నీట్ అవకతవకలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనల సందర్బంగా యువతరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్( Kangana Ranaut) ఇపుడు యూ టర్న్ తీసుకోవడం నెట్టింట సంచలనంగా మారింది. జెన్ జీకాదు జనరేషన్ గట్టర్‌గా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆమె 'జెన్ జీ' (Gen Z )ని భారతదేశపు గొప్ప బలంగా అభివర్ణించడం సంచలనం రేపుతోంది. జార్ఖండ్‌లో నిరసనలు తెలుపుతున్న విద్యార్థులు ఎంతో శాంతియుతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని ఉదాహరణగా చెప్పడం గమనార్హం. దీంతో నిన్నటి దాకా యువతపై నోరు పారేసుకున్న కంగనాలో వచ్చిన మార్పు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ ఎంపీ,సినీ నటి కంగనా రనౌత్ శుక్రవారం యువతపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. ఇప్పటికా వారిని మురికితరం అంటూ విరుచుకు పడిన ఆమె, ఇప్పుడు అదే యువతను దేశానికి బలం, గర్వకారణం అంటూ కొనియాడారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన మండి లోక్‌సభ ఎంపీ, ఒకే మాటతో మొత్తం తరాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నాలను తోసిపుచ్చారు. కేవలం "10-15 మంది" మాత్రమే మొత్తం తరానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని, కానీ 'జెన్-జెడ్'లోని అత్యధికులు దేశానికి సానుకూలమైన రీతిలో తమవంతు కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. నిరసనల్లో కొద్దిమంది చేసే అభ్యంతరకర లేదా హానికర ప్రవర్తన ఆధారంగా మొత్తం తరాన్ని తప్పుబట్టడం సరికాదన్నారు.
ఇదీ చదవండి: ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్‌గా ఘనత
ప్రభుత్వంలో 'జెన్-జెడ్' కూడా ఒక భాగం. వారి ఆకాంక్షలే మా ప్రభుత్వం ఇన్నాళ్లుగా నెరవేరుస్తూ వస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉండటానికి ఈ తరం ఇచ్చిన మద్దతే (మ్యాండేట్) కారణం అంటూ కంగనా మాట మార్చటం విశేషం. దేశానికి పతకాలు సాధించిపెడుతున్న యువ క్రీడాకారులు తమ విజయాలను ప్రధానమంత్రికి, దేశానికి అంకితం చేస్తున్నారని కొనియాడారు. కేవలం కొద్ది మంది మాత్రమే జెన్-జీ ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు.పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటూ విపక్షాలు రభస సృష్టిస్తున్నాయని, దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులు, చేస్తున్న పనులతో వారు ఏకీభవించకుండా వినాశకర ఆలోచనలతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కాగా, గతవారం సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల నిరసనలను ఉద్దేశించి కంగనా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పద మయ్యాయి. నిరసనల్లోని యువతుల భాష, ప్రవర్తనను విమర్శిస్తూ ఆమె ఆ తరాన్ని 'జెనరేషన్ గట్టర్' అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె జెన్ జీ యువతకు మద్దతుగా మాట్లాడటం గమనార్హం.
ఇదీ చదవండి: అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ


