టీజీ మోహ‌న్‌దాస్ అరెస్ట్‌ | Kerala Police Arrest Political Commentator TG Mohandas Over Controversial Remarks On NEET Student Protesters And Women | Sakshi
Sakshi News home page

విద్యార్థుల పోరాటంపై అనుచిత వ్యాఖ్య‌లు.. మోహ‌న్‌దాస్ అరెస్ట్‌

Aug 10 2026 3:20 PM | Updated on Aug 10 2026 3:31 PM

TG Mohandas arrested after remark over NEET protest

తిరువనంతపురం: మితవాద రాజ‌కీయ వ్యాఖ్యాత టీజీ మోహ‌న్‌దాస్‌ను కేర‌ళ పోలీసులు అరెస్ట్ చేశారు. కొచ్చిలోని కూవపదంలో తన నివాసంలో ఉన్న ఆయ‌న‌ను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అక్క‌డ నుంచి తిరువనంతపురం సైబర్ పోలీస్ స్టేషన్‌కు ఆయ‌న‌ను త‌ర‌లించారు. ఆయ‌న‌ను ఈ రోజు సాయంత్రం సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తారని పోలీసులు తెలిపారు. ఆయ‌న నివాసం నుంచి డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్ల‌డించారు. వీటిని కోర్టుకు స‌మ‌ర్పించిన ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపుతామని తెలిపారు. తదుపరి దర్యాప్తు జరిపిన తర్వాత మోహన్‌దాస్‌పై మరిన్ని అభియోగాలు న‌మోదు చేసే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది.

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్య‌వ‌హారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల పోరాటంపై మోహన్‌దాస్ (TG Mohandas) వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. త‌న యూట్యూబ్ చాన‌ల్‌ ‘పత్రిక’లో పోస్ట్ చేసిన‌ వీడియోలో ఈ మాట‌లు మాట్లాడారు. తానే గ‌న‌క తాను నియంత్రించే బాధ్యతలో ఉండి ఉంటే విద్యార్థి ఆందోళనకారులపై భద్రతా బలగాలతో కాల్పులు జ‌రిపించి చెద‌ర‌గొట్టే వాడిన‌ని వ్యాఖ్యానించారు. అక్క‌డితో ఆగ‌కుండా యువ‌త‌లు, మ‌హిళ‌ల‌పై అస‌భ్య‌క‌రంగా మాట్లాడారు. మహిళా ఆందోళనకారులను  "అత్యాచారాలను ఇష్టపడే మహిళలు" అంటూ వ్యాఖ్యానించారు. వారిపై సామూహిక అత్యాచారాలు జరుగుతాయంటూ నోరు పారేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌నపై గ‌త నెల చివరి వారంలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. 

అరెస్టు జాప్యంపై విమ‌ర్శ‌లు
మోహన్‌దాస్‌ను అరెస్ట్ చేయ‌డంలో యూపీఎఫ్ ప్ర‌భుత్వం తాత్సారం చేసింద‌ని ప్ర‌తిప‌క్ష ఎల్‌డీఎఫ్ ఆరోపించింది. గ‌త నెల‌లో కేసు న‌మోదైతే ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు అరెస్ట్ చేయ‌లేద‌ని ప్ర‌శ్నించింది. మోహన్‌దాస్ అరెస్ట్ విష‌యంలో పోలీసులు చ‌ట్ట‌ప్ర‌కారమే ముందుకు వెళ్లార‌ని హోం మంత్రి రమేష్ చెన్నితాల చెప్పారు. ఇదే అంశంపై  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకునే సామర్థ్యం కేరళ పోలీసులకు ఉందని వ్యాఖ్యానించారు. 

చ‌ద‌వండి: 'ఆమెకు ఏమైనా జ‌రిగితే సుప్రీంకోర్టు జ‌డ్జిదే బాధ్య‌త‌'

ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం లేదు
త‌మ సంస్థ‌తో మోహ‌న్‌దాస్‌కు ఎటువంటి సంబంధం లేద‌ని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్‌సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్ర‌క‌టించింది. త‌మ సంస్థలో ఎలాంటి పదవిలో గానీ, బాధ్యతలో గానీ ఆయ‌న‌ లేరని దక్షిణ కేరళం ప్రాంత సహ కార్యవాహ కె.బి. శ్రీకుమార్ తెలిపారు. ఆయ‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌తో త‌మకు సంబంధం లేద‌న్నారు. ఇటువంటి అభిప్రాయాల‌ను ఆర్‌ఎస్‌ఎస్ అత్యంత తీవ్రంగా ఖండింస్తుంద‌ని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement