడిసరుకుతో పాటు ఇతర సరుకులు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని పోలీసులకు తేల్చి చెప్పింది. అంతేకాక కంపెనీ చట్టబద్ధమైన కార్యకలాపాలన్నీ సజావుగా సాగేలా చూడాలని కూడా స్పష్టం చేసింది. భారతి సిమెంట్స్ పరిశ్రమ ఆవరణ సమీపంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా, తమ చట్టబద్ధమైన అధికారాలను ఉపయోగించి సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్మికులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌లో కౌంటర్ దాఖలు చేయాలని భారతి సిమెంట్స్‌ను ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన, చట్టబద్ధమైన డిమాండ్లను పరిష్కరించడానికి పిటిషనర్ కంపెనీ సాధ్యమైనంత వరకు తన విచక్షణను ఉపయోగించవచ్చునని తెలిపారు.
పోలీసుల ఉదాసీనతపై హైకోర్టులో భారతి సిమెంట్స్ పిటిషన్...
వైఎస్సార్ కడప జిల్లా నల్లలింగాయపల్లె వద్ద ఉన్న తమ ప్లాŠంట్ కార్యకలాపాలతో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న మూకలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) అధీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ మహేశ్వరరావు విచారణ జరిపి మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించారు.
భారతి సిమెంట్స్ కరువు పీడిత ప్రాంతంలో ఉపాధి కల్పిస్తోంది...
‘భారతి సిమెంట్స్ ప్రాథమికంగా 2007 నుండి చట్టబద్ధ, సంబంధిత అధికారుల నుండి అవసరమైన అన్ని ముందస్తు అనుమతులను పొంది తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యంగా, ఇది కరువు పీడిత ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. అంతేకాదు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో దాదాపు రూ. 7,300,00,00,000 చెల్లిస్తూ రాష్ట్ర, కేంద్ర ఖజానాలకు తోడ్పడుతోంది.’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
దేశ సమగ్ర అభివృద్ధికి పారిశ్రామిక శాంతి చాలా అవసరం...
‘పారిశ్రామిక శాంతి అనేది దేశ సమగ్ర అభివృద్ధికి, భారతి సిమెంట్స్‌కి, అలాగే దాని వాటాదారులు (శాశ్వత, తాత్కాలిక, కాంట్రాక్ట్ ఉద్యోగులు, వారి కుటుంబాలు) అందరికీ చాలా అవసరం. ఎటువంటి చట్టపరమైన కారణం లేకుండా భారతి సిమెంట్స్ వ్యాపార కార్యకలాపాలను అకస్మాత్తుగా, బలవంతంగా అడ్డుకోవడం, ఆటంకాలు సృష్టించడం సరికాదు. ఇలాంటి చర్యలను ఆదిలోనే అరికట్టాలి. ఎందుకంటే ఇది యజమాని, ఉద్యోగులు, వారి కుటుంబాలు, రాష్ట్ర ఖజానాపై వినాశకరమైన దుష్ప్రభావాలకు దారితీస్తుంది. చట్ట ప్రకారం తమ అధికార పరిధిలో శాంతి భద్రతలను కాపాడవలసిన చట్టబద్ధమైన బాధ్యత పోలీసులపై ఉంది. ఇందులో ఎలాంటి సందేహానికి ఆస్కారం లేదు.’ అని జస్టిస్ మహేశ్వరరావు తెలిపారు.
అన్ని అనుమతులతో భారతి సిమెంట్స్ నడుస్తోంది...
‘భారతి సిమెంట్స్ మైనింగ్ శాఖతో సహా అన్ని శాఖల ముందస్తు అనుమతులతో నడుస్తున్న కంపెనీ. ఇందులో ఎలాంటి వివాదానికి తావు లేదు. కంపెనీ రాకపోకలకు, ఉత్పత్తికి, ఇతర చట్టబద్ధమైన కార్యకలాపాలకు ఎటువంటి చట్టపరమైన ఆటంకాలు లేవనేది కూడా స్పష్టం. కాంట్రాక్ట్ ఉద్యోగులు, వారి అనుచరులు కంపెనీ కార్యకలాపాలను, వాహనాలు, ఉద్యోగులు, అధికారులు, మెటీరియల్స్ రాకపోకలను అడ్డుకోకుండా భారతీ సిమెంట్స్‌కు అనుకూలంగా కింది కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.’ అని ఆయన తెలిపారు.
చట్టపరమైన చర్యలు తీసుకోవడం పోలీసుల ప్రాథమిక బాధ్యత...
‘నేరాలను అరికట్టడం, శాంతిభద్రతల విఘాతానికి దారితీసే పరిస్థితులను అదుపు చేయడం, ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడటం, హింస, బెదిరింపులు, భయభ్రాంతులకు గురిచేసే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం పోలీసుల ప్రాథమిక బాధ్యత. ప్రజా శాంతికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు పోలీసులు అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి చట్టవిరుద్ధమైన పనులను నిరోధించడం, ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, ప్రజలు తమ చట్టబద్ధమైన కార్యకలాపాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకునేలా చూడడమే పోలీసుల ప్రధాన విధి.’ అని తేల్చి చెప్పారు.
ప్రజా సంక్షేమమే సర్వోత్కృష్ట చట్టం..
