భారతీ సిమెంట్స్‌లో నిలిచిన ఉత్పత్తి
రెండు యూనిట్లు మూత
చంద్రబాబు సర్కార్ దుర్మార్గమే కారణం
సీఎంఓ డైరెక్షన్‌లో టీడీపీ గూండాల ఆగడాలు
మైనింగ్ ప్రాంతంలో కార్మికులు, వాహనాల అడ్డగింత
ఆరురోజులుగా సాగని లైమ్‌స్టోన్ మైనింగ్
ముడిఖనిజం లేకపోవడంతో రెండు యూనిట్లలో నిలిచిన ఉత్పత్తి
సాక్షి ప్రతినిధి, కడప: ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే పరిశ్రమలను అడ్డుకోవడానికి మించిన దుర్మార్గమేముంటుంది? రాయితీలు, ప్రోత్సాహకాలిచ్చి పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం భారతీ సిమెంట్స్‌పై దారుణమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కనుసన్నల్లో ఆరురోజులుగా సాగుతున్న దమనకాండను రాష్ట్రంలోని పరిశ్రమ వర్గాలు నిర్ఘాంతపోయి చూస్తున్నాయి. భారతీ సిమెంట్స్‌ను మూతపడేలా చేయడమే లక్ష్యమన్నట్లు టీడీపీ గూండాలు మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నా జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర స్థాయి అధికారులు గానీ స్పందించకపోవడాన్ని బట్టి ఇది ముఖ్యమంత్రి స్థాయిలో నేరుగా అమలు చేస్తున్న కుట్రగానే భావించాలని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దాదాపు 15 వేల మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తున్న భారతీ సిమెంట్స్ పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోయింది.
రెండు యూనిట్లు మూతపడ్డాయి. మైనింగ్ ప్రాంతంలోకి కార్మికులను, వాహనాలను పోనీయకుండా అడ్డుకుంటున్న పచ్చముఠాలు అక్కడ రేయింబవళ్లు పహారా కాస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల దన్నుతో స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి అనుచరుల ముసుగులో గూండాలు, రౌడీషీటర్లు ఈ దుర్మార్గాన్ని కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ఓ పరిశ్రమ తన కార్యకలాపాలను చట్టబద్ధంగా చేసుకోవడానికి జిల్లా యంత్రాంగం తమవంతు సహకారం అందించాలి. వైఎస్సార్ కడప జిల్లాలో మాత్రం చట్టాలు చెల్లడం లేదు. అధికార పార్టీ మూకలు ఓ పథకం ప్రకారం ప్లాంటుకు రావాల్సిన ముడి ఖనిజాన్ని రాకుండా అడ్డుకుంటూ దౌర్జన్యానికి దిగుతూనే ఉన్నారు.
ఆరురోజులుగా మైనింగ్‌కు అడ్డుకట్ట..
భారతి సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం గడిచిన ఆరు రోజులుగా పలుమార్లు మైనింగ్ ప్రారంభించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.. ఒక్క అడుగు కూడా కదలనివ్వకుండా టీడీపీ గూండాలు రేయింబవళ్లు మైనింగ్ ప్రాంతంలోనే తిష్టవేసి మరీ అడ్డుకుంటున్నారు. కార్మికులు భయపడ్డట్లే భారతి సిమెంట్ పరిశ్రమలో శనివారం నుంచి సిమెంట్ ఉత్పత్తి ఆగిపోయింది. ప్లాంటులో ఉన్న సున్నపురాయి నిల్వలు కూడా నిండుకున్నాయి. మైనింగ్ నిర్వహించి, సున్నపురాయిని ప్లాంటుకు తరలించకపోతే, ప్లాంటులో సిమెంట్ ఉత్పత్తి కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని నాలుగు రోజులుగా భారతి సిమెంట్స్ యాజమాన్యం అధికారులకు వివరిస్తూనే ఉంది. అయినప్పటికీ జిల్లా అధికారులకు పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. ప్లాంటులో ముడిఖనిజం లేక సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది.
15వేల కుటుంబాలపై ప్రభావం..
గత 17సంవత్సరాలుగా భారతి సిమెంట్స్ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు.. ప్రత్యక్షంగా 3వేల మందికి, పరోక్షంగా 12వేల మందికి ఉపాధి పొందుతున్న పరిశ్రమపై చంద్రబాబు సర్కార్ కక్షబూనింది. పరిశ్రమ అంతర్భాగంగా ఉన్న మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకుని, భారతీ సిమెంట్స్ మూతపడేలా చేయాలన్నదే సీఎంఓ లక్ష్యమన్నట్లు కనిపిస్తోందని అధికారవర్గాలలోనూ చర్చ నడుస్తోంది. తాము చేయగలిగింది ఏమీ లేదని, పైనుంచి వస్తున్న వత్తిడి వల్లే ఏమీ చేయలేకపోతున్నామని జిల్లా అధికారల్లో చర్చ జరుగుతోంది. భారతీ సిమెంట్స్ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల 15వేల మంది కార్మికుల జీవితాలు, వారి కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం పడనుంది.


