సీజేపీ కొత్త మిషన్‌.. నేడు భారీ ప్రకటనపై దేశవ్యాప్త ఉత్కంఠ! | CJP Ashutosh Ranka major CJP announcement today | Sakshi
Sakshi News home page

సీజేపీ కొత్త మిషన్‌.. నేడు భారీ ప్రకటనపై దేశవ్యాప్త ఉత్కంఠ!

Aug 6 2026 7:48 AM | Updated on Aug 6 2026 7:50 AM

CJP Ashutosh Ranka major CJP announcement today

పరీక్షల పేపర్ లీకుల ఆరోపణలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో ప్రధాన స్వరంగా మారిన కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) తన తదుపరి కార్యాచరణపై కీలక ప్రకటనకు సిద్ధమవుతోంది. ఉద్యమ భవిష్యత్ దిశ, దేశవ్యాప్త విస్తరణ ప్రణాళికలను గురువారం వెల్లడించనున్నట్లు సంస్థ ప్రకటించింది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో గత రెండు రోజులుగా జరిగిన కీలక సమావేశాల అనంతరం ఈ ప్రకటన రానుంది. సంస్థ నాయకత్వం ఉద్యమం తదుపరి దశకు సంబంధించి సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం చేసినట్లు సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియో సందేశంలో రంకా మాట్లాడుతూ.. ‘దేశంలో వ్యవస్థాగత మార్పు కోసం మేము భారీ పోరాటాన్ని ప్రారంభించాం. ఈ ఉద్యమంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి’ అని అన్నారు. మద్దతుదారుల నుంచి సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా వచ్చిన వేలాది సూచనలు, అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత భవిష్యత్ వ్యూహాన్ని ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. గురువారం చేయబోయే ప్రకటనలో ఉద్యమం ఎటువైపు సాగుతుందనే దానిపై స్పష్టత ఇవ్వనున్నట్లు చెప్పారు.

కాగా, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే నివాసంలో దాదాపు ఏడు గంటల పాటు వ్యూహాత్మక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థను దేశవ్యాప్తంగా విస్తరించడం, విద్యార్థి సంఘాలతో బలమైన నెట్‌వర్క్ ఏర్పాటు చేయడం, వివిధ రాష్ట్రాల్లో విద్యా సమస్యలపై జరుగుతున్న ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, సీజేపీ ప్రస్తుతం రాజకీయ పార్టీగా మారే ఆలోచనలో లేదని నాయకత్వం స్పష్టం చేసింది. విద్యా రంగ సమస్యలపై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే సామాజిక, ప్రజా ఉద్యమ వేదికగా కొనసాగాలని నిర్ణయించినట్లు తెలిపింది.

‘మేము రాజకీయ పార్టీ ప్రారంభించడం గురించి ఆలోచించడం లేదు. ప్రజలకు న్యాయవ్యవస్థ, రాజకీయ నాయకులు, మొత్తం వ్యవస్థపై నమ్మకం తగ్గింది. మేము ఒక సమూహంగా పనిచేస్తాం’ అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. విద్యా సంస్కరణలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, పేపర్ లీకుల నివారణ, విద్యార్థుల సంక్షేమం, విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం వంటి అంశాలే తమ ఉద్యమ ప్రధాన లక్ష్యాలని సీజేపీ నాయకత్వం వెల్లడించింది. తమ ఉద్యమం మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాల ఆధారంగా కొనసాగుతుందని, అహింసా మార్గంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పోరాటం చేస్తామని సంస్థ తెలిపింది. సంప్రదాయ రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటూ విద్యా రంగ మార్పుల కోసం పనిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను తమ పేపర్ లీక్ వ్యతిరేక ఉద్యమంలో కీలక మైలురాయిగా సీజేపీ అభివర్ణించింది. అయితే తమ పోరాటం ఒక్క సంఘటనతో ఆగిపోదని, దేశ విద్యా వ్యవస్థలో విస్తృత మార్పులు వచ్చే వరకు కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చింది. గురువారం సీజేపీ చేయనున్న ప్రకటనలో దేశవ్యాప్త విస్తరణ ప్రణాళికలు, కొత్త కార్యక్రమాలు, విద్యార్థి ఉద్యమాలతో అనుసంధానం వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పేపర్ లీకుల అంశంతో ప్రారంభమైన ఈ ఉద్యమం భవిష్యత్తులో ఎంతటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement