సాక్షి, అనంతపురం: ఏపీలో దగా డీఎస్సీపై ప్రజాపోరు కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ ఆధర్వ్యంలో పోరాటం ఉధృతమైంది. అయితే శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీలను మాత్రమే కాదు.. ఈ దౌర్జన్యకాండను నిలదీస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను సైతం పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తాడిపత్రి నియోజకవర్గం ముచ్చుకోట వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తాడిపత్రిలో ఇవాళ యువత ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసులు మాత్రం అధికార టీడీపీ కార్యక్రమం ఉందంటూ ఆ ర్యాలీని అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాడిపత్రికి బయల్దేరారు. మార్గమధ్యంలో ముచ్చుకోట వద్ద పోలీసులు ఆయన్ని అడ్డుకోవడంతో.. ఆయన రోడ్డుపైనే బైఠాయించి ఆయన నిరసన తెలియజేశారు.
పోలీసులను నిలదీసిన పెద్దిరెడ్డి
శాంతియుతంగా నిర్వహించే కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటారని పోలీసులను పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు.. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.
డీఎస్సీ అంశంపై ప్రభుత్వంపై విమర్శలు
సాక్షితో మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైఎస్సార్‌సీపీ ర్యాలీలను అడ్డుకోవడం దుర్మార్గమని ఆరోపించారు. “మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? మంత్రి లోకేశ్ కనుసన్నల్లోనే డీఎస్సీలో అక్రమాలు జరిగాయి. నైతిక బాధ్యతగా ఆయన రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు.
హైవేపై బైఠాయింపు
పోలీసుల తీరుకు నిరసనగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు అనంతపురం-తాడిపత్రి హైవేపై బైఠాయించారు. పోలీసుల వ్యవహారశైలిపై నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు వెంకటరెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి కూడా పోలీసుల తీరును తప్పుబట్టారు. శాంతియుత కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు.