‘ప్రజా సంక్షేమమే అన్నింటి కన్నా గొప్ప చట్టం. న్యాయస్థానాలు తమ న్యాయాధికారాన్ని ఉపయోగించేటప్పుడు సమాజ విస్తృత ప్రజా ప్రయోజనాలను, సంక్షేమాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. వ్యక్తిగత హక్కులు, సమాజ చట్టబద్ధ ప్రయోజనాలు రెండింటినీ కూడా కోర్టు విస్మరించరాదు. వాటి మధ్య తగిన సమతుల్యతను పాటించాలి. భారతి సిమెంట్స్ కంపెనీ స్పష్టమైన ఫిర్యాదులు చేసినప్పటికీ, శాంతిభద్రతలను అదుపులో ఉంచడానికి సంబంధిత పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోలేదనేది ఈ కేసులోని కీలక అంశం. చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా వేగంగా స్పందించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
కంపెనీకి రోజుకు రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు నష్టం....
సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనను క్లుప్తంగా చెప్పాలంటే, పోలీసులు, కలెక్టర్ నిర్లక్ష్యం వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని తెలిపారు. పరిశ్రమ ఆవరణలో నివసిస్తున్న శాశ్వత ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని సీనియర్ న్యాయవాది పేర్కొన్నారు. అంతేకాకుండా కంపెనీ రోజుకు రూ. 4 కోట్ల నుండి 6 కోట్ల వరకు నష్టపోతోందని, ఇది రాష్ట్ర ఖజానాకు, శాశ్వత ఉద్యోగులకు, వారి కుటుంబాలకు తీవ్ర నష్టం కలిగిస్తోందని అన్నారు.
యజమానులు పోలీసు రక్షణ కోరవచ్చు.. కేరళ హైకోర్టు తీర్పు
‘పారిశ్రామిక శాంతిని కాపాడేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు తన అధికారాన్ని ఉపయోగించి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వవచ్చా లేదా అనే కోణంలో కోర్టులు వెల్లడించిన చట్టపరమైన తీర్పులను పరిశీలించడం ఎంతైనా అవసరం. రాఘవన్ వర్సెస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేసులో కేరళ హైకోర్టు విస్తృత తీర్పునిస్తూ... యజమానులకు, కార్మికులకు నడుమ వివాదాల పరిష్కారానికి లేబర్ చట్టాలు ఉన్నప్పటికీ, శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు యజమానులు రాజ్యాంగంలోని అధికరణ 226 కింద హైకోర్టును ఆశ్రయించి పోలీసు రక్షణ కోరవచ్చునని తెలిపింది. సమ్మె చేస్తున్న కార్మికులు యజమానిని లేదా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కార్మికులను అడ్డుకున్నప్పుడు, పూడ్చుకోలేని నష్టం జరిగే ప్రమాదం ఉన్నప్పుడు కూడా యజమానులు హైకోర్టుకు రావొచ్చునని కేరళ హైకోర్టు చెప్పింది.’ అని జస్టిస్ మహేశ్వరరావు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పోలీసు రక్షణకు ఆదేశాలివ్వవచ్చు.. మద్రాసు హైకోర్టు
‘అదే విధంగా, తమిళనాడు హైకోర్టు కూడా ఎస్‌ఎన్‌వై ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కేసులో ఫ్యాక్టరీ నిర్వహణపై శాంతిభద్రతల ప్రభావం పడినప్పుడు ఆర్టికల్ 226 కింద హైకోర్టు పోలీసు రక్షణకు ఆదేశాలు జారీ చేయవచ్చని తెలిపింది. కార్మికులు శాంతియుతంగా సమ్మె చేయవచ్చని, అయితే ఫ్యాక్టరీపై, తోటి కార్మికులపై లేదా మెటీరియల్ తరలింపు విషయంలో హింసకు, బెదిరింపులకు పాల్పడటం, రాకపోకలకు ఆటంకాలు సృష్టించడం వంటివి చేయరాదని ఆ హైకోర్టు స్పష్టం చెప్పింది. పోలీసు రక్షణ అనేది కేవలం శాంతిని కాపాడటానికి, చట్టబద్ధమైన రాకపోకలకు మాత్రమేనని, వారి మధ్య ఉన్న పారిశ్రామిక వివాదాన్ని హైకోర్టు పరిష్కరించదని స్పష్టం చేసింది.’ అని న్యాయమూర్తి గుర్తు చేశారు.
రాష్ట్రానికి లబ్ది చేకూర్చే పరిశ్రమను మూసివేసేలా చేయకూడదు
‘ఇండియన్ సిమెంట్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో శాంతిభద్రతలను కాపాడటమే పోలీసుల ప్రాథమిక విధి ఇదే హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. పెద్ద సంఖ్యలో కార్మికులకు ఉపాధి కల్పిస్తూ, పన్నుల రూపంలో రాష్ట్రానికి లబ్ధి చేకూరుస్తున్న పరిశ్రమను, కార్మికుల నిరసనల కారణంగా మూసివేసేలా చేయకూడదు. కాంట్రాక్ట్ కార్మికులకు తమ ఉద్యోగానికి సంబంధించి ఏదైనా ఫిర్యాదులు లేదా డిమాండ్లు ఉంటే, వారు లేబర్ కోర్టు లేదా సంబంధిత లేబర్ అథారిటీ వద్ద తగిన పరిష్కారం కోరాలి. హింస, ఆటంకాలు, అలజడులను నిరోధించి, పరిశ్రమ తన చట్టబద్ధమైన కార్యకలాపాలను శాంతియుతంగా నిర్వహించుకునేలా చూసేందుకు పోలీసులు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ ఉత్తర్వును ఇదే హైకోర్టుకు చెందిన మరొక సింగిల్ జడ్జి కూడా అనుసరించారు. అందువల్ల, పారిశ్రామిక శాంతికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద ఈ కోర్టుకు విస్తృత అధికారాలున్నాయి.’ అని న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరరావు తేల్చి చెప్పారు.


