విద్యార్థులను చూస్తే గర్వంగా ఉంది  | Students Were Beaten For Demanding Education Reforms | Sakshi
Sakshi News home page

విద్యార్థులను చూస్తే గర్వంగా ఉంది 

Aug 6 2026 6:30 AM | Updated on Aug 6 2026 6:30 AM

Students Were Beaten For Demanding Education Reforms

రాజ్యాంగం, దేశ భవిష్యత్తు కోసం పోరాటం సాగించారు 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రశంసలు  

జూలై 20న దాడికి గురైన వారితో సమావేశం   

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేపర్‌ లీకేజీపై నిరసన తెలియజేసిన విద్యార్థులపై జరిగిన హింసాకాండకు ముమ్మాటికీ అమిత్‌ షా బాధ్యుడని ఆరోపించారు. విద్యార్థుల విషయంలో ఏం జరిగిందో పార్లమెంట్‌లో వివరించే ధైర్యం ఆయనకు లేదని విమర్శించారు. జూలై 20న పోలీసుల దాడికి గురైన విద్యార్థుల బృందంతో రాహుల్‌ గాంధీ బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. 

వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువ నిరసనకారులను ఇప్పుడే కలిసి చర్చించానని తెలిపారు. రాజ్యాంగం, విద్యా వ్యవస్థ, భారతదేశ భవిష్యత్తు కోసం పోరాడిన వేలాది విద్యార్థులను చూస్తే తనకు చాలా గర్వంగా ఉందన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. తమపై జరిగిన దాడి, తగిలిన దెబ్బలు, ఎదురవుతున్న బెదిరింపుల గురించి వారు వివరించారని పేర్కొన్నారు. 

వారు రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం సాగించారని, భారతదేశం అనే భావనను, దేశ భవిష్యత్తును కాపాడారని రాహుల్‌ ప్రశంసించారు. లోపభూయిష్టమైన, కుప్పకూలిపోతున్న, నిష్ప్రయోజనమైన విద్యా విధానం గురించి ఫిర్యాదు చేయడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. వ్యవస్థనే మార్చాలని విద్యార్థులు కోరుతున్నారని చెప్పారు. వారు హింసకు పాల్పడలేదని, దురుసుగా ప్రవర్తించలేదని గుర్తుచేశారు. అయినప్పటికీ వారిపై దాడి చేసి, కొట్టి, బెదిరించారని ధ్వజమెత్తారు. 

ఆన్‌లైన్‌లో వేధిస్తున్నారు: రియా ఆహిర్‌  
విద్యార్థుల బృందాన్ని కలిసిన ఫొటోలను రాహుల్‌ గాంధీ ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘‘భారతదేశ భవిష్యత్తును చూడండి. యువత నిర్భయులు, నిర్మొహమాటంగా మాట్లాడుతారు. వారికి దేశభక్తి ఉంది. మరి ప్రధానమంత్రి, హోంమంత్రి సంగతి ఏంటి? పార్లమెంట్‌కు వచ్చే ధైర్యం గానీ, సమాధానాలు చెప్పే తెగింపు గానీ వారికి లేవు’’అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

 మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రాహుల్‌ గాంధీ పక్కన సీజేపీకి చెందిన రియా ఆహిర్, నూతన్‌ టోపో, భరత్, ఫర్హానాజ్, ముస్కాన్‌  ఉన్నారు. వీరిలో మోడల్‌ రియా ఆహిర్‌ ముంబైలో విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసు వ్యాన్‌ను అడ్డుకున్న సంగతి తెలిసిందే. తనకు ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. గాంధీ పక్కన నిల్చొని ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను 20 మంది పిల్లలను అక్రమ అరెస్టుల నుంచి కాపాడనని, ఇప్పుడు తనను ఆన్‌లైన్‌లో వేధిస్తున్నారని చెప్పారు. తాను ఎదుర్కొంటున్నది ట్రోలింగ్‌ కాదని, అది ఒక నేరమని స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement