ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా? | Priyanka father Venkatesh spoke to the media | Sakshi
Sakshi News home page

ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?

Aug 10 2026 5:26 AM | Updated on Aug 10 2026 5:26 AM

Priyanka father Venkatesh spoke to the media

అయ్యా.. చంద్రబాబూ మీకు జాలి లేదా?

పవన్‌ కళ్యాణ్‌.. మీకు మనసు లేదా?అమ్మా అనితమ్మా.. నీకు ఆడపిల్లలు లేరా?

లోకేశ్‌.. కనీస స్పందన లేదేంటయ్యా?

మూడు సార్లు కారుతో ఢీకొట్టి.. తలపై కారు ఎక్కిస్తే ఇదేనా మీ స్పందన?

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? రాజకీయ ఒత్తిళ్లతో కేసును తారుమారు చేయొద్దు

పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్‌ కన్నీటిపర్యంతం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, అమరావతి: ‘నా కుమార్తెను కావాలని కారుతో మూడుసార్లు ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా తలపై నుంచి కారును పోనిచ్చారు. వాళ్లు మనుషుల రూపంలో ఉన్న మృగాలు. నా బిడ్డ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. అయ్యా చంద్రబాబూ.. నీకు జాలిలేదా? అమ్మా అనితమ్మా.. నీకు ఆడ పిల్లల్లేరా? పవన్‌కళ్యాణ్‌.. నీకు మనసు లేదా?’ అంటూ మెడికో పీజీ డాక్టర్‌ ప్రియాంక తండ్రి వెంకటేష్‌ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రియాంక కేసును రాజకీయ ఒత్తిళ్లతో తారుమారు చేస్తున్నా­రనే అనుమానంతో ఆదివారం రాజమహేంద్రవరంలోని ప్రకాశ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

ఘటన అనంతరం ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అందలేదని, ఆసుపత్రి ఖర్చుల విషయంలోనూ సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఒకసారి ‘మీకు మేమున్నాం.. బాధపడకండి’ అంటూ ఫోన్‌ చేశారని, ఆ తర్వాత ఎలాంటి స్పందన లేదన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్‌ కనీసం స్పందించక పోవడంపై వెంకటేష్‌ ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. ప్రియాంకను హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. 

ఆసుపత్రి యాజమాన్యంకు ఫోన్‌ చేసి అందుతున్న చికిత్సపై ఒక్కసారైనా ఫోన్‌ చేశారా? మెరుగైన సేవలు అందించండని ప్రభుత్వం నుంచి మెస్సేజైనా పెట్టారా? ప్రభుత్వం పని చేస్తుందో లేదో అర్థం కావడం లేదు. మూడు సార్లు కావాలనే కారుతో ఢీకొట్టి, ఆ తర్వాత తలపై నుంచి కారును పోనిచ్చారంటే చంపాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. నిందితులు ఘటన తర్వాత కూడా సాధారణంగానే డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్లారని ఆరోపించారు. చట్టాలపై ప్రజలకు నమ్మకం కలగాలంటే కఠినంగా అమలు చేయాలని, తమకు న్యాయం చేయాలని వెంకటేష్‌ వేడుకున్నారు. ‘ఇంత దారుణానికి పాల్పడిన మృగాలను కఠినంగా శిక్షించండి.. ఉరి తీయండి’ అంటూ కన్నీటితో విజ్ఞప్తి చేశారు.

మా కడుపు కోతను అర్థం చేసుకోండి
‘మా కుటుంబంలో మొదటి డాక్టర్‌ కాబోతోందని, ఎంతో మంచి పేరు వస్తుందని ఆశించాం. ఒకరు సక్సెస్‌ అయితే ఎంతో మందికి ఇన్‌స్ఫిరేషన్‌గా ఉంటుందని ఆశపడ్డాం. నాకు ముగ్గురూ అమ్మాయిలే. మీకు పెళ్లిళ్లు చేశాక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారని మాట్లాడినప్పుడు మొత్తం కుటుంబాన్ని నేను చూసుకుంటానని హామీ ఇచ్చింది ప్రియాంక. అలాంటి మెడికల్‌ పీజీ విద్యార్థిని అందమైన జీవితాన్ని చిదిమేశారు. మా కలల సౌధం కూల్చేశారు. మా కడుపు కోతను అర్థం చేసుకోండి. ఈ ఘటన మా కుటుంబానికి తీరని లోటు. మద్యం మత్తులో ఆడపిల్లను హత్య చేసిన వారు హాయిగా తిరగొచ్చా? చట్టాలపై భరోసా రావాలంటే సమాజంలో భయం కలిగేట్లు చేయండి’ అని వెంకటేశ్‌ కన్నీటిపర్యంతమయ్యారు. 

కీలక ఆధారాలు సేకరించాం
వైద్య విద్యార్థిని ప్రియాంక కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించి నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ తెలిపారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న రాత్రి స్వతంత్ర ఆసుపత్రి నుంచి సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లగా ప్రియాంక వెంటిలేటర్‌పై ఉన్నట్లు తెలిపారు. ఆమె స్నేహితుడు ఉమేష్‌ నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశామన్నారు. 

మరుసటి రోజు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, ప్రియాంక ప్రయాణిస్తున్న బైక్‌ను కారుతో మూడుసార్లు ఢీకొట్టినట్లు గుర్తించామని చెప్పారు. దీంతో ఇది ప్రమాదం కాకుండా ఉద్దేశ పూర్వకంగా జరిగిన ఘటనగా కేసు నమోదు చేసి, ఈ నెల 6న నిందితులిద్దరినీ రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. నిందితుల నేర చరిత్రపైనా ఆరా తీశామన్నారు. కారు నంబర్‌ ప్లేట్లు తొలగించి డిక్కీలో పెట్టారని, మొదటి నిందితుడు దస్వంత్‌ కారులోనే నిద్రిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. దస్వంత్‌ చెన్నైలో బీటెక్‌ చేశాడని, విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని, రెండో నిందితుడు జోసెఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. ప్రియాంక మృతి చెందితే కేసును హత్య కేసుగా మారుస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు : సీఎం చంద్రబాబు
రాజమండ్రిలో ఈ నెల 3వ తేదీన ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో పీజీ మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎంతో భవిష్యత్‌ ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా అధికారులతో ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారని ఎస్పీ వివరించారు. నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో శిక్షలు పడేలా చూడాలని, బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆరి్థక సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

వారం రోజులు మృత్యువుతో పోరాడి 
రాజమహేంద్రవరంలో ఈ నెల 3వ తేదీన కారుతో మూడు సార్లు ఢీకొట్టి.. తలపై నుంచి ఎక్కించడంతో తీవ్ర గాయాలపాలైన మెడికో పీజీ డాక్టర్‌ ప్రియాంక (28) ఆదివారం మధ్యా­హ్నం 3 గంటలకు మృతి చెందినట్లు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రి వైద్యులు ప్రక­టించారు. ప్రియాంక తల్లిదండ్రులు కర్నూ­లు నుంచి వెళ్లి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంటున్నారు. కర్నూలు మెడికల్‌ కాలేజీలో ఎంబీబీ­ఎస్‌ పూర్తి చేసిన ప్రియాంక రాజానగరంలోని జీఎస్‌ఎం మెడికల్‌ కళాశాలలో డెర్మటా­లజీ పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఘటన జరిగిన తర్వాత నుంచి ఆమెకు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స అందించారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరా­డిన ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement