కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు భారీ షాక్ తగిలింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) ప్రక్రియలో భాగంగా తమ ఓటు హక్కును కోల్పోయిన వారికి, ఇకపై ఆవాస్ యోజన వంటి సంక్షేమ పథకాల లబ్ధిని నిలిపివేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో చేపట్టిన పరిశీలనలో, ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన కనీసం 57,000 మంది పేర్లను ఆవాస్ యోజన లబ్ధిదారుల జాబితా నుండి కూడా తొలగిస్తున్నట్లు ఆ రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దిలీప్ ఘోష్ అధికారికంగా వెల్లడించారు.
రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ నిర్వహించిన సమయంలో సుమారు 9.1 లక్షల మందిని ఓటర్ల జాబితా నుండి తొలగించారని, వారిలో 57,000 మంది ఆవాస్ యోజన లబ్ధిదారులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేనందున వారందరినీ పథకానికి అనర్హులుగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు.
రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి, రాష్ట్ర గృహనిర్మాణ పథకానికి చెందిన సుమారు 10.2 లక్షల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులను బదిలీ చేయడంతో పాటు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. పథకం ద్వారా నిధులు పొందిన మొత్తం 30 లక్షల మంది లబ్ధిదారులలో, సుమారు 12,500 మంది అనర్హులుగా తేలారు. వారు అక్రమంగా నిధులు పొందినట్లు గుర్తించి చర్యలు చేపట్టాము. దీనిపై మరింత విచారణ జరుగుతోంది. ఇప్పటికే సుమారు 1,000 మంది అక్రమ లబ్ధిదారుల నుండి నిధులను తిరిగి వసూలు చేసే ప్రక్రియను ప్రారంభించాము" అని తెలిపారు.
గతంలో బంధుప్రీతి, ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద పశ్చిమబెంగాల్‌కు రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీనికి ప్రత్యామ్నాయంగా మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం 2024లో సొంత నిధులతో ‘బంగ్లార్ బారి’ అనే పథకాన్ని ప్రారంభించింది.
అయితే, ఈ ఏడాది మే నెలలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అనర్హులైన వారి పేర్లను తొలగించేందుకు ప్రత్యేక సర్వేను నిర్వహించింది. ఇందులో భాగంగానే గురువారం నాడు 10,20,370 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.60వేల చొప్పున రెండో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మిగిలిన లబ్ధిదారుల వివరాల పరిశీలన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో, ఈ పథకం పేరును ‘బంగ్లార్ బారి’ నుండి ‘పశ్చిమ బంగా ఆవాస్ యోజన’గా మారుస్తూ ముఖ్యమంత్రి సువేందు అధికారి నిర్ణయం తీసుకున్నారు


