సాక్షి, వరంగల్: నర్సంపేటలో విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను రాత్రికి రాత్రే అధికారులు కూల్చివేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నియోజకవర్గంలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటన తర్వాత గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటుకు గద్దె నిర్మించారు. అయితే విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు ఆ నిర్మాణాన్ని కూల్చివేసినట్లు సమాచారం. ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేస్తున్నప్పటికీ అనుమతి పేరుతో రాత్రి వేళ కూల్చివేయడం సరికాదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
అంబేద్కర్ సెంటర్‌లో బీఆర్ఎస్ ధర్నా
గద్దె కూల్చివేతకు నిరసనగా సోమవారం ఉదయం నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఎర్రబెల్లిని అదుపులోకి తీసుకునేందుకు యత్నం
ధర్నా నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనను విరమించాలని సూచించారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో ఎర్రబెల్లి దయాకర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ప్రస్తుతం నర్సంపేటలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ది కుటుంబాన్ని ఆదివారం కేసీఆర్ పరామర్శించి ఓదార్చారు. ఆ వెంటనే గంటల వ్యవధిలోనే.. విగ్రహ గద్దె కూల్చివేత చోటు చేసుకుంది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.


