ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు విలవిల
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు 1న జీతాలు ఇస్తున్నామంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని ప్రతి నెలా రుజువవుతోంది. ముఖ్యంగా వైద్య, ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద సేవలు అందించే ఉద్యోగులకు ప్రతి నెల వారం, రెండు వారాల ఆలస్యంగా ప్రభుత్వం వేతనాలు ఇస్తోంది. ఆగస్టు 10వ తేదీ వచ్చినా జూలై నెల వేతనాలు జమ అవ్వని దుస్థితి నెలకొంది.
దీంతో తక్కువ వేతనాలకు పనిచేస్తున్న చిరుద్యోగులు ప్రతి నెలా ఇంటి అద్దెలు, ఈఎంఐలు, కుటుంబ పోషణ, ఇతర ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటోందని ఎన్‌హెచ్‌ఎం జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు దయామణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెలా 1న జీతాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.


