నమ్మకం పోయింది.. వాంగ్‌చుక్‌ సంచలన ఆరోపణలు | They Broke Their Promise I Lost Trust in Wangchuk Stunning Claim | Sakshi
Sakshi News home page

నమ్మకం పోయింది.. వాంగ్‌చుక్‌ సంచలన ఆరోపణలు

Aug 6 2026 7:28 AM | Updated on Aug 6 2026 7:41 AM

They Broke Their Promise I Lost Trust in Wangchuk Stunning Claim

ప్రముఖ సామాజిక కార్యకర్త, పర్యావరణ వేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 26 రోజుల నిరాహార దీక్ష ముగింపు సందర్భంగా జరిగిన పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం కేంద్రం సమక్షంలోనే దీక్ష విరమించాలన్నది తన ఉద్దేశం ఏమాత్రం కాదని.. ఆ విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని అంటున్నారాయన. అయితే ఆ ఘటన తర్వాత ఎవరి నమ్మాలో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించారు.

ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో జరిగిన అర్ధరాత్రి భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. దీక్ష విరమణ సమయంలో తీసిన ఫొటోలను వెంటనే విడుదల చేయబోమని మంత్రులు తనకు హామీ ఇచ్చారని, అయితే ఆ మాటను తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.

“అందరి సమక్షంలో ప్రకటించాలని కోరా”
దీక్ష విరమణను కేవలం అధికార పార్టీ కార్యక్రమంలా చూపించకూడదని తాను భావించినట్లు వాంగ్‌చుక్‌ తెలిపారు. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి ప్రతినిధులు కూడా పాల్గొన్న తర్వాతే ఈ విషయాన్ని ప్రకటించాలని కోరినట్లు చెప్పారు. “విపక్ష నేతలు, విద్యార్థి నాయకులతో కలిసి ఉమ్మడిగా ప్రకటన చేద్దామని చెప్పాను. ఫొటోలు కూడా అందరి భాగస్వామ్యంతోనే విడుదల చేయాలని కోరాను. దీనికి వారు అంగీకరించారు” అని వాంగ్‌చుక్‌ పేర్కొన్నారు. ఈ అంగీకారానికి ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) అధికారులు కూడా సాక్షులుగా ఉన్నారని ఆయన తెలిపారు.

“కొన్ని నిమిషాల్లోనే ఫొటోలు బయటకు వచ్చాయి”
అయితే తనతో జరిగిన అంగీకారం కొద్ది నిమిషాల్లోనే తనకు షాక్‌ తగిలిందని అన్నారు. “కొద్ది నిమిషాల తర్వాత ఆ ఫొటోలు టీవీ ఛానళ్లలో ప్రసారం అవుతున్నాయనితో ఐబీ అధికారి వచ్చి నాకు చెప్పారు. దీంతో నేను తీవ్ర నిరాశకు గురయ్యా. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం.. నమ్మకాన్ని దెబ్బతీసింది అని ఆయన అన్నారు.

రాహుల్‌ గాంధీతోనూ సంప్రదింపులు..
తన భార్య గీతాంజలి అంగ్మో.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో మాట్లాడి, ఆయన చేతుల మీదుగా దీక్షను ముగించే అవకాశం ఉందా అని ప్రయత్నించారని వెల్లడించారు. అయితే అందుకు రాహుల్‌ గాంధీ నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తన భార్యపై కాంగ్రెస్‌ నాయకత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వచ్చాయని, వాస్తవ పరిస్థితి వేరుగా ఉందని వాంగ్‌చుక్‌ పేర్కొన్నారు.

డీల్‌ చేసుకోవాలనుకుంటే..
తన దీక్ష ముగింపు విషయంలో ప్రభుత్వం‌తో రహస్య ఒప్పందం కుదిరిందన్న ఆరోపణలను వాంగ్‌చుక్‌ ఖండించారు. “నాకు ఏదైనా ఒప్పందం చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే 26 రోజుల పాటు దీక్ష చేసే అవసరం లేదు. అంతకంటే పెద్ద అవకాశాలు నాకు ఉండేవి” అని అన్నారు. తనకు పదవులు లేదంటే వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం కాదని, ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యమని స్పష్టం చేశారు.

26 రోజుల దీక్ష.. 10 కేజీల బరువు
నీట్‌ వ్యవహారంలో అవకతవకలు, పరీక్షల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతూ సోనమ్‌ వాంగ్‌చుక్‌ జూన్‌ 28న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. అప్పటికే నిరసనలు చేస్తున్న కాక్రోచ్‌ జనతా పార్టీకి ఆయన సంఘీభావం తెలపగా.. ఆయన దీక్షకు ఆ సంస్థ కూడా మద్దతు తెలిపింది. అయితే క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించడం, కోర్టు జోక్యంతో బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆపై.. నిరసనకారులెవరూ ఆయన్ని కలవనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో.. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌ ఆయనను కలిశారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షల పేపర్‌ లీకేజీలపై కఠిన చర్యలు, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల అంశంపై వీడియో సందేశం ఇచ్చిన తర్వాత జూలై 24న వాంగ్‌చుక్‌ తన 26 రోజుల దీక్షను విరమించారు. అయితే దీక్ష విరమణ సమయంలో కేంద్ర మంత్రులు ఆయనకు సూప్‌ అందిస్తున్న ఫొటోలు బయటకు రావడం వివాదాస్పదంగా మారింది. ఆయన కేంద్రంతో డీల్‌ కుదుర్చుకున్నాడంటూ సంచలన ఆరోపణలు దిగారు కొందరు ఆందోళనకారులు. ఈ వ్యవహారంపై వాంగ్‌చుక్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement