డీఎస్సీపై ప్రశ్నిస్తే దాడులా?.. ‘క్రిమినల్స్‌ అడ్డా’ ఎవరిది బాబు? | KSR's Comments On The Confused Attitude Of TDP Leaders | Sakshi
Sakshi News home page

డీఎస్సీపై ప్రశ్నిస్తే దాడులా?.. ‘క్రిమినల్స్‌ అడ్డా’ ఎవరిది బాబు?

Aug 10 2026 10:06 AM | Updated on Aug 10 2026 10:47 AM

KSR's Comments On The Confused Attitude Of TDP Leaders

విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు తన అనుచరులతో కలిసి గత గురువారం నాడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష శిబిరంపై దాడి చేశారు. టెంట్ పీకేశారు. అక్కడ కొందరు టీడీపీ గూండాలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. సరిగ్గా అదే టైమ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో ఉన్నారు. బోండా ఉమ అరాచక ప్రవర్తనపై ఆయనకు సమాచారం అందే ఉండాలి. అయినా అలాంటివి చేయవద్దని చెప్పకపోగా, వైఎస్సార్‌సీపీవారిని ఉద్దేశించి గొడ్డలి పార్టీ, క్రిమినల్స్ తయారీ అడ్డా అంటూ చంద్రబాబు విమర్శించారట.

కొన్నాళ్ల క్రితం బోండా ఉమ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పక్కన కూర్చుంటే చంద్రబాబుకు కోపం వచ్చింది. వెంటనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి పార్టీ కమిటీ వేసి మందలించే ఏర్పాటు చేశారు. తదుపరి తన కుమారులతో కలిసి బోండా ఉమ చంద్రబాబును కలిశారు. అక్కడ ఏమి మాట్లాడుకున్నారో తెలియదు కాని, మరుసటి రోజే ఉమా విజయవాడలో గూండాయిజానికి బరి తెగించారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై ఆయన అనుచరులు దాడి చేశారు. విజిటేరియన్ అయిన విష్ణుపై కోడిగుడ్లు విసిరారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు, మంత్రి లోకేష్ రాజీనామా కోరుతూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. వారు తమ డిమాండ్‌తో ప్రశాంతంగా దీక్షలు చేస్తున్నారు. దీనిని భరించడం టీడీపీ నాయకత్వానికి కష్టంగా మారింది.

నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌పై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఫలితంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది. జార్ఖండ్‌లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. వాటికి ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా మద్దతు ఇస్తున్నారు. ఏపీలో కూడా డీఎస్సీ టీచర్ల ఎంపికలో అక్రమాలు జరిగాయని మాజీ సీఎం జగన్ ఆధార సహితంగా ఆరోపణలు చేశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వ పక్షాన సరైన జవాబు ఇవ్వలేకపోతున్నారు. పలువురు డీఎస్సీ అభ్యర్ధులు తమకు అన్యాయం జరిగిందని సాక్ష్యాలు చూపుతున్నారు. అయినా ప్రభుత్వం డబాయించి తప్పించుకోవాలని చూస్తోంది.

ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ వివిధ రూపాలలో ఆందోళనలు సాగిస్తోంది. డీఎస్సీ అక్రమాలపై జరుగుతున్న ప్రచారం ప్రజలలోకి వెళుతుండడంతో చంద్రబాబు, లోకేష్‌లు అసహనానికి గురవుతున్నారు. అందువల్లే ప్రభుత్వం అనుకుంటే రెండు నిమిషాలలో అణచివేయగలదని బెదిరించడం, ఆందోళన చేస్తున్న రైతులను, నిరుద్యోగ యువతను గంజాయి బాచ్ అని అనడం వంటివి చేశారనిపిస్తుంది. ఇవన్ని ముఖ్యమంత్రి స్థాయికి తగనివని ఆయనకు తెలిసినా ఏదో నిస్సహాయ స్థితిలో పడ్డారనిపిస్తుంది. 

ఎదురుదాడిలో భాగంగా కర్నూలులో కొందరితో ప్రదర్శన చేయించారు. వారు ఏ తరహా వారో తెలియదు. ఎల్లో మీడియా ప్రముఖంగా ఆ కథనాన్ని ఇచ్చింది. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ర్యాలీ చేస్తే వారు పవిత్రులు, వ్యతిరేకంగా చేస్తే గంజాయి బాచ్‌లని ప్రచారం చేస్తారన్నమాట. తనవైపు వాదన సరిగా లేనప్పుడే ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడతాయన్న అబిప్రాయం ఉంది. దేవరపల్లిలో జగన్ టూర్‌లో ఒక చిన్న హోటల్‌లో జరిగిన ఉదంతాన్ని కూడా పెద్దదిగా ఫోకస్ చేయాలని యత్నించి చంద్రబాబు అండ్ కో భంగపడ్డారు. ఆ హోటల్ యజమానురాలు లక్ష్మి వచ్చి జగన్‌ను కలిశారు. వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని ఒత్తిడి చేసినా ఆమె ఒప్పుకోకపోవడం గొప్ప విషయమే. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు, లోకేష్‌లను సంతృప్తిపరచడానికి బోండా ఉమా కాని, మరికొన్ని చోట్ల ఇతర టీడీపీ నేతలు కాని దాడులు చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది. దానికి తగినట్లే ఉమా మాట్లాడుతూ లోకేష్‌ను విమర్శిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అనుమతి లేకుండా దీక్ష శిబిరాలు నిర్వహిస్తారా అని అంటున్నారు.

నిజానికి విష్ణు పోలీసులకు చెప్పే దీక్ష శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. చిత్రంగా శిబిరానికి రక్షణ కల్పించవలసిన పోలీసులు దాడికి పాల్పడ్డ ఉమాను కాకుండా, శాంతియుతంగా కూర్చుని ఉన్న విష్ణును వాహనం ఎక్కించి తరలించారు. అదే టీడీపీ ఎక్కడైనా సభ పెడితే ఆ సమీపంలోకి అయినా విపక్షాలను రానిస్తారా? ఇప్పుడు చెప్పండి.. క్రిమినల్స్ తయారీ అడ్డాగా టీడీపీ ఉందా? వైఎస్సార్‌సీపీ ఉందా? ఈ దాడుల ద్వారా డీఎస్సీ అక్రమాల వ్యవహరం మరింతగా ప్రజలలోకి వెళుతుంది. ప్రభుత్వ తీరుపై మరిన్ని అనుమానాలు బలపడతాయి. మరికొన్ని ఉదాహరణలు గమనించండి.

ఒక మంత్రి తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఒక ఎన్‌ఆర్ఐ మహిళ స్వయంగా లోకేష్‌కు ఫిర్యాదు చేశారట. అయినా ఆ మంత్రిపై చర్య తీసుకోలేదే? అంటే ఎవరు క్రిమినల్స్ అడ్డాలో ఉన్నట్లు అవుతుంది! ఆలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై తప్పుడు ఆరోపణలు చేసి అరెస్టు చేశారే. ఒక టీడీపీ నేత తన భార్య నైటీని తానే చించి ఎమ్మెల్యేపై ఆరోపించిన విషయం వీడియో సహితంగా బయటపడి ఉండకపోతే, ఎమ్మెల్యేపై ఆరోపణలను నమ్మే పరిస్థితి వచ్చేది కదా? ఇలాంటివాటిని చేసేవారిని కదా క్రిమినల్స్ అనాల్సింది. అలాంటివారిని ఎంకరేజ్ చేసే పార్టీని కదా క్రిమినల్స్ తయారు చేసే అడ్డా అనాల్సింది అని వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు. దానిని కాదనగలరా?

ఈ మధ్యనే గుంటూరులో ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసింది కూడా టీడీపీ నేతే కదా! అంతేకాదు. కొందరు కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది మహిళలపై ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడింది ఫిర్యాదులు వచ్చాయే. ఏకంగా ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ నుంచే వీడియో కాల్ చేసిన ఘట్టం మరిచిపోయారా? ఆ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన యువతిని నడిరోడ్డులో పోలీసు లాఠీతో కొట్టింది జనసేన నేత కదా! ఆ ఎమ్మెల్యేపై కాని, దౌర్జన్యం చేసిన జనసేన నేతపై కాని ఏమైనా చర్య తీసుకున్నారా? పలు చోట్ల బాధితులపైనే కేసులు పెడుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.

గతంలో వైఎస్సార్‌సీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు, లోకేష్‌లు ఇలాగే క్రిమినల్స్ అంటూ ఆరోపణలు చేసేవారు. ఎన్నికల సమయానికి వారిలో పలువురిని టీడీపీలో చేర్చుకున్నారు. అంటే టీడీపీ క్రిమినల్స్ అడ్డాగా మారిందని ఒప్పుకుంటున్నటా?కాదా? డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్నది వైఎస్సార్‌సీపీ ఆరోపణ. దానికి సమాధానం ఉంటే చెప్పాలి. లేదా ధైర్యం ఉంటే సీబీఐ విచారణకు ఒప్పుకోవచ్చు.

గతంలో చంద్రబాబు డిమాండ్ చేసిన వెంటనే తన కుమారుడు జగన్‌పై సీబీఐ విచారణకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒప్పుకున్న ఘటనను పలువురు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు తన కుమారుడిపై డీఎస్సీ ఆరోపణలు వస్తే ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లుగా వైఎస్సార్‌సీపీ నేతలపైన, కార్యకర్తలపైన జరిగిన హత్యలు, హత్యాయత్నం ఘటనలు, టీడీపీ నేతల దౌర్జన్యాలు ఇవన్ని చూస్తుంటే 1983లో తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో ఎన్‌టీ రామారావు చెప్పిన ఆదర్శాలు ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి?

ఒక వైపు క్రిమినల్స్‌ను ప్రోత్సహిస్తూ మరో వైపు వైఎస్సార్‌సీపీపై అదే విమర్శ చేయడం చంద్రబాబుకే చెల్లిందని వైఎస్సార్‌సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరు తప్పు చేసినా తప్పే అని, నిష్ఫక్షపాతంగా పనిచేయండని పోలీసులకు చెప్పవలసిన సీనియర్ నేత చంద్రబాబు ఈ వయసులో కూడా ఇలాంటి ప్రమాణరహిత రాజకీయాలు చేయడం వల్ల ఆయనకు అప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నది ఆలోచించుకోవాలి. రెడ్‌బుక్ అరాచకాలకు స్వస్థి పలికి, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే నష్టం.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement