సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలను నిలదీస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడిని పెంచాయి. అయితే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ర్యాలీలను అడ్డుకోవడం, నేతలను అదుపులోకి తీసుకోవడం.. పలు చోట్ల లాఠీఛార్జీలు చేయడంపై వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిరసనలను అడ్డుకోవడం చంద్రబాబు ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.
డీఎస్సీ నియమకాల్లో జరిగిన అవినీతికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయడం, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ అభ్యర్థులు, డీఎస్సీ సంఘాలతో వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పలుచోట్ల పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు.

పులివెందులలో లాఠీఛార్జ్..
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నియోజకవర్గంలో పోలీసులు దౌర్జన్యకాండకు పాల్పడ్డారు. పులివెందులలో ఆర్డీవోకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పలువురికి గాయాలు కాగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. అంతకు ముందు.. ఎంపీ అవినాశ్‌రెడ్డికి ర్యాలీ నిర్వహించడానికి వీల్లేదంటూ పోలీసులు నోటీసులు అందించారు.
చీపురుపల్లిలో బొత్సకు అడ్డంకులు
చీపురుపల్లిలో నిర్వహించాల్సిన నిరసన కార్యక్రమానికి వెళ్తున్న సీనియర్ నేత, మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడం సరికాదని బొత్స మండిపడ్డారు. రోడ్డుపైనే ఆయన ఆందోళన చేపట్టారు.

కొడాలి నాని హౌస్ అరెస్ట్
మాజీ మంత్రి కొడాలి నానిని గుడివాడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. డీఎస్సీ అంశంపై నిరసనల్లో పాల్గొనకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ పరిణామంపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు మండిపడుతున్నారు.
అటు రాజమండ్రిలోనూ మాజీ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతుండగా.. పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు.
విశాఖలో అరెస్టులు
విశాఖపట్నంలోని మారియట్ సెంటర్ వద్ద నిరసనకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కేకే రాజు సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
విజయవాడలో దేవినేని ర్యాలీకి అడ్డంకులు
విజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనుమతి లేదంటూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
అవనిగడ్డలోనూ అడ్డగింత
అవనిగడ్డలోనూ వైఎస్సార్‌సీపీ నేతల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలపై గొంతెత్తే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించింది.
తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో.. గన్నవరంలో వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతున్నాయి. నెల్లూరు, కర్నూల్, అనంతపురం, అవనిగడ్డ.. ఇలా పలు చోట్ల వైఎస్సార్‌సీపీ ర్యాలీలు నిర్వహించకుండా పోలీసులు అడ్డుపడుతున్నారు. నిరసన తెలియజేస్తున్న వాళ్లపైకి లాఠీ ప్రయోగిస్తున్నారు.
‘శాంతియుత నిరసనలకు ఎందుకు అభ్యంతరం?’
డీఎస్సీ అంశంపై శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, దాన్ని అడ్డుకోవడం సరికాదని అన్నారు.


