విపక్షాల ఒత్తిళ్లతో దిగొచ్చిన కేంద్రం! | Amit Shah Answer Jantar Mantar Police Action | Sakshi
Sakshi News home page

విపక్షాల ఒత్తిళ్లతో దిగొచ్చిన కేంద్రం!

Aug 10 2026 1:58 PM | Updated on Aug 10 2026 2:11 PM

Amit Shah Answer Jantar Mantar Police Action

నీట్‌ అభ్యర్థుల నిరసనలు, ఢిల్లీలో చోటుచేసుకున్న పోలీసుల చర్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించేందుకు సిద్ధమైంది. ఈ అంశంపై విపక్షాల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రకటన చేయనున్నారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఆయనకు స్పీకర్‌ సమయం కేటాయించినట్లు తెలుస్తోంది.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభమయ్యాయి. అదే రోజు నీట్‌ అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో సంసద్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు లాఠీఛార్జి చేయడం తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ క్రమంలో పెలెట్‌ గన్స్‌ సైతం ప్రయోగించారనే విమర్శలు వెల్లువెత్తాయి.

మొదట రాజీనామా డిమాండ్‌
నీట్‌ పరీక్ష నిర్వహణలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో తొలుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. అయితే మంత్రి రాజీనామా తర్వాత కూడా నిరసనలు ఆగలేదు. విద్యార్థులపై పోలీసుల చర్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.

పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఆందోళన
జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీస్‌ యాక్షన్‌పై హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తూ విపక్షాలు పార్లమెంట్‌ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. “అమిత్‌ షా ఎక్కడ?” అంటూ పార్లమెంట్‌ లోపల, బయట నినాదాలు చేస్తూ నిరసనలు చేపట్టాయి. కేంద్రం పరిధిలో ఉన్న ఢిల్లీలో ఆయన ఆదేశాల మేరకే విద్యార్థులపై లాఠీలు ఝులిపించారని రాహుల్‌ గాంధీ సైతం ఆరోపణలు గుప్పించారు. ఆయన(షా) సభకు రావడానికి భయపడుతున్నారని.. ఈ అంశంపై కేంద్రం మౌనం వీడాలని ప్రతిపక్షాలు పదేపదే డిమాండ్‌ చేశాయి.

ఆగస్టు 13తో ముగియనున్న సమావేశాలు
వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై స్పందించేందుకు ముందుకొచ్చింది. విద్యార్థుల నిరసనలు, ఢిల్లీలో పోలీసుల వ్యవహారశైలి, ప్రభుత్వ చర్యలపై అమిత్‌ షా ఎలాంటి వివరణ ఇస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement