జస్టిస్‌ వర్మకు షాక్.. ఆ మూడు ఆరోపణలు నిజమే! | Justice Yashwant Varma probe panel finds all 3 charges proved | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ వర్మకు షాక్.. ఆ మూడు ఆరోపణలు నిజమే!

Aug 12 2026 5:23 PM | Updated on Aug 12 2026 5:31 PM

Justice Yashwant Varma probe panel finds all 3 charges proved

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు సంబంధించిన ‘క్యాష్‌ ఎట్‌ హోమ్‌’ కేసులో మూడు ఆరోపణలూ రుజువైనట్లు లోక్‌సభ స్పీకర్‌ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీ తేల్చింది. ఆయన అధికారిక నివాసంలోని స్టోర్‌రూమ్‌లో భారీగా రూ.500 నోట్ల కట్టలు, నగదు ఉన్నప్పటికీ.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిది, అక్కడ ఎందుకు ఉందన్న విషయాలను జస్టిస్‌ వర్మ సంతృప్తికరంగా వివరించలేకపోయారని కమిటీ పేర్కొంది. అయితే ఆ నగదు వ్యక్తిగతంగా జస్టిస్‌ వర్మదేనని క్రిమినల్‌ చట్టపరమైన నిర్ధారణను మాత్రం కమిటీ చెప్పలేదు.

నగదుకు సంబంధించిన కీలక ఆధారాలను సరిగా భద్రపరచలేదని కమిటీ పేర్కొంది. 2025 మార్చి 14న ఆయన ఢిల్లీ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగిన అనంతరం స్టోర్‌రూమ్‌ను వెంటనే సీల్‌ చేయకుండా శుభ్రపరిచే పనులు జరిగాయని, అధికారిక తనిఖీ సమయానికి అక్కడున్న నగదు కనిపించకుండా పోయిందని తెలిపింది. దీంతో నగదును స్వాధీనం చేసుకుని లెక్కించలేకపోవడంతో అసలు ఎంత మొత్తం ఉందో కూడా ఖచ్చితంగా నిర్ధారించలేకపోయింది.

జస్టిస్‌ వర్మ ఇచ్చిన వివరణలు తప్పించుకునే ధోరణిలో, అసంపూర్తిగా ఉన్నాయని కమిటీ అభిప్రాయపడింది. స్టోర్‌రూమ్‌ తన నియంత్రణలో లేదని, తాను ఘటన జరిగిన సమయంలో అక్కడ లేనని ఆయన వాదించారు. నగదు ఎవరో కావాలనే పెట్టి ఉండొచ్చని, కుట్ర జరిగి ఉండొచ్చని కూడా ఆయన తరఫు వాదనలు వినిపించాయి. అయితే వీటికి మద్దతుగా తగిన సాక్ష్యాలు సమర్పించలేదని కమిటీ పేర్కొంది.

ఈ మూడు ఆరోపణలు రుజువైనట్లు కమిటీ నివేదికను బుధవారం లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రవేశపెట్టింది. అయితే ఇది క్రిమినల్‌ కోర్టు ఇచ్చిన నేర నిర్ధారణ లేదా శిక్ష కాదు. ఇదిలా ఉండగా, పార్లమెంట్‌ ద్వారా తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే జస్టిస్‌ వర్మ 2026 ఏప్రిల్‌లో అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేయడంతో ఆయనపై చేపట్టిన తొలగింపు ప్రక్రియకు ఇక ప్రయోజనం లేకుండా పోయింది.

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై విచారణకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా 2025 ఆగస్టు 12న ముగ్గురు సభ్యులతో కూడిన జడ్జెస్‌ ఇన్‌క్వైరీ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అరవింద్‌ కుమార్, అప్పటి మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మనీంద్ర మోహన్‌ శ్రీవాస్తవ, కర్ణాటక హైకోర్టు సీనియర్‌ అడ్వొకేట్‌ బి.వి. ఆచార్య ఉన్నారు. అయితే విచారణ పూర్తయ్యేలోపు కమిటీలో మార్పు జరిగింది. జస్టిస్‌ శ్రీవాస్తవ స్థానంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీ చంద్రశేఖర్‌ వచ్చారు.

ఈ విచారణ కమిటీ తన నివేదికను 2026 మే 18న తన నివేదికను  లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు సమర్పించింది. ఈ రోజు ఆగస్టు 12నపార్లమెంట్‌ ఉభయ సభల్లో అధికారికంగా ప్రవేశపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement