ఆ ఓట్లు ఎలా పడ్డాయో చెప్పండి | Parakala Prabhakar on public verdict on 2024 election results | Sakshi
Sakshi News home page

ఆ ఓట్లు ఎలా పడ్డాయో చెప్పండి

Aug 10 2026 4:59 AM | Updated on Aug 10 2026 4:59 AM

Parakala Prabhakar on public verdict on 2024 election results

ఏపీలో అర్ధరాత్రి ఓట్ల మాయాజాలం 

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ నిలదీత 

నిమిషానికి మూడు ఓట్లు వేయడం సాధ్యమయ్యే పనేనా? 

రాత్రి 11 – 2 గంటల మధ్య 17.19 లక్షలకుపైగా ఓట్లు ఎలా పోలయ్యాయి? 

ఇందుకు సంబంధించిన వీడియో, సీసీటీవీ, రికార్డులు ఎందుకు బయటపెట్టడం లేదు? 

ఈవీఎంల వల్ల కచ్చితమైన సమాచారం రాదు.. ఎక్కడైనా తేడా జరగొచ్చు

సాక్షి, అమరావతి : ‘ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగనంత వేగంగా ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ జరిగిందని చెబుతున్నారు. నిమిషానికి మూడు ఓట్లు పడేంత వేగంగా పోలింగ్‌ ఎలా సాధ్యమైంది? దీనిపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. 2024 ఎన్నికల ఫలితాలను ప్రజా తీర్పు అనడం కష్టం’ అని ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ అన్నారు. స్వర్ణాంధ్ర వేదిక ఆధ్వర్యంలో ‘ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్ల మాయాజాలం–వాస్తవాలు’ అంశంపై ఆదివారం విజయవాడలో జరిగిన సదస్సులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. 

సీనియర్‌ జర్నలిస్ట్‌ కె. బాలగంగాధర్‌ తిలక్‌ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరకాల పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా 2024 ఏపీ ఎన్నికల పోలింగ్‌ గణాంకాలను విశ్లేషించారు. మే 13న సాయంత్రం 5 గంటలకు 68.04 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించగా, తుది లెక్కల్లో పోలింగ్‌ 81.79 శాతంగా నమోదైందన్నారు. ముఖ్యంగా రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల మధ్య 3,500 పోలింగ్‌ కేంద్రాల్లో 17,19,482 ఓట్లు నమోదయ్యాయని, అంటే ఒక్కో బూత్‌లో సగటున 492 ఓట్లు, నిమిషానికి 3.6 ఓట్లు చొప్పున పోలైనట్లు వివరించారు. 

పగటి సమయంలో ఒక్కో బూత్‌లో సగటున గంటకు 60.7 ఓట్లు మాత్రమే పోలవగా, అర్ధరాత్రి సమయంలో గంటకు 200కు పైగా ఓట్లు ఎలా నమోదయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఒక్కో ఓటుకు సుమారు 20 సెకన్ల సమయం మాత్రమే పట్టిందని, ఇది సాధ్యమేనా అని సందేహం వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో ఒక్క ఓటు వేయడానికి 76 నుంచి 123 సెకన్ల సమయం పడుతోందని తెలిపారు.

ఓటర్ల వీడియోలు బయట పెట్టండి
అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలో నిలబడ్డారంటే, వారి వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలు ఎందుకు బయటపెట్టడం లేదని పరకాల ప్రశ్నించారు. పోలింగ్‌ సిబ్బంది రికార్డు పుస్తకాల్లో క్యూలో ఉన్న ఓటర్ల వివరాలు నమోదు చేశారా అని ప్రశ్నించారు. నమోదు చేస్తే వాటిని వెల్లడించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు. ఈవీఎంల ద్వారా నమోదయ్యే ఓట్లపై అనుమానాలు ఉన్నాయని, ఓటరు వేసిన ఓటు సరిగ్గా నమోదైందని, అదే లెక్కించబడిందని నిర్ధారించడమే ప్రజాస్వామ్య లక్ష్యమని అన్నారు. జర్మనీ వంటి దేశాలు ఈవీఎంలను పక్కనపెట్టి బ్యాలెట్‌ విధానాన్ని అనుసరిస్తున్నాయని చెప్పారు. 

వీవీప్యాట్‌ స్లిప్పులను ఎందుకు లెక్కించరు?
ఓట్ల లెక్కింపుపై అనుమానాలు ఉంటే వీవీప్యాట్‌ స్లిప్పులను ఎందుకు లెక్కించడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ప్రశ్నించారు. అర్ధరాత్రి భారీగా పోలింగ్‌ జరిగిందని చెబుతున్నప్పుడు దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు ఎందుకు చూపించడం లేదని నిలదీశారు. ఈవీఎంలలో అవకతవకలకు అవకాశం ఉందన్న అంశాన్ని గతంలో చంద్రబాబే ప్రస్తావించారని, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నందున ఈ అంశంపై విచారణ జరిపించి వాస్తవాలను వెల్లడించాలని కోరారు. 

సర్‌ పేరుతో చాలా మంది ఓట్లు తీసేస్తున్నారని, ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో స్టాలిన్, మమతా బెనర్జీ ఓటమి చెందిన నియోజకవర్గాల్లో అదే జరిగిందని, ఏపీలోనూ అదే పరిస్థితి వస్తుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ, ఒక బూత్‌కు చెందిన ఓటర్లను మరో బూత్‌కు తరలించి, గంటల తర్వాత అర్ధరాత్రి వరకు ఓట్లు వేయించిన ఘటనను వివరించారు. ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ సదస్సులో పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, విశ్లేషకులు పాల్గొన్నారు.

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజా సైన్యం కావాలి: పరకాల
రాజ్యాంగ విలువలను ధ్వంసం చేసే శక్తులు బలపడుతున్న ప్రస్తుత తరుణంలో రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రజలతో కూడిన ఒక బలమైన సైన్యం తయారు కావాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విలువలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భారతదేశ ప్రజలమైన మనం (వి ద పీపుల్‌ ఆఫ్‌ ఇండియా) సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం విజయవాడలోని నాస్తిక కేంద్రం (డాక్టర్‌ సమరం హాస్పిటల్‌)లో తెలుగు రాష్ట్రాల సదస్సు నిర్వహించారు. 

సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన డీవీవీఎస్‌ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా హాజరైన పరకాల ప్రభాకర్‌ ‘దేశంలో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలు–పౌర సమాజం కర్తవ్యాలు’ అనే అంశంపై ప్రసంగించారు. గతంలో ఐరోపా దేశాల్లో మైనార్టీలు ఎదుర్కొన్న పరిస్థితులను పరకాల ప్రభాకర్‌ వివరించారు. ప్రస్తుతం దేశంలో ఎస్‌ఐఆర్‌ (సర్‌) పేరుతో భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు జరుగుతోందని పరకాల ప్రభాకర్‌ విమర్శించారు. 

తద్వారా ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, ఆదివాసీలు, నిరుపేదలు, రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవించే వర్గాలే ఎక్కువగా ప్రభావితమవుతున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ సమరం, సంస్థ వ్యవస్థాపకులు కటారి శ్రీనివాసరావు, బండ్ల శ్రీనివాస్, మనోరమ, చుండూరి రాజేంద్ర ప్రసాద్, రిటైర్డ్‌ జడ్జి అడవాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement