నేడు నల్ల బ్యాడ్జీలతో జూడాల నిరసన | Junior doctors protest with black badges today | Sakshi
Sakshi News home page

నేడు నల్ల బ్యాడ్జీలతో జూడాల నిరసన

Aug 10 2026 5:45 AM | Updated on Aug 10 2026 5:45 AM

Junior doctors protest with black badges today

స్టైపెండ్‌ పెంచాలని కోరుతున్నాపట్టించుకోని ప్రభుత్వం 

పలు దఫాలు విన్నవించినా స్పందన కరువు 

సోమవారం నుంచి సమ్మెకు సిద్ధం కావడంతో చర్చలకు పిలిచిన ప్రభుత్వం  

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో జూనియర్‌ వైద్యులు (జూడాలు) సమ్మెకు సిద్ధమవ్వడంతో ప్రభుత్వం చర్చలకు పిలిచింది. వైద్య శాఖ కార్యదర్శి వీరపాండియన్‌ అధ్యక్షతన అధికారుల కమిటీ సోమవారం ఏపీ జూడా అసోసియేషన్‌తో సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి తలపెట్టిన సమ్మె కార్యాచరణలో ఏపీ జూడా అసోసియేషన్‌ స్వల్ప మార్పులు చేసింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలపనున్నారు. 

ప్రభుత్వంతో చర్చల అనంతరం వచ్చే స్పందన ఆధారంగా సమ్మెపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఈశ్వర్‌ శంకర్‌ ప్రకటించారు. జూడాల స్టైపెండ్‌ పెంపుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండ టంతో వీరంతా సమ్మెకు సిద్ధమ య్యారు. ప్రభుత్వం ప్రతి రెండేళ్లకు ఒకసారి స్టైపెండ్‌ను పెంచాల్సి ఉంది. యథావిధిగా నడవాల్సిన ఈ ప్రక్రియను చంద్రబాబు సర్కారు ఆలస్యం చేస్తూ వస్తోంది. దీంతో గత ఏడాది డిసెంబర్‌ నుంచి స్టైపెండ్‌ పెంచాలని జూడా అసోసియేషన్‌ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వైద్య శాఖ ఉన్నతాధికారులు, మంత్రి, సీఎంకు పలుమార్లు విన్నవించినా ప్రభుత్వంలో మాత్రం చలనం లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో ఈనెల ఒకటో తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లాలని ఏపీ జూడా అసోసియేషన్‌ నిర్ణయించింది. దీంతో జూడా ప్రతినిధులతో చర్చలు జరిపి సమ్మె వాయిదా వేసుకోవాలని ఉన్నతాధికారులు కోరారు. ఈ క్రమంలో వారం పాటు సమ్మె వాయిదా వేసుకుంటామని, ఆలోగా స్టైపెండ్‌ పెంపు ఉత్తర్వులు ఇవ్వా లని ప్రభుత్వానికి జూడా అసోసియేషన్‌ ప్రతినిధులు షరతు పెట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో జూడాలు సమ్మెకు సిద్ధమైపోయారు. 

తమిళనాడు విధానం అమలు
ఇప్పటి వరకూ రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకు ఓసారి 15 శాతం చొప్పున జూడాల స్టైపెండ్‌ పెంచడం ఆనవాయితీ. ఇలా పెంచుకుంటూపోతే ఆర్థిక భారం ఎక్కువ అవుతోందని చంద్రబాబు సర్కా రు భావిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు తరహాలో 3 శాతం వార్షిక పెంపు విధానం అమలుకు డీఎంఈ నుంచి ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ ఇంటర్న్స్‌కు రూ.25,906, పీజీలకు రూ.60 వేల నుంచి రూ.64,767 మేర స్టైపెండ్‌ ఉంది. ఈ మేరకు 2024లో ఆగస్టులో ప్రభుత్వం స్టైపెండ్‌పెంపు నిర్ణయం తీసుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement