శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా స్టేషన్‌లోకి లాక్కెళ్లిన పోలీసులు
చిరిగిన చొక్కా.. కాళ్లు, చేతులకు గాయాలు
తిరుపతి రూరల్: వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిపై తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీసులు విరుచుకుపడ్డారు. పోలీస్‌స్టేషన్ ముందు మంగళవారం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆయన్ని స్టేషన్‌లోకి లాక్కెళ్లారు. స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలోకి దించి చేతులు, కాళ్లు పట్టి లాగుతూ, గోళ్లతో రక్కుతూ, కాళ్లతో తొక్కుకుంటూ బలవంతంగా తీసుకెళ్లారు. చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి చొక్కా చిరిగిపోవడమే కాకుండా కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా మరికొందరు వైఎస్సార్‌సీపీ నాయకులకు కూడా గాయాలయ్యాయి.
ప్రైవేట్ సెక్యూరిటీపై ఎఫ్‌ఐఆర్
డీఎస్సీలో అక్రమాలపై చంద్రగిరిలో ఈ నెల10వ తేదీన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీకి వేలాదిమంది జనం తరలిరావడంతో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలో భాగంగా ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సెక్యూరిటీలో ఒకరిద్దరు ఖాకీ చొక్కాలు వేసుకున్నారంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అర్ధరాత్రి వారిని అరెస్టుచేసి పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న హర్షిత్‌రెడ్డి చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ప్రైవేటు సెక్యూరిటీపై కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
ఖాకీ దుస్తులు ధరించడం తప్పే అయితే ఉదయం నుంచి అక్కడే నిలబడి చూస్తున్న సీఐ సురేష్ కుమార్ వారికి ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ర్యాలీ విజయవంతంగా ముగిసిన తరువాత అర్ధరాత్రి వేళ ఫోన్ వస్తే వెళ్లి ప్రైవేటు సెక్యూరిటీ వారిని తీసుకొచ్చి కేసు పెడతారా అని అడిగారు. పోలీసుల అదుపులో ఉన్న వారిని బయటకు పంపాలని ఆయన, పార్టీ నేతలు శాంతియుతంగా పోలీస్‌స్టేషన్ ముందు నిరసనకు దిగారు. ఒక్కసారిగా విరుచుకుపడిన పోలీసులు నిరసన తెలుపుతున్నవారి చొక్కాలు చించి, రక్తం వచ్చేలా గోళ్లతో రక్కుతూ లాగేశారు. హర్షిత్‌రెడ్డి చొక్కా చించడమే కాకుండా కుడిచేతికి, కుడికాలికి గాయాలయ్యేలా ఈడ్చుకెళ్లారు.


