పోలీస్‌స్టేషన్‌ అడ్డాగాదామచర్ల దౌర్జన్యాలు | Balineni Srinivasa Reddy makes serious allegations against Ongole TDP MLA | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌ అడ్డాగాదామచర్ల దౌర్జన్యాలు

Aug 10 2026 6:03 AM | Updated on Aug 10 2026 6:03 AM

Balineni Srinivasa Reddy makes serious allegations against Ongole TDP MLA

ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యేపై జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని తీవ్ర ఆరోపణలు 

మద్యం, ఇసుక, గ్రావెల్‌ మాఫియాల్లో దామచర్లకు వాటాలు 

ఆయన ఇల్లు కేంద్రంగా డ్వాక్రా రుణాల్లో అక్రమాలు 

రేషన్‌ బియ్యం మాఫియా నుంచి నెలకు రూ.25 లక్షలు వసూలు  

వీఆర్‌కు పంపిన సీఐ విజయకృష్ణ్ణకు భూ కబ్జాల కోసమే మళ్లీ అక్కడే పోస్టింగ్‌

కార్మిక నగర్‌ను కూల్చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?

ఒంగోలు టౌన్‌: ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ రేషన్‌ బియ్యం నుంచి మద్యం.. ఇసుక.. గ్రావెల్, భూకబ్జా.. మెప్మా.. నగరపాలక సంస్థ కేంద్రంగా భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడని జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దామచర్ల ఏకంగా పోలీస్‌ స్టేషన్లే అడ్డాగా సెటిల్‌మెంట్లకు దిగారని మండిపడ్డారు. ఆదివారం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దామచర్లపై విరుచుకుపడ్డారు. దామచర్ల అక్రమాలను బయటపెడుతున్న వారిపై పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కావాలనే తన అనుచరులను వేధిస్తున్నాడని మండిపడ్డారు.  

భూ కబ్జాల కోసం సీఐకు మళ్లీ పోస్టింగ్‌.. 
అవినీతి ఆరోపణలపై వీఆర్‌కు పంపిన తాలూకా సీఐ విజయకృష్ణ్ణను వారం తిరగకుండానే తిరిగి అక్కడే పోస్టింగ్‌ వేయించారని బాలినేని పేర్కొన్నారు. ఎమ్మెల్యే జనార్దన్‌ తనను తిరిగి రప్పిస్తారని, ఇక్కడ సెటిల్మెంట్లు చేయాల్సిన భూములు చాలా ఉన్నాయని వీఆర్‌కు వెళ్లే రోజు పోలీసులతో సీఐ విజయకృష్ణ చెప్పినట్లు తెలిసిందన్నారు.   

రేషన్‌ మాఫియా నుంచి నెలకు రూ.25 లక్షల వసూళ్లు... 
నియోజకవర్గంలో రేషన్‌ మాఫియా నుంచి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ప్రతి నెలా రూ.25 లక్షలు వసూలు చేయడం నిజం కాదా? అని బాలినేని ప్రశ్నించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా తన మీద, తన కుమారుడి మీద దామచర్ల తప్పుడు ఆరోపణలు ప్రచారం చేశాడన్నారు. దామచర్ల అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలను తాను నిరూపిస్తానని స్పష్టం చేశారు. డ్వాక్రా రుణాల్లో అవినీతి నీ ఇంట్లో జరిగింది నిజం కాదా? అని నిలదీశారు. దీనిపై వేసిన విచారణ అధికారులు ఏం తేల్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మున్సిపాలిటీలో రూ.8 కోట్ల అవినీతి జరిగిందని అధికారులను సస్పెండ్‌ చేశారని, మరి అవినీతి డబ్బులను రికవరీ ఎందుకు చేయడం లేదన్నారు. 

ఒంగోలులో ఉన్న మద్యం దుకాణాలు ఎమ్మెల్యే జనార్దన్‌వి కావా? అని ప్రశ్నించారు. రాజు పాలెంలో ఆయనకు ఎన్ని రొయ్యల చెరువులు ఉన్నాయో వెల్లడించాలన్నారు. తన హయాంలో జరిగిన భూ వివాదాలపై అప్పటి ప్రభుత్వం సిట్‌ విచారణకు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. సిట్‌కు అందిన ఫిర్యా­దుల లిస్టు తెప్పించుకొని దామచర్ల పోలీసుల ద్వారా బెదిరించి సెటిల్మెంట్‌ చేసుకుంటున్నారని ఆరోపించారు. తన అనుచరుల మీద ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని బాలినేని ఆరోపించారు. ఇక నుంచి ఇక్కడే ఉంటూ అమీతుమీ తేల్చుకుంటానని బాలినేని స్పష్టం చేశారు.  

పోలీసు స్టేషన్‌లో బలవంతంగా రాజీ..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒంగోలు వెంకట సుబ్బారావుకు చెందిన భూములు కబ్జా చేశా­రని ఆరోపించిన దామచర్ల జనార్దన్‌ ఇప్పుడు ఏం చేస్తున్నాడో చెప్పాలని బాలినేని ప్రశ్నించారు. సుబ్బారావును స్టేషన్‌కు పిలిపించి బలవంతంగా రాజీ చేసి సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. పోలీసు స్టేషన్లో అగ్రిమెంట్‌ చేసుకోవడం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. దీనికి సంబంధించి తాలూ­కా పోలీసు స్టేషన్లో జరిగిన పంచాయితీ వీడియోను మీడియా ముందు బాలినేని ప్రదర్శించారు. కార్మిక నగర్‌లో 15 ఏళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను రౌడీలు కూల్చి వేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement