మొజ్తాబా ఖమేనీ ఎక్కడ?.. ఇరాన్ సంచలన ప్రకటన | Iran promises new footage of Mojtaba amid public absence | Sakshi
Sakshi News home page

మొజ్తాబా ఖమేనీ ఎక్కడ?.. ఇరాన్ సంచలన ప్రకటన

Aug 10 2026 8:03 AM | Updated on Aug 10 2026 8:46 AM

Iran promises new footage of Mojtaba amid public absence

టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడుతుందా? ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో చుట్టుముడుతున్న అనుమానాల మధ్య ఇరాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మోజ్తబా ఖమేనీకి సంబంధించిన మరిన్ని వీడియోలు, ఫొటోలను త్వరలో విడుదల చేస్తామని వెల్లడించింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరోసారి అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.

అసలు ఏం జరుగుతోంది?
తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి అనంతరం మార్చిలో ఇరాన్ అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ.. అప్పటి నుంచి బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన తాజా, స్పష్టమైన దృశ్యాలు పెద్దగా బయటకు రాకపోవడంతో ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే, ఇటీవల ఇజ్రాయెల్ మీడియా సైతం మోజ్తబా ఖమేనీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందంటూ కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ నుంచి వచ్చిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

‘త్వరలో మరిన్ని వీడియోలు’
బసీజ్ ఆర్గనైజేషన్ డిప్యూటీ అధికారి ఖాసెమ్ ఖొరైషీ మాట్లాడుతూ.. మొజ్తాబా ఖమేనీ ప్రజల్లో ఉన్న దృశ్యాలు, వీధుల్లో పర్యటిస్తున్న వీడియోలు, సాయుధ దళాల కమాండర్లతో సమావేశాల దృశ్యాలను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న అనుమానాలు, విమర్శలకు సమాధానం చెప్పేందుకే ఈ దృశ్యాలను బయటకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు 9న ఓ వీడియో విడుదల
ఇప్పటికే ఆగస్టు 9న ఇరాన్‌కు చెందిన సెమీ-అధికారిక మెహర్ న్యూస్ ఏజెన్సీ ఖమేనీకి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. అయితే ఆ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే విషయాన్ని వెల్లడించలేదు. వీడియోలో ఖమేనీ తన అనుచరులతో మాట్లాడుతున్నట్లు కనిపించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారనే సందేశాన్ని ఇవ్వడమే ఈ వీడియో ఉద్దేశంగా కనిపించింది.

మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. జూలై 21న మోజ్తబా ఖమేనీతో తన సంప్రదింపులు క్రమంగా పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. కానీ ఆగస్టు ప్రారంభంలో మాత్రం.. ఖమేనీతో కమ్యూనికేషన్ “చాలా కష్టంగా ఉంది” అని వ్యాఖ్యానించారు. ఈ రెండు భిన్న వ్యాఖ్యలు ఆయన వాస్తవంగా ఎంతవరకు ప్రభుత్వ వ్యవహారాల్లో చురుకుగా ఉన్నారనే ప్రశ్నలకు దారితీశాయి. కాగా, జూలై చివర్లో మసూద్ పెజెష్కియన్.. మొజ్తాబా ఖమేనీని కలిసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ సమావేశంలో సైనిక వ్యవహారాలతో పాటు విదేశీ మారకద్రవ్య నిర్వహణ, ఇంధన వినియోగం, అంతర్జాతీయ భాగస్వాములతో ఆర్థిక సంబంధాల వంటి కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

అందరి చూపూ ఆ వీడియోలపైనే!
ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టేందుకు ఇరాన్ ప్రభుత్వం మరిన్ని దృశ్యాలను విడుదల చేయనున్న నేపథ్యంలో.. ఆ వీడియోలు ఎప్పుడు చిత్రీకరించబడ్డాయి? ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన ఎంత చురుకుగా ఉన్నారా? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా.. ఇప్పటివరకు విడుదలైన వీడియోలు ఎక్కువగా తేదీ వెల్లడించనివే కావడంతో, కొత్తగా విడుదలయ్యే దృశ్యాలను అంతర్జాతీయ పరిశీలకులు నిశితంగా గమనించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement