బిల్లులు చెల్లించకపోవడంతో పనుల నిలిపివేతకు నిర్ణయం
పటమట (విజయవాడ తూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు సోమవారం నుంచి సమ్మెబాట పడుతున్నారు. ది విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాయన ఆదిబాబు, అధ్యక్షుడు చనుమోలు వెంకట రమణ.. మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశను కలిసి సమ్మె నోటీసులు అందజేశారు.
విజయవాడ నగర మౌలిక సదుపాయాలు, అభివృద్ధిలో కీలక భాగస్వామ్యంగా ఉన్న తాము ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, జనరల్ ఫండ్ ద్వారా ఈ ఏడాది జూలై 31 వరకు రూ.350 కోట్లు, కంటింజెంట్ బిల్లులు (సీ–బిల్లులు) రూ.40 కోట్లు, ఇతరత్రా రూ.10 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్ ఉన్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించనందున సోమవారం నుంచి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటినీ నిలిపేయటంతోపాటు కొత్త పనులను బాయ్‌కాట్ చేస్తున్నామని ప్రకటించారు.


